ఉప్పే ముప్పు...

29 Sep, 2015 23:46 IST|Sakshi
ఉప్పే ముప్పు...

రాకాసి సరస్సు
 
ఏదైనా సరస్సు చుట్టూ చెట్లూ పుట్టలూ, గట్టులూ ఉండటం సహజం. సరస్సులోని నీటిని తాగడానికి, అందులో ఉండే చేపలను, ఇతర జలచరాలను తినడానికి వచ్చే పక్షులు కిలకిలారావాలు చేస్తూ, సరస్సు చుట్టూ తిరుగుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. అయితే  సరస్సు ఒడ్డున పక్షులు గుట్టలు గుట్టలుగా విగతజీవుల్లా కనిపిస్తే  చూసిన వారికెవరికైనా మనసు చలించక మానదు. అదేం సరస్సురా దేవుడా? అసలు అదెక్కడుంది అనుకుంటున్నారా? అది ఉత్తర టాంజానియా దేశంలో ఉంది. ఆ సరస్సు పేరు నాట్రాన్. అది ఉండే ప్రాంతం కెన్యా దేశపు సరిహద్దుల్లో ఉంటుంది. నాట్రాన్ పూర్తిగా ఉప్పు నీటి సరస్సు. ఉప్పు నీరున్నంత మాత్రాన పక్షులు ఎందుకు చనిపోతాయి? అదే కదా ప్రశ్న...

 ఆ నీటిలో సోడియం కార్బొనేట్ శాతం మరీ ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటి ఉష్ణోగ్రత కూడా ఎక్కువే. అక్కడి నీటిలోని పీహెచ్ విలువ 10.5-12 వరకు ఉంటుందట. దాంతో ఆ నీటిని తాకిన జంతువులు లేక పక్షుల చర్మం, కళ్లు నిమిషాల్లో కాలిపోతాయట, అలా వాటి ప్రాణాలు తీసే రాక్షసి ఆ నాట్రాన్ సరస్సు. అలా అని ఆ సరస్సులో ఏ ప్రాణులూ ఉండవా అంటే ఉండవని కావు. ఉప్పుతో జీవించగలిగే విభిన్న జాతి పక్షులు, చేపలు అందులో జీవిస్తుంటాయి. ఆ సరస్సు చూడడానికి కూడా వింతగానే ఉంటుందట. ఎలా అంటే అందులోని నీరు ఎర్రగా కనిపిస్తుందట. ఎందుకంటే ఆ నీటిలో జీవించే ప్రాణుల్లో ఎర్రటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటమే కారణం.
 
 

మరిన్ని వార్తలు