సాస్ ఇక సీసాకు అంటుకోదు...

15 Nov, 2015 03:40 IST|Sakshi
సాస్ ఇక సీసాకు అంటుకోదు...

టొమాటో సాస్, చిల్లీ సాస్ వంటివి సీసాల్లో దొరుకుతుంటాయి. పూర్తిగా వాడేసిన తర్వాత కూడా ఇవి ఎంతో కొంత మేరకు సీసా లోపలి గోడలకు అంటుకునే ఉంటాయి. వాటిని బయటకు తీయలేక ఆ సీసాలను అలాగే పారేస్తాం. చివరి చుక్క వరకు కెచప్, సాస్ సీసాలను ఖాళీ చేద్దామనుకుంటే మనకు సాధ్యం కాదు. అయితే, ఈ సమస్యకు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) విద్యార్థులు విరుగుడు కనిపెట్టారు.

సాస్, కెచప్ వంటి చిక్కని ద్రావకాలను భద్రపరచే సీసాలకు లోపలిపూతగా ఉపయోగించేందుకు వీరు ‘లిక్విగ్లైడ్’ అనే పదార్థాన్ని రూపొందించారు. ఈ పూత పూసిన సీసాలలో భద్రపరచిన సాస్, కెచప్ వంటి చిక్కని ద్రవాలు చివరి చుక్క వరకు తేలికగా జారిపోయి బయటకు వచ్చేస్తాయి. సీసా ఖాళీ అయిన తర్వాత అందులో ఎలాంటి మరకలూ కనిపించవు. అయితే, ఈ ‘లిక్విగ్లైడ్’ ఒక్కో రకమైన పదార్థానికి ఒక్కో రకంగా తయారు చేయాల్సి ఉంటుందని, సాస్, కెచప్ వంటి ఆహార పదార్థాలు భద్రపరచే సీసాల కోసం ఒకరకంగా, హెయిర్ క్రీములు వంటివి భద్రపరచే ట్యూబులు, సీసాల కోసం మరో రకంగా తయారు చేయాల్సి ఉంటుందని ఎంఐటీ విద్యార్థులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు