ఓం కారం... శబ్దాలకు ప్రధాన ద్వారం

6 Dec, 2015 04:40 IST|Sakshi
ఓం కారం... శబ్దాలకు ప్రధాన ద్వారం

అకార ఉకార మకారాలలో అకారం... భూమి, చె ట్లు లేదా ఇతర వస్తువులకు, ఉ కారం... ఆకారం, రూపం లేని నీరు, గాలి, నిప్పులకు, మకారం... ఆకృతి ఉండీ లేనటువంటివానికి ప్రతీకగా ఉండటం, అంటే ప్రపంచంలో దృఢమైన శక్తి కలిగి ఉండటం. ఈ మూడు పదాంశాలను కలిపితే ఓం వస్తుంది. అంటే ఈ మూడూ కలిస్తేనే సృష్టి అన్నమాట. ఓంకారాన్ని నిరంతరాయంగా ఉచ్చరిస్తూండటం వల్ల, శాశ్వతప్రపంచంలో, అంటే జీవుడు శరీరం విడిచిన తరవాత మోక్షం పొందగలుగుతాడు.

అలౌకికం
దేనిగురించయినా అదే మొదటిది అని చెప్పేటప్పుడు ఓం ప్రథమంగా అని చెబుతారు.ఎందుకంటే ఓంకారం అన్నింటికన్నా ముందుండేది. ఓంకారానికి మతపరంగా ఎనలే ని ప్రాధాన్యముంది. వేదపారాయణం చేసేటప్పుడు, ఇష్టదేవతలను స్తుతించేటప్పుడు ప్రతినామానికీ మొదటగా ఓంకారాన్ని చేర్చిన తర్వాతే ఉచ్చరిస్తారు. సృష్టి ప్రారంభమయ్యాక వచ్చిన మొట్టమొదటి అక్షరం ఓంకారమని వే దోక్తి.

ఓంకారం నుంచి వెలువడే ప్రతిధ్వనులు భగవంతుడు సర్వవ్యాపకుడని  వివరిస్తాయి. బౌద్ధం, జైనం, హిందూ... ఏ మతంలోనైనా దీనికి ప్రాధాన్యత ఎక్కువ. దీనికే ప్రణవ నాదమని కూడా పేరు. ఓంకారాన్ని నాసికతో సుదీర్ఘంగా పలుకుతారు. ఓంకారం అన్ని శబ్దాలకు ప్రధానద్వారం. ఓం అనేది ఏకాక్షరం. పంచ పరమేష్ఠుల నుంచి తయారుచేయబడిందనేది వారి విశ్వాసం.

ఓం నమః అనేది నమక మంత్రానికి సూక్ష్మరూపం.
 ఓంకారాన్ని మొట్టమొదటగా ఉపనిషత్తులు వర్ణించాయి. ఇది ఒక్క భారతీయ సంప్రదాయంలోనే కాదు,నేపాల్‌లో కూడా ఓం అనే అక్షరం అన్నిచోట్లా కనిపిస్తోంది. ఓం అనేది భగవంతుడి పేరు. ఆయనకు సంబంధించిన ప్రతిధ్వని. ఒక్కొక్క అక్షరాన్నీ వరసగా పరిశీలిస్తే అకార ఉకార మకారాలు. ఇది ఆధ్యాత్మికశక్తిని ఈ మూడు శబ్దాలలో చూపుతుంది.
 
ఓంకారం చేత మనలో శక్తి ప్రజ్జ్వరిల్లి ఆ శబ్దోచ్చారణ వల్ల సమాధిస్థితి కలిగి అంత్యాన అపరిమితానందం కలుగుతుంది. ఓంకారం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియచేస్తుంది. అక్షరాలన్నీ ఏర్పడి సగుణబ్రహ్మగా మారుతుంది. మూలాధారంతో బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది.. శరీరంలో ఉన్న నాడీవ్యవస్థలో ఇడ (కుడివైపున ఉన్నవి) అ కారంతోను, పింగళ (ఎడమవైపున ఉన్నవి) ఉ కారంతోను, సుషుమ్న (మధ్యలో ఉన్నవి) నాడీ వ్యవస్థ మ కారంతోనూ ఉత్తేజం చెంది, స్వస్థత పొందుతాయి.

ఆర్యసమాజం ఓంకారాన్ని దైవస్వరూపంగా భావించింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో, ‘నేను ఈ సృష్టికి తండ్రిని. నేనే తల్లిని, ఆధారాన్ని కూడా నేనే. జ్ఞానాన్ని ప్రసాదించే ఓంకారాన్ని నేనే అని ఓంకారం గురించి వివరించాడు. బ్రహ్మశక్తి (సృష్టి), విష్ణుశక్తి (స్థితి), శివశక్తి (లయ) ఓం అనేది ఒక ప్రతీకాత్మక చిహ్నం. విశ్వమంతా ఇదే.

మనం దేనిని చూస్తున్నామో, దేనిని స్పృశిస్తున్నామో, దేనిని వింటున్నామో, దేనిని అనుభూతి చెందుతున్నామో అదంతా ఓంకారమే. మన పరిధిలో ఉండేది మాత్రమే కాక, మన పరిధిని దాటి ఉన్నది కూడా ఓంకారమే. మనం ఓంకారాన్ని శబ్ద మాత్రంగా పరిగణించినా, భగవంతునికి ప్రతీకగా భావించినా అన్నిటినీ కోల్పోయినట్టే.
- డి.వి.ఆర్

మరిన్ని వార్తలు