దేవుని స్వచ్ఛమైన ప్రేమకు శిలువ

13 Apr, 2017 23:46 IST|Sakshi
దేవుని స్వచ్ఛమైన ప్రేమకు శిలువ

హోలీవీక్‌

చేయి తిరిగిన చిత్రకారుడు రంగులు, కుంచెతో కేన్వాస్‌ ముందు నిలబడి చిత్రపటం గీస్తున్నప్పుడు అతని రంగులకు, గీతలకు అర్థం తెలియదు. సంపూర్తిౖయె ప్రదర్శనలో పెట్టినప్పుడే అదెంత అద్భుతమైన కళాఖండమో తెలుస్తుంది. దేవుని ప్రేమ కూడా అంతే! ఆ ప్రేమతో తడిసి తాదాత్మ్యం చెందిన వ్యక్తికే సంపూర్ణంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు సిలువ దేవుని ప్రేమకు ప్రతీక. మానవుడు కోల్పోయిన నిత్యత్వాన్ని, దేవునితో నిత్య సహవాసాన్ని, సంపూర్ణంగా తిరిగి అందించేందుకు దేవుడు చిట్టచివరి ప్రయత్నంగా చేసిన మహా యాగమది.

కరడుగట్టిన నేరస్థులను ప్రజలంతా చూస్తుండగా అత్యంత పాశవికంగా చంపి తద్వారా తమ చట్టం, పాలన పట్ల ప్రజల్లో భయాన్నీ, విధేయతను పెంపొందించడానికి రోమా పాలకులు రూపొందించిన మరణ శిక్ష ‘సిలువ’. అవమానానికి, ఓటమికి, ఖైదీ నిస్సహాయతకు, పాలకుల దుర్మార్గానికి చిహ్నమది. కాని దేవుడు మానవాళిపట్ల తన ప్రేమను వ్యక్తం చేయడానికి దాన్నే సాధనంగా ఎంపిక చేసుకున్నాడు. తద్వారా సిలువ దేవుని ప్రేమకు, సాత్వికతకు, క్షమాపణకు, పాపంపైన మానవుని విజయానికి చిహ్నంగా మారింది.
తన సిలువ మరణం ద్వారా మానవాళికి పాపవిముక్తిని ప్రసాదించాలన్న తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తూ దైవకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చాడు. దాంతో మానవ చరిత్రలో అప్పటిదాకా సాగిన దౌష్ట్యపు రక్తపు మరకల పుటలు సమసిపోయి ప్రేమ, క్షమాపణ, సాత్వికత ఇతివృత్తాలుగా కొత్త భావాలు, కార్యాల తాలూకు అభివర్ణనతో కూడిన కొత్త పుటలు ఆరంభమయ్యాయి. ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నంత గొప్పగా మీ పొరుగు వారిని ప్రేమించండి’ అన్న యేసుక్రీస్తు ప్రబోధం నాడు, నేడు కూడా సాటిలేనిది. ‘మీ శత్రువుల్ని క్షమించండి’ అన్న ఆయన మరో ప్రబోధం నాటి సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

శత్రువు చేజిక్కితే చాలు, అతన్ని వెంటాడి మరీ క్రూరంగా చంపాలన్న నాటి సంస్కృతికి, నమ్మకాలకు పూర్తిగా భిన్నమైనది యేసుక్రీస్తు బోధ. అది ఆచరణలో కాలపరీక్షకు నిలుస్తుందా లేక కేవలం ప్రబోధంగానే మిగిలిపోతుందా? అంటూ నొసలు ముడివేసిన నాటి పెద్దల సందేహానికి ఆయనే స్వయంగా సిలువలో వేలాడుతూ తనను అన్యాయంగా సిలువలో అత్యంత పాశవికంగా బలి చేస్తున్న శత్రువులందరినీ క్షమిస్తూ ప్రార్థించడమే సమాధానమైంది. ‘తండ్రీ వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. గనుక వీరిని క్షమించండి’ అన్న యేసుక్రీస్తు సిలువ ప్రార్థన ఆనాటినుంచి లోకంలో ప్రతిమూలనా ప్రతిధ్వనిస్తోంది. క్షమాపణ బలహీనుడి వైఖరి కాదు, బలవంతుడి ఆయుధమని యేసుక్రీస్తు సిలువలో రుజువు చేశాడు.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు