అతడు వీర ఆమె ధీర

29 Jan, 2015 22:55 IST|Sakshi
అతడు వీర ఆమె ధీర

తేజీ మిస్త్రీ... ఒక సాధారణ మహిళ మాత్రమే. అయితే ఆమెలో అసాధారణమైన ధైర్యం ఉంది. భర్త జాన్ మాణిక్ షా మిస్త్రీ మరణానంతర పరిస్థితులు నింపిన ఆత్మస్థయిర్యం అది. నేడు ‘సైనిక అమర వీరుల దినోత్సవం’ సందర్భంగా... ఆ సైనికుడి జీవిత భాగస్వామి జ్ఞాపకాల మాలిక .
 
 ఎనభై ఏళ్ల తేజీ మిస్త్రీ సికింద్రాబాద్‌లోని పార్క్‌లేన్ ప్రాంతంలో ఉంటారు. వారి ఇంట్లోకి వెళ్లగానే ఎదురుగా భారతదేశం భౌగోళిక ఆకారంలో ఉన్న ఒక మెమెంటో కనిపిస్తుంది. అది గత ఏడాది జనవరిలో ముంబైలో జరిగిన అమరవీరుల సంస్మరణ సదస్సు సందర్భంగా ఆమె అందుకున్న గౌరవ చిహ్నం. తన భర్త వీరచక్ర స్వర్గీయ స్క్వాడ్రన్ లీడర్ జాన్ మాణిక్‌షా మిస్త్రీ సేవలకు గుర్తింపుగా ఆమె స్వీకరించిన జ్ఞాపిక. గదిలో మరో వైపు జాన్ మిస్త్రీ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఉంది.  ఆ ఫొటోలను చూపిస్తూ తేజీ ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లారు.

‘‘మాది పార్శీ కుటుంబం. నేను పుట్టింది, పెరిగింది సికింద్రాబాద్‌లోనే. మా నాన్న జంషెడ్ ఇటాలియా. జంషెడ్ అనగానే టాటాను గుర్తు చేసుకుంటారేమో. మాది సంపన్న కుటుంబం కాదు. మధ్య తరగతి కుటుంబం. మేము మొత్తం ఎనిమిది మందిమి.ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలం. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ కాన్వెంట్‌లో చదివాను. మా వారిది ముంబై. దాదర్‌లో పుట్టి పెరిగారాయన. మామగారు చార్టెర్డ్ అకౌంటెంట్. ఆయనకు పిల్లలను సర్వీస్ సెక్టార్‌లోకి తీసుకురావాలని కోరిక. పెద్ద కొడుకు పోలీస్ అధికారి కావడానికి, మా వారు రక్షణ రంగంలోకి రావడానికి ఆయన ప్రోత్సాహమే కారణం. మా రెండు వైపుల కుటుంబాల్లో అంతకు ముందు ఎవరూ రక్షణ రంగంలో పనిచేయలేదు. మా వారే మొదటి వ్యక్తి. ఆయన భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్.
 
అందమైన జీవితాన్ని చూశాను...

1958లో మా పెళ్లయింది. మా వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగింది. ఇప్పుడు వెనక్కి గుర్తు చేసుకున్నా కూడా ఒక అందమైన లోకాన్ని చూసినట్లు ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో అనేక అందమైన ప్రదేశాలను చూశాం. మాకు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. మిస్త్రీ ఉద్యోగరీత్యా పంజాబ్‌లోని హల్వారా, పశ్చిమ బెంగాల్‌లోని కాలై కుంద, తమిళనాడులోని తామ్రం, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, హైదరాబాద్‌లోని హకీంపేట, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, హిండన్ ఎయిర్ బేస్‌లలో పనిచేసిన తర్వాత పఠాన్‌కోట్‌కు బదిలీ అయింది. యుద్ధవిమానాలను నడుపుతూ స్వయంగా దాడుల్లో పాల్గోవడంతోపాటు కొత్తగా వైమానిక దళంలోకి వచ్చిన వారికి ఫ్లయింగ్‌లో శిక్షణ ఇవ్వడం వంటి బాధ్యతలు నిర్వర్తించారు.
 
ఇందిరాగాంధీ చొరవతో...

