వాళ్లు వెళ్లిపోయారు... వీళ్లు వడలిపోయారు!

31 Oct, 2016 23:02 IST|Sakshi
మధ్యాహ్నమే మహిళా ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లిపోవడంతో ఐస్‌ల్యాండ్‌లో వెలవెలపోతున్న ఓ ప్రభుత్వ కార్యాలయం

జెండర్ ఫైట్

ఐస్‌లాండ్‌లో నిన్న మళ్లీ మధ్యాహ్నం 2.38 నిమిషాల తర్వాత మహిళలెవరూ ఆఫీసులలో కనిపించలేదు! గత కొన్ని సొమవారాలుగా ఆ దేశంలో ఇలా మహిళా ఉద్యోగులు మధ్యలోనే పనిమాని, లే దా పని అక్కడికి ముగించి, ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అలాగని వారి ప్రభుత్వం ఆఫ్టర్‌