కలలు చెప్పే కథలు...

18 Oct, 2015 15:44 IST|Sakshi
కలలు చెప్పే కథలు...

డ్రీమ్స్
కలలకు అర్థాలు ఉండవు. అన్వయాలు మాత్రమే ఉంటాయి. అన్వయం అంటే... అలా జరిగింది కాబట్టి, ఇలా కల వచ్చింది అనుకోవడం. లేదా ఇలా కల వచ్చింది కనుక అలా జరగబోతోందని భావించడం. కల కలే. నిజం నిజమే. రెంటికీ పోలిక లేదు. పొంతన లేదు. అయినప్పటికీ కలలు.. ‘తేలిగ్గా తీసి అవతల పడేయవలసిన’ కేటగిరీలో ఉండిపోలేదు! కలలపై పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి. కలలకు అర్థాలను వెతుకుతున్నారు. అంతరార్థాలను బయటికి లాగుతున్నారు. ఎంత వెతికినా, ఎంత లాగినా... కల అంతు చూడ్డం మనిషికి ఒక కలలానే మిగిలిపోయింది. మరి.. కొన్ని కలలెందుకు నిజం అయ్యాయి? కొన్ని నిజాలెందుకు కలలుగా కనిపించాయి?
 
కల నిజం అవడం యాదృచ్ఛికం కావచ్చు. నిజం కల అవడం... కలవరింత కావచ్చు. ఏమైనా కలలు ఇంట్రెస్టింగ్. అవి కొత్త లోకాలను చూపిస్తాయి. కొత్త ఊహల్లో తేలియాడిస్తాయి. కొత్త భయాలను కలిగిస్తాయి. కొన్నిసార్లు ఉన్న భయాలనూ పోగొడతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం ఏమంటే.. తీరని కోరికలు కలలుగా వస్తాయని! వస్తాయి సరే. తీరినట్టు వస్తాయా? తీరనట్టే వస్తాయా? ఎలాగైనా రావచ్చు. ఇక ఎప్పటికీ తీరనట్టు కూడా రావచ్చు. ఫ్రాయిడ్ పందొమ్మిదో శతాబ్దపు ఆస్ట్రియా న్యూరాలజిస్టు. సైకోఎనాలసిస్‌కి పితామహుడు.

కలల్ని ఆయన డీసైఫర్ చేశారు. కలల కొలనులో ఈతకొట్టి లోపల ఏం మున్నదీ పైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఫ్రాయిడ్ చెప్పేదాన్ని బట్టి కలలన్నిటీనీ ఒకే మూసలో పెట్టి చూడ్డానికి లేదు. ఏ కలని, ఆ కలగానే ఎనలైజ్ చేయాలి. అప్పుడు ఆ కల దేనికి సంకేతమో తెలిసే అవకాశం ఉంటుందట!
 
ఫ్రాయిడ్ తర్వాత ఆ స్థాయిలో కలల్ని విశ్లేషించి గూఢార్థాలు కనిపెట్టిన ఆధునిక సైకాలజిస్ట్ ఇయాన్ వాలెస్. ఆయన 1,80,000 కలల్ని కాచి వడబోశారు. ‘టాప్ 100 డ్రీమ్స్’ అనే పుస్తకం రాశారు. అందుల్లోంచి మళ్లీ సర్వసాధారణంగా మనకు వచ్చే కొన్ని కలలను ప్రత్యేకంగా వేరు చేసి, వాటికి వాలెస్ చెప్పిన అర్థాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను, కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
 
