గాయాలకు చికిత్స

15 Apr, 2014 00:17 IST|Sakshi
గాయాలకు చికిత్స

పిల్లలు ఆటల్లో దెబ్బలు తగిలించుకోవడం సహజం. పిల్లలున్న ఇంట్లో ప్రథమచికిత్స సాధనాలు ఉంచుకోవడం ఎంత అవసరమో, చికిత్స చేసే విధానం తెలిసి ఉండడమూ అంతే అవసరం. గాయం నుంచి రక్తం కారుతుంటే శుభ్రమైన వస్త్రాన్ని లేదా గాజ్ క్లాత్‌ని ఒత్తుగా గాయం మీద పెట్టి అదిమి ఉంచాలి. రక్తస్రావం ఎక్కువగా ఉండి క్లాత్ తడిసిపోతే దానిని తీయకుండానే పైన మరికొంత క్లాత్‌ని ఉంచాలి.
     
 గాయం అయిన భాగం గుండె కంటే ఎత్తులో ఉండేటట్లు ఉంచాలి.రక్తస్రావం తగ్గిన తర్వాత గాయాన్ని సున్నితంగా వేడి నీటితో శుభ్రంచేయాలి. అవసరమైతే సబ్బు వాడవచ్చు, అయితే సబ్బు పూర్తిగా పోయే వరకు కడగాలి. హైడ్రోజెన్ పెరాక్సైడ్, అయోడిన్ వంటి వాటిని గాయం లోపలికి తగలనివ్వకుండా దూదితో గాయం చుట్టూ అద్దినట్లు తుడవాలి.
 
 గాయం మీద పసుపు లేదా యాంటీబయాటిక్ క్రీమ్ లేదా యాంటీబయాటిక్ పౌడర్ వేసి బ్యాండేజ్ క్లాత్‌తో కట్టు కట్టాలి. రోజూ కట్టు విప్పి గాయాన్ని తుడిచి కొత్త కట్టు వేయాలి. గాయం పొడిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.అన్నింటికంటే ముఖ్యంగా ప్రథమ చికిత్స చేసే వ్యక్తి చేతులను శుభ్రంగా కడుక్కుని చికిత్స ప్రారంభించాలి.
 
 డాక్టర్‌ను ఎప్పుడు కలవాలంటే...

 
 గాయం లోతుగా తగిలి, చర్మం దానంతట అది కలుసుకోక,
 గాయం అంచుల్లో చర్మం దూరంగా జరుగుతున్నప్పుడు (కుట్లు వేయాల్సి ఉంటుంది) ముఖం మీద గాయం తగిలినప్పుడు
 దుమ్ము, ధూళితో గాయం మూసుకుపోయినప్పుడు
 గుచ్చుకున్న వస్తువుని తొలగించడం కష్టం అయినప్పుడు
 గాయం నుంచి వాపు, నొప్పి, చీముకారడం, వంద డిగ్రీలకు పైగా జ్వరం రావడం వంటి ఇన్ఫెక్షన్ సోకుతున్న లక్షణాలు కనిపించినప్పుడు
 గాయం చుట్టూ చర్మం వాపుతో ఎర్రబారడం
 టెటనస్ ఇంజక్షన్ తీసుకుని ఆరు నెలలు దాటినప్పుడు

మరిన్ని వార్తలు