పాటల తోటలో చిలకా గోరింక...

31 Jul, 2013 03:59 IST|Sakshi
పాటల తోటలో చిలకా గోరింక...

ఒకే కాలేజ్... ఆయన సీనియర్, ఆమె జూనియర్.
 ఒకే సబ్జెక్ట్... ఆయన పిహెచ్.డి., ఆమె గోల్డ్‌మెడలిస్ట్.
 ఇద్దరి మధ్య ఇంకా... రెండుమూడు ‘ఒకే’లు.
 ప్రేమ పుట్టకుండా ఉంటుందా?
 పువ్వై, నవ్వై అది పరిమళించకుండా ఉంటుందా?
     
 ప్రేమైతే సేమ్ పించ్‌లతో పుట్టేసింది కానీ...
 పాట పుట్టడానికి సింక్రనైజేషన్ అవసరమైంది.
 ఆమెకు నచ్చితేనే ఆయనకు పల్లవైనా, చరణమైనా!
 ఈలోపు... పప్పు మాడిపోవచ్చు.
 పాత్రలో పాలు పొంగిపోవచ్చు.
 ఎండింగ్‌లో చూస్తే భోజనం రెడీ కాకపోవచ్చు!
 పాట మాత్రం చక్కగా కుదురుతుంది.
 సాహిత్యం: వనమాలి, తొలిశ్రోత: విష్ణుప్రియ.
 వీరి దాంపత్య గీతరచనే ఈవారం ‘మనసే జతగా’...
 
 జర్నలిస్టు నుంచి పాటల రచయితగా జీవన ప్రయాణం సాగించారు వనమాలి. అసలు పేరు డా.మణిగోపాల్. తెలుగులో పి.హెచ్.డి చేసిన వనమాలికి కాలేజీ రోజుల్లో విష్ణుప్రియ జూనియర్! ఇద్దరూ చెన్నైలో ఒకే కాలేజీలో చదివారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో  ఉంటున్న ఈ దంపతులు కాలేజీ రోజుల్లో తమ మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమ, పెళ్లి ... నాటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ వినిపించిన పల్లవులు, చరణాలు ఇవి...
 
 మూడుముళ్లకు పదమూడేళ్లు
 వనమాలి: మా పెళ్లి జరిగి (సెప్టెంబర్ 1, 2000) పదమూడేళ్లు అయ్యింది. ఇంకా ఇద్దరం కాలేజీకి వెళ్లినట్టే ఉంటోంది. చెన్నై బీచ్‌లో తిరుగుతూ, కలిసి పంచుకున్న కబుర్లు... ‘అప్పుడే పదమూడేళ్లు నిండాయా?’ అని ఆశ్చర్యపోతుంటాం.
 
 విష్ణుప్రియ: ఇద్దరం ఎంత సేపు మాట్లాడుకున్నా బోర్ కొట్టేది కాదు. మా మధ్య ప్రేమ ఉందని తెలుసుకున్న నెలరోజులకే మా ఇళ్లలో చెప్పాం. కాని మా ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. అయినా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. చెన్నైలోనే కాపు రం పెట్టాం. ఆ తర్వాత ఉద్యోగరీత్యా  హైదరాబాద్‌కు వచ్చాం.
 
 పాట వర్సెస్ వంట
 విష్ణుప్రియ: మేం శాకాహారులం. ఈయనకు మాంసాహారం అంటే ఇష్టం. ఈయన కోసం ఇరుగుపొరుగువారిని మాంసాహార వంటకాల గురించి అడిగి, నేర్చుకొని చేసేదాన్ని. వంట చేసేటప్పుడు ఈయనకు ఏదో పాట పల్లవి తడుతుంది. ఆ  పదాల అల్లికలు నాకు చెప్పేలోగా పొయ్యి మీది ఆహారం బొగ్గు అయ్యేది. వంటేమయ్యిందో అని మధ్యలో వెళ్లిపోతే ‘పాట బాగోలేదేమో!’ అనుకుంటారు. ఆ టెన్షన్‌లో వంట సరిగ్గా అయ్యేది కాదు. తర్వాత నేనే ఈయనకు అనుకూలంగా నా టైమ్ సెట్ చేసుకున్నాను.
 
