మంచి నిద్ర పట్టాలంటే... అలా మాత్రం చదవకండి!

17 Jul, 2015 22:56 IST|Sakshi
మంచి నిద్ర పట్టాలంటే... అలా మాత్రం చదవకండి!

కొత్త పరిశోధన

చాలామంది నిద్రపోయే ముందు ఏదైనా పుస్తకం చదువుతూ పడుకుంటారు. అయితే ఇటీవల పుస్తకాల స్థానాన్ని ఎలక్ట్రానిక్ రీడింగ్ డివెసైస్ ఆక్రమిస్తున్న విషయం తెలిసిందే. సంప్రదాయ పుస్తకాల స్థానంలో కంప్యూటర్లలో ఈ-బుక్స్, చదవడం కోసమే తయారైన కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో నిద్రకు ముందు చదవడం అంత మేలు కాదంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. దీనివల్ల నిద్రపోయే ప్రక్రియకు విఘాతం కలుగుతుందన్నది వారి పరిశోధనల్లో తేలిన విషయం. ఎలక్ట్రానిక్ ఉపకరణం లేదా కంప్యూటర్ నుంచి వెలువడే వెలుగు వల్ల... నిద్ర దెబ్బతింటుందని వారు పేర్కొంటున్నారు. పైగా మామూలు పుస్తకాలకు బదులు ఎలక్ట్రానిక్ ఉపకరణంలో పుస్తకం చదివేవారికి... నిద్రపట్టడానికి పట్టే వ్యవధి పెరుగుతుందట.

ఇలా నిద్రపోయిన వారు ఆ మర్నాడు సాయంత్రం పూట మత్తుగా జోగుతూ ఉంటారనీ, చురుగ్గా ఉండలేరనీ హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ చదివే ఉపకరణంతో వచ్చే వెలుగు వల్ల సర్కాడియన్ రిథమ్ దెబ్బతిని మెదడులో స్రవించాల్సిన మెలటోనిన్ పాళ్లలో మార్పులు వస్తాయి. దాంతో జీవనశైలి కూడా దెబ్బతి అది రొమ్ముక్యాన్సర్, పెద్దపేగు-మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి పెద్ద సమస్యలకూ దారితీసే అవకాశాలు ఎక్కువవుతాయని అంటున్నారు ఈ పరిశోధ కులు. అందుకే రాత్రిపూట నిద్ర పట్టడానికి పుస్తకాన్ని చదివేవారు సంప్రదాయ పుస్తకాలను చదవడమే మేలని వారు సలహా ఇస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు