అసలైన స్నానం

2 Oct, 2014 23:31 IST|Sakshi
అసలైన స్నానం
  • బౌద్ధవాణి
  • బుద్ధుని కాలంలో వైశాలి ఒక గణతంత్ర రాజ్యం. దాని మహారాజు నందకుడు. ఒకరోజు బుద్ధుడు వైశాలిలోని మహావనంలో ఉన్నాడు. ఆ సాయంత్రం అక్కడే ఆయన తన ధర్మప్రసంగం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి, ఆ వనం పక్కనే ఉన్న తన నివాసం నుండి వెళ్లి బుద్ధుని ధర్మ ప్రసంగాన్ని వింటున్నాడు నందకుడు.

    బుద్ధుడు ఆ రోజు పంచశీల గురించి, అష్టాంగమార్గం గురించి వివరిస్తున్నాడు. బుద్ధుని ధర్మోపన్యాసం వింటూ అందులో లీనమై పోయాడు నందకుడు. ఇంతలో నందకుని రాజసేవకుడు వచ్చి, నందకునితో ‘‘రాజా! తమ స్నానానికి వేళయింది. వేన్నీళ్లు, చన్నీళ్లు సిద్ధం చేశాము’’ అని నెమ్మదిగా చెప్పాడు.
     
    ‘‘సేవకా! చాలు చాలు. నేనిప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. భగవానుని ధర్మ ప్రవచనాలు వింటూ నా మనస్సును కడిగేసుకుంటున్నాను. ధర్మస్నానం చేస్తున్నాను. నీవు చెప్పే బాహ్యస్నానాలకంటే ఇదెంతో మేలైంది. ఆ స్నానం ఇప్పుడు కాదు.. నువ్వు వెళ్లు !’’ అని పంపించేశాడు. తిరిగి బుద్ధుని ధర్మోపన్యాసాల్లో లీనమై పోయాడు. బాహ్యస్నానం వల్ల శరీరం తేలికపడ్డట్టు, ధర్మస్నానం వల్ల అతని మనస్సు తేలిక పడింది.
     
    - బొర్రా గోవర్ధన్
     

మరిన్ని వార్తలు