రాణి గారి బావి

19 Sep, 2014 00:03 IST|Sakshi
రాణి గారి బావి

యునెస్కో హోదా!
 
షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ని కట్టించాడని, కులీకుతుబ్ షా భాగమతి జ్ఞాపకార్థం భాగ్యనగరం నిర్మించాడని మనకు తెలుసు. ఓ భార్య తన భర్త జ్ఞాపకార్థం భూగర్భంలో కోటలా ఉండే మెట్ల బావిని నిర్మించిన విషయం తెలుసా! ఈ అద్భుత కట్టడం మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ పట్టణంలో ఉంది. ఈ కట్టడం ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది.
 
భూగర్భజలాలను సమర్థంగా వినియోగించుకునే పరిజ్ఞానానికి గుజరాత్ మెట్లబావి (రాణి కి వావ్) నిలువెత్తు నిదర్శనం. సోలంకి సంస్థానానికి చెందిన రాణీ ఉదయమతి తన భర్త ఒకటవ భీమ్‌దేవ్  జ్ఞాపకార్థం 1063లో ఈ బావిని నిర్మించారు. ఆ తర్వాత సరస్వతి నదికి వచ్చిన వరదలకు ఈ బావి పూడికతో నిండిపోయింది. నాటి భూగర్భ మార్పుల వల్ల సరస్వతి నది కనుమరుగైంది. 1980లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా ఈ మెట్ల బావి వెలుగులోకి వచ్చింది.
 
విస్మయపరిచే శిల్ప సంపద

నలుచదరంగా ఉండే ఈ మెట్ల బావి నిర్మాణం నిపుణులను, పర్యాటకులను విస్మయపరుస్తోంది. మొత్తం ఏడు అంతస్తులు. ప్రస్తుతం ఐదు అంతస్తులను మనం చూడొచ్చు. ఈ అంతస్తులలో ఎటు చూసినా అబ్బుపరిచే శిల్పకళ నాటి కళావైభవానికి అద్దంపడుతోంది. 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతుతో చూడ్డానికి ఈ బావి ఓ భూగర్భ కోటలా, దేవాలయం లా ఆకట్టుకుంటుంది.
 
దశావతారాలు

ఈ నిర్మాణంలో 1,500ల ప్రధాన దేవతా శిల్పాలు ఉన్నట్టు కనిపెట్టారు నిపుణులు. వీటిలో విష్ణువు దశావతారాలైన వారాహి, వామన, నరసింహ, రామ, కల్కి శిల్పాలు... మహిషాసుర మర్ధినితో పాటు నాగకన్య, యోగిని, ఇతర 16 రకాల శైలులుగా ఆక ర్షణీయంగా కనిపించే అప్సరసల శిల్పాలు అబ్బురపరుస్తుంటాయి. ఈ బావి అడుగున 28 కిలోమీటర్ల పొడవున ఓ సొరంగం ఉండేదని, ఇప్పుడు అది అంతా మట్టితో నిండి ఉందని చెబుతారు.
 
యునెస్కో హోదా!

ఈ మెట్లబావి విశిష్టతను తెలియజేస్తూ ప్రభుత్వం యునెస్కో సంస్థకు కిందటేడాది దరఖాస్తు చేసింది. యునెస్కో ప్రతినిధులు ఈ మెట్ల బావి వైభవం చూసి, ప్రపంచ ప్రాచీన వారసత్వ జాబితాలో చోటు కల్పించింది. ఆ విధంగా మనదేశంలో గుర్తింపు పొందిన వారసత్వ సంపద జాబితాలో 31వ స్థానంలో నిలిచింది ఈ మెట్ల బావి. ప్రపంచ టూరిజం మ్యాప్‌లో మెట్ల బావికి స్థానం దక్కడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. జీవితంలో ఒక్కసారైనా చూడదగిన అద్భుతంగా రాణి మెట్ల బావి పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
 
పటాన్ పట్టణం ఇలా చేరాలి:
 
‘రాణి కి వావ్’ను చూడటానికి రోడ్డు, రైలు, వాయు మార్గంలో అహ్మదాబాద్ చేరుకోవాలి. అక్కడి నుంచి మూడు-నాలుగు గంటల వ్యవధిలో మెహసానా చేరుకుని, అటు నుంచి ఒక గంటలో పటాన్ పట్టణం చేరవచ్చు. మెహసానా నుంచి ట్యాక్సీలు, జీపులు లభిస్తాయి. సమీప రైలు స్టేషన్ మెహసానాలో ఉంది. సమీప ఎయిర్‌పోర్ట్ అహ్మదాబాద్.
 

మరిన్ని వార్తలు