ప్రపంచంలో అత్యంత కష్టమైన క్రీడ

22 Aug, 2014 23:16 IST|Sakshi
ప్రపంచంలో అత్యంత కష్టమైన క్రీడ

ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్
 
స్విమ్మింగ్.. సైక్లింగ్.. రన్నింగ్.. ఈ మూడు కలిస్తే ట్రయాథ్లాన్. 1.5 కిలోమీటర్ల దూరం స్విమ్మింగ్.. 40 కిలోమీటర్ల సైక్లింగ్.. 10 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసే వారే విజేతలుగా నిలుస్తారు. క్లిష్టమైన క్రీడల్లో ఒకటైన ట్రయాథ్లాన్‌ను మించిన కష్టసాధ్యమైనది మరొకటి ఉంది.

అదే ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్. ప్రపంచంలోనే దీన్ని అత్యంత కష్టమైన క్రీడగా చెబుతుంటారు. ప్రపంచ ట్రయాథ్లాన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతీయేటా జరిగే ఐరన్‌మ్యాన్‌లో పాల్గొనే అథ్లెట్లు 3.86 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసి... ఆ తర్వాత 180.25 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి. ఆ వెంటనే 42.2 కిలోమీటర్ల మారథాన్‌ను పూర్తి చేయాలి.

ఈ మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన వారే విజేత. అయితే ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌ను కేవలం 17 గంటల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే ఈ ట్రయాథ్లాన్‌లో తొలి దశలో స్విమ్మింగ్‌ను ఉ. గం. 9.20 ని. కల్లా పూర్తి చేయాలి. సైక్లింగ్‌ను సా. గం. 5.30 ని.లకు (8 గం. 10 ని. ల్లో) పూర్తి చేసి మారథాన్‌ను మొదలుపెట్టాలి. అర్ధరాత్రి 12 కల్లా (6 గం. 30 ని.ల్లో) ముగించాలి. ఇలా మూడు దశలను వేగంగా ముగించిన వారే ఐరన్‌మ్యాన్ టైటిల్‌ను అందుకుంటారు.
 
హవాయ్ వేదికగా...

కష్టసాధ్యమైన ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్ పోటీలు హవాయ్ వేదికగా ప్రతీయేడాది జరుగుతాయి. 1978 నుంచి ఈ ట్రయాథ్లాన్‌ను నిర్వహిస్తున్నారు. ఐరన్‌మ్యాన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పేరుతో పోటీలను జరుపుతున్నారు.
 

మరిన్ని వార్తలు