 వనమాలి: ప్రియకు మాస్ పాటలు ఇష్టం. ఈవిడకు పాట అర్థమయ్యిందంటే చాలు జనాలకు ఈజీగా కనెక్ట్ అవుతుందని నమ్మకం. ఈవిడ దగ్గర లేనప్పుడు నేను రాసిన పాటలు కాస్త హై స్టాండర్డ్‌గా ఉండి, అంత ఈజీగా జనాల్లోకి వెళ్లకపోవడమూ గమనించాను. పదాల అల్లికలో సాహిత్యంలోని సన్నివేశాలను గుర్తుచేస్తుంది. అలా పాటల్లో కొత్తపదాలు పడినవి, తీసివేసినవీ ఎన్నో ఉన్నాయి.
 
 పోలికతో పోటీ!
 విష్ణుప్రియ: ఇద్దరం గోల్డ్‌మెడలిస్ట్‌లమే!  కాని నాకు ఆయన అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. అందుకే లెక్చరర్‌గా ఎ.ఎమ్.ఎస్‌లో ఉద్యోగానికి అప్లై చేయించారు. ఐదేళ్లు జాబ్‌చేశాను. ఆ తర్వాత పిల్లలను చూసుకోవడానికి మానేశాను. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దయ్యాక మళ్లీ లెక్చరర్‌గా జాబ్ చేస్తున్నాను. టీచింగ్‌లో మెలకువలనూ ఈయన్ను అడిగే తెలుసుకుంటూ ఉంటాను.
 
 మెట్లమీద పుట్టిన పాటలు
 విష్ణుప్రియ: ఈయన కలం పేరు(వనమాలి) మా అబ్బాయికి పెట్టుకున్నాం. అమ్మాయి వనప్రియ. ఓ రోజు మా అబ్బాయి ‘నాన్నా! అమ్మాయిలే వీణ నేర్చుకుంటారా?’ అని ఆశ్చర్యంగా అడిగాడు. ‘నువ్వు నేర్చుకుంటావా..!’ అని సంగీత దిగ్గజాలుగా పేరొందిన మగవారి గురించి చెప్పి, వాడి సందేహం తీర్చి, ఆ క్లాస్‌లో జాయిన్ చేశారు. పాట రాస్తున్నా పిల్లలను క్లాస్‌కు తీసుకెళ్లడం మానరు. వారిని క్లాస్‌లో వదిలి, అక్కడే మెట్ల మీద కూర్చొని పాటలు రాసుకున్న సందర్భాలు ఎన్నో..! ‘ఫ్రీ టైమ్ తీసుకోండి’ అని చెబితే- ‘నా పని కోసం పిల్లల ఇష్టాలను బలిచేయడం సబబు కాదు. ఆ ఒత్తిడిలోనే పాట ఇంకా వేగంగా వెళుతుంది. ఎక్కడ, ఎలా రాశానా అన్నది పట్టించుకోను. పాట ఎంత బాగా వచ్చిందనేదే ముఖ్యం’ అంటారు.  
 
 ధైర్యం వచ్చిన వేళ!
 విష్ణుప్రియ: హిట్ వచ్చినప్పుడు, ప్లాప్ అయినప్పుడు సినిమా పరిస్థితులు ఎలా ఉంటాయో జర్నలిస్ట్‌గా ఈయన ఆ ఫీల్డ్‌కి దగ్గరుండి చూశారు. అందుకే ఉద్యోగాన్ని వదులుకున్నప్పుడు కాస్త భయపడ్డారు. టాలెంట్ ఎంత ఉన్నా, సక్సెస్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టం అనేవారు. నేను జాబ్‌కెళ్లడం మొదలుపెట్టాక ఆ భయం పోయింది. ఇద్దరికీ చదువుంది. ఎక్కడైనా బతుకుతాం అనే ధైర్యం ఇద్దరికీ వచ్చేసింది.  
 
 ఇంటిబాధ్యతల్లో నాకన్నా సీనియర్!
 వనమాలి: ఇప్పటివరకు స్త్రీ మనస్తత్వం గురించి చాలా సాహిత్యం చదివాను. బంధువులు, స్నేహితులలో చాలామంది ఆడవారిని గమనించాను. కాని వారందరికీ భిన్నంగా ప్రియ మనస్తత్వం ఉండటం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇన్నేళ్లలో ఏ రోజూ ఫలానావస్తువు కావాలని ప్రియ అడిగింది లేదు. కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా నా వరకు రానీయదు. మా అమ్మ క్యాన్సర్ వచ్చి మంచంపడితే, ఎనిమిదినెలల పాటు ప్రియే సేవలు చేసింది. ఆ సమయంలో ప్రియ వాళ్ల అమ్మకు కాలు ఫాక్చరై, ఆపరేషన్ అయ్యింది. అయినా మా అమ్మనే అంటిపెట్టుకొని సేవలు చేసింది. కాలేజీలో నాకు జూనియర్! కానీ ఇంటి బాధ్యతలో నాకన్నా సీనియర్!
 
 అపురూపం
 విష్ణుప్రియ: ఈయనకు ప్రసారభారతిలో జాతీయకవిగా అవార్డు వచ్చింది. అక్కడ 24 భాషల్లో కవి సమ్మేళనం జరుగు తుంది. ఆ కవితలన్నింటినీ ఇంగ్లీషులోకి అనువదించి, దేశమంతా ప్రసారం చేస్తారు. ఆ అవార్డు ఈయనకు వచ్చినప్పుడు చాలా ఆనందం కలిగింది. అలాగే ఈయన రాసిన ‘ఎండవానల ఇంట పుట్టిన ఇంద్రధనసుకు ఆయువెంతో... కంటిపాపల తోటి కలలకు కలిసి బతికే కాలమెంతో.. తెలపగలవా ఓ మనసా! డోలలూగే బతుకువరుసా...!’ పాట బాలమురళీకృష్ణ  పాడటం అదృష్టంగా భావిస్తాం. మా జీవితంలోకి బిడ్డగా తొలి శిశువు అడుగుపెట్టిన క్షణాలు అపురూపంగా భావించాం.
 
 
 ఏ విషయమైనా  చాలా అర్థవంతంగా చెబుతారు. ఈయన చెప్పే టీచింగ్ మెలకువలూ నాకు
 ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
 - విష్ణుప్రియ
 
 
  ప్రియకు నేను రాసిన పాట అర్థమైందంటే చాలు జనాలందరికీ కనెక్ట్ అవుతుంది.
 - వనమాలి
 
 ఊహించని కానుక
 విష్ణుప్రియ: సినిమాస్టార్‌గా చిరంజీవి అంటే నాకు అమితమైన అభిమానం. మా పెళ్లయ్యాక, ఈయన నా పుట్టినరోజున బయటకు తీసుకెళుతూ విషయం చెప్పకుండా ‘తెలిసినవారింటికెళుతున్నాం’ అన్నారు. ఎవరిదో కొత్త ఇల్లు. అక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఆ వ్యక్తి బయటకు వచ్చాక ఆశ్చర్యపోయాను. చిరంజీవి. నమ్మలేకపోయాను.  
 
 ఊరటనిచ్చే ఓదార్పు
 వనమాలి: ఊహించనివిధంగా సంతోషపెట్టి, ఆనందించడం ఇద్దరికీ ఇష్టం. ఏదైనా కోపం వస్తే మాత్రం ఇద్దరికి ఇద్దరమే! కాని మాట్లాడుకోకుండా కాసేపు కూడా ఉండలేం. ఎంత బాగా రాసినా ఒక్కోసారి నా పాట సెలక్ట్ అవనప్పుడు చాలా డిప్రెస్‌డ్‌గా అనిపిస్తుంది. అలాంటప్పుడు ప్రియ మాటలు చాలా ఊరటనిస్తాయి. నేను లేకపోయినా నా కుటుంబం హాయిగా గడపాలి అనుకుంటాను. అందుకే నేను సంపాదించే ప్రతి రూపాయి ఎక్కడ పెడుతున్నానో ప్రియకు చెబుతుంటాను.   
 
 ‘‘భాగస్వామి దగ్గర మంచితనం పెంచుకోవాలనుకున్నప్పుడు అబద్ధాలు వస్తాయి. అందుకే మంచిగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. నన్ను నన్నుగా అంగీకరించాలనుకుంటాను. దాపరికాలు ఉండవు’’ అని చెప్పిన ఈ జంట ఒకరి ఉన్నతి కోసం ఒకరు పాటుపడిన విధానం వీరు చెప్పిన ప్రతి సందర్భంలోనూ కనిపించింది.
 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

మరిన్ని వార్తలు