విచారణలో ఉన్న విడాకుల కేసుల్లోనూ మనోవర్తి

27 Mar, 2016 23:06 IST|Sakshi

కేస్ స్టడీ


విష్ణు, మనోజలది ప్రేమ వివాహం. వివాహమై ఆరేళ్లయింది. విష్ణు ఒక అనాథ. దాతల ఆదరణతో పెద్దవాడై చిన్నవ్యాపారంలో సెటిల్ అయ్యాడు. మనోజది కూడా పేద కుటుంబమే. పెళ్లి నాటికి ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువుపట్ల ఆమెకున్న శ్రద్ధను గ్రహించిన విష్ణు, ఎలాగైనా ఆమెను పెద్ద చదువులు చదివించి ఆఫీసర్‌ను చేయాలనుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి ఆమెకు ఉన్నత విద్యనందించాడు. ఆమెకూడా అంతే కష్టపడింది. పోటీపరీక్షల్లో నెగ్గి గజిటెడ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. విష్ణుకల నెరవేరింది. కానీ విధి వక్రీకరించి విష్ణుకు పెద్ద యాక్సిడెంట్ అయింది. కాలూచేయి చచ్చుబడి ప్రాణం మాత్రం నిలబడింది. ఒక ఏడాదిపాటు ఎలాగో భరించిన మనోజ, తర్వాత అతన్ని అర్ధాంతరంగా వదిలేసి, విడాకుల కేసు వేసింది. విష్ణు గుండెల్లో పిడుగు పడింది. నోటీసులు తీసుకుని కోర్టుకు హాజరు కావాలన్నా దారి ఖర్చులకు కూడా డబ్బుల్లేవు. తిండికే గడవని పరిస్థితి. వ్యాపారం మూతపడింది. సంపాదించే సత్తువ లేదు. సంపాదనంతా భార్య ఉన్నతికే ఖర్చు చేశాడు. పిల్లలను కూడా పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. దిక్కుతోచని పరిస్థితిలో  న్యాయవాదిని సంప్రతించాడు.  సలహా ఇవ్వమని వేడుకున్నాడు. 

 
విష్ణు దీనస్థితికి జాలిపడిన న్యాయవాది,  హిందూ వివాహ చట్టం సెక్షన్ 24 ప్రకారం కోర్టులో భార్యాభర్తల మధ్య విడాకుల కేసులు విచారణలో ఉన్నకాలంలో కోర్టు ఖర్చులకు, ఇతర ఖర్చులకు గాను కొంత సొమ్ము ఇవ్వాలని ఇరుపక్షాల ఆర్థిక పరిస్థితిని పరిశీలించి ఒక మధ్యంతర ఉత్తర్వును  జారీ చేసే అవకాశం ఉంటుందని తెలియజేశారు. సెక్షన్ 24 వివాదంలో ఉన్న వివాహితులకు సత్వర తాత్కాలిక పరిష్కారాన్ని ఇవ్వటం కోసం ఉద్దేశించిందని వివరించారు. దాంతో విష్ణు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.

 

మరిన్ని వార్తలు