మిస్త్రీ పఠాన్‌కోట్ బేస్‌లో పనిచేస్తున్న సమయంలోనే పాకిస్థాన్‌తో యుద్ధం జరిగింది. అది 1971వ సంవత్సరం. డిసెంబర్ నెల మూడవ తేదీ... ‘మా పై అధికారి పాఖడ్ నుంచి ఆదేశాలందాయి, పాకిస్థాన్ మనదేశం మీద యుద్ధం ప్రకటించింది. మేమంతా అప్రమత్తంగా ఉండాలి’ అని మిస్త్రీ నాతో చెప్పారు. పిల్లలు చిన్న వాళ్లు. అయినా వారికి కూడా చెప్పి వెళ్లారు. డిసెంబర్ 5వ తేదీన మన దేశం మీద ఆరు ఎయిర్‌క్రాఫ్టులు దాడి చేశాయి. ఆయన ఆ గ్రౌండ్‌లోనే ఉన్నారు. వెంటనే ఎయిర్‌బోర్న్ అయ్యారు. కానీ ఫైటింగ్ మొదలయ్యే లోపు పరిస్థితి ప్రతికూలంగా మారింది. మిస్త్రీ ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లోకి లేచింది. ప్రత్యర్థి ఎయిర్‌క్రాఫ్ట్ మీద దాడి చేసేలోపు అవతలి ఎయిర్‌క్రాఫ్ట్ అవకాశం తీసుకుంది. యుద్ధవి మానంలోనే మిస్త్రీ ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. యుద్ధం ముమ్మ రంగా జరుగుతున్న సమయంలో రక్షణ రంగ మిత్రులు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతో నాకు విషయం లీలగా అర్థమైంది. మిస్త్రీ సహోద్యోగుల ద్వారా యుద్ధరంగంలో జరిగిన వివరాలు తెలిశాయి. ఆ సంఘటన తర్వాత పిల్లలతో సికింద్రాబాద్‌కి వచ్చేశాను.
 
సుఖదుఃఖాల సమ్మేళనమే జీవితం...

నిజానికి మిస్త్రీని కోల్పోయిన తర్వాత జీవితంలో నన్ను ఏదీ అంతగా బాధించడం లేదు. ఆరోగ్యంగానే ఉన్నాననుకుంటుండగానే బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. తెలుసుకునేటప్పటికే మూడవదశకు చేరింది. సర్జరీ చేయించుకున్నాను. కానీ కీమో, రేడియేషన్ తీసుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకించాను. మాత్రలు వాడుతూ హెర్బల్ టీ తీసుకుంటూనే స్వస్థత పొందాను. రెండేళ్ల కిందట మెట్ల మీద జారి ఎడమ భుజం ఎముక విరిగింది. చేతిని పూర్తిగా పైకి లేపలేను. కానీ నా పనులు నేను చేసుకోవడానికి ఇవేవీ అడ్డుకాదు. వాటి కారణంగా డీలా పడి ఓ మూల కూర్చుంటే అది వీరుడైన మిస్త్రీని అవమానించడమే. ఆయన దేశం కోసం ప్రాణాల్ని త్యాగం చేశారు. అమర వీరుడి భార్యగా నాకు ప్రత్యేక గౌరవాన్ని కల్పించారు. ఆయన తరఫున వీరచక్రను అందుకున్నప్పుడు మాత్రమే కాదు, ప్రతి క్షణం మిస్త్రీ స్ఫూర్తిని నాలో నిలుపుకోవడం నా బాధ్యత అని ముగించారు తేజీ మిస్త్రీ.

ఎవరికైనా జీవితంలో నిర్లిప్తత, నిరాశ వంటి భావనలు ఏదో ఓ మూల ఉంటే... ఒకసారి తేజీ మిస్త్రీతో మాట్లాడితే అవన్నీ దూరమై పోతాయి. జాన్ మిస్త్రీ జ్ఞాపకాలు ఆమెకు ఒక జీవితకాలానికి సరిపోయేటంతగా ఉన్నాయి. ప్రతిక్షణాన్ని యథాతథంగా స్వీకరించే మనోధైర్యం ఆమెలో ఉంది. వాటికి ఎదురీదగలిగిన ఆత్మస్థైర్యం ఆమెకుంది. ఎనభై ఏళ్లు నిండితే మాత్రం ఒకరి మీద ఆధారపడడం అవసరమా... అని ప్రశ్నించడంలో నిండైన ఆత్మవిశ్వాసం వ్యక్తమవుతుంది.

http://img.sakshi.net/images/cms/2015-01/61422552044_Unknown.jpg
 

 

మరిన్ని వార్తలు