కలలు... అర్థాలు
* ఎవరో తరుముతున్నట్లుగా వస్తే: లైఫ్‌లో ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతోంది. దాన్ని పరిష్కరించుకోలేక, దాన్నుంచి తప్పించుకుపోవాలని చూస్తున్నారు. లేదా ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. అదే కలలో మీరు పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నా కూడా మీ కాళ్లు మొరాయిస్తూ, మీరు ఉన్నచోటనే ఉండిపోతున్నట్లు కల వస్తే మీలో ఆత్మవిశ్వాసం కొరవడిందని అర్థం.
* ఏం చేయాలి? మీలోని జీవన నైపుణ్యాలకు పదును పెట్టుకోడానికి ఇదొక అవకాశం. మీ శక్తి ఏమిటో గ్రహించి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యండి.
* నలుగురి మధ్య దిగంబరంగా...: ఇలా కల వస్తే.. మీరు గుర్తింపు కోరుకుంటున్నారని. అది మీకు లభ్యం కావడం లేదని! ఎలాగైనా గుర్తింపు సంపాదించాలని తపిస్తున్నారని.
 ఏం చేయాలి? ధైర్యం చేయాలి. జనం మధ్యకు రావాలి. చొరవ చూపాలి. మీ శక్తియుక్తుల్ని నిరూపించుకోవాలి.
* పరీక్షకు ప్రిపేర్ కానట్లు...: జీవితం విసురుతున్న సవాళ్లను ఎదుర్కొలేనేమో అనే భయం మీలో ఉంది. ఓడిపోతానేమో, నెగ్గుకు రాలేనేమో, వైఫల్యం చెందుతానేమో, పరాజయం పాలౌతానేమో అనే నెగిటివ అలోచనలు మిమ్మల్ని నడిపిస్తున్నాయని ఈ కలకు అర్థం.
* ఏం చేయాలి? మీ నైపుణ్యాన్ని, సామర్థ్యాలను కలిపి విజయసాధనకు కృషి చెయ్యాలి.
* దెయ్యాలు: కలలో తరచు దెయ్యాలు కనిపిస్తుంటే కనుక.. జీవితానికి, సమాజానికి మీరు దూరంగా ఉంటున్నట్లు లెక్క.
* ఏం చెయ్యాలి? మనుషుల్లో కలవాలి. మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాలి.
* గాలిలో ఎగురుతున్నట్లు: సామాజిక పోకడలకు అనుగుణంగా వెళ్లాలని ఈ కల సూచిస్తోంది. అదే సమయంలో జీవితంలోని సమస్యల విషయంలో ఓపికగా, నేర్పు ప్రద ర్శించాలని చెబుతోంది.
* ఏం చెయ్యాలి? మన జీవితం మీద మనం అదుపు సాధించాలి. పట్టువిడుపులతో ఒడుపుగా విజయ శిఖరాలను అందుకోవాలి.
* పడిపోయినట్లు: మంచం మీది నుంచి పడిపోయినట్లు కనుక కల వస్తే... నిజ జీవితంలో దేని కోసమో మీరు గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారని. ఆ ప్రయత్నం విఫలం కాకూడదని దృఢనిశ్చయంతో ఉన్నారని.
 ఏం చేయాలి? మీ మీద మీరు నమ్మకం ఉంచండి. జరిగేది జరగనివ్వండి. మీరు చేయదలచుకున్నది చేసేయండి.
* పళ్లు రాలిపోతున్నట్లు వస్తే: పళ్లు (దంతాలు) ఆత్మవిశ్వాసానికి, శక్తికి సంకేతాలు. పళ్లు రాలిపోతున్నట్టు కల వస్తే, ఆ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే సంఘటనలు ఏవో మీ నిజ జీవితంలో జరగబోతున్నాయని అర్థం.
* ఏం చేయాలి? జీవితంలో మీరు మార్పు కోరుకుంటున్నారనే దానికి ఈ కల సూచన కావచ్చు. లేదా మీరు పరిష్కరించుకోవలసిన ఒక సమస్యను మీకు గుర్తు చేయడం అంతరార్థం కావచ్చు. సమస్య పరిష్కారం కోసం పాజిటివ్ ఎనర్జీతో ప్రయత్నించండి.
* పాములు: పాములు... దాగి ఉన్న భయాలకు చిహ్నాలు. పాములు కలలోకి రావడం అన్నది ఓ హెచ్చరిక కావచ్చు. పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మిమ్మల్ని అప్రమత్తం చేయడం కావచ్చు.
* ఏం చేయాలి? భయాలను ధైర్యంగా ఎదుర్కోండి. జీవితంలో ఎదురవుతున్న అవరోధాలను నేర్పుగా తొలగించుకుంటూ ముందుకు వెళ్లండి.
* మరణం: జీవితంలో ఊహించని పరిణామాలు ఏవో సంభవించబోతున్నాయనేందుకు చావు కలను ఒక సూచనగా పరిగణించాలి. ఒక ముగింపునకు, ఒక ప్రారంభానికి ఇలాంటి కలలు ప్రతీకలు.
* ఏం చేయాలి? మరణానికి సంబంధించిన కలలు ఆత్మపరిశీలనకు, ఎదుగుదలకు సోపానాలు.
* అదుపు తప్పిన వాహనాలు: విజయానికి చేరువ చేసే దారిలో మీ ప్రయాణం అదుపు తప్పుతోందని అర్థం కావచ్చు. ప్రస్తుతం ఉన్న ఒక చెడు అలవాటు త్వరలోనే ఒక దీర్ఘ వ్యసనంగా మారబోతోందన్న దానికి ఇదొక సూచన కావచ్చు.
* ఏం చేయాలి? రిలాక్స్ అవండి. పట్టు వదలండి. దూకుడు తగ్గించి మీ గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేయండి.                    
 
 
ముందే కలగన్నారు!
 1. అబ్రహాం లింకన్ తన హత్య గురించి.
 2. కార్ల్ జంగ్ ప్రపంచ యుద్ధం గురించి.
 3. ప్రిన్సెస్ డయానా తన దుర్మరణం గురించి.
 4. ఐన్‌స్టీన్ ‘థియరీ ఆఫ్ రిలేటివిటీ’ గురించి.
 5. ల్యారీ పేజ్ గూగుల్ ఐడియా గురించి.
 6. కొంతమంది అమెరికన్‌లు 9/11 ఘటన గురించి.
 
సృజనాత్మక స్వప్నాలు (క్రియేటివ్ డ్రీమ్స్)

ది స్ట్రేంజ్ కేస్ ఆఫ్ డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్: రాబర్ట్ లూయీ స్టెవెన్‌సన్ ఈ పుస్తకాన్ని తనకొచ్చిన కల ఆధారంగా రాశారు! అలా తొలి చిత్తు ప్రతిని కేవలం మూడు రోజుల్లో ఆయన పూర్తి చేశారట.
 
కుబ్లా ఖాన్: సామ్యూల్ టేలర్ కొలెరిడ్జ్.. ఓపియం మత్తులో నిద్రలోకి జారి కనిన కలలోంచి గుర్తు చేసుకున్న సంఘటనల ఆధారంగా కుబ్లా ఖాన్ అనే కవితను రాశారు.
 
టెర్మినేటర్: జేమ్స్ కామెరాన్ జ్వరంలో ఉన్నప్పుడు వచ్చిన కథ ఆధారంగానే టెర్మినేటర్ సినిమా తయారైంది.
 
ఫ్రాంకెయిన్‌స్టెయిన్: మేరీ షెల్లీ చారిత్రక నవల ఫ్రాంకెయిన్‌స్టెయిన్ 1816లో ఆమెకు వచ్చిన ఒక కల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఆ పుస్తకం 1818లో పబ్లిష్ అయింది.
 
ట్విలైట్ సీరీస్: 2003 జూన్ 2న స్టెఫీన్ మేయర్‌కి వచ్చిన ఒక కలే, ఆ తర్వాత ‘ట్విలైట్’ సీరీస్‌కి కథాంశం అయింది. కల వచ్చిన మూడు నెలల్లో ఆమె తొలి పుస్తకాన్ని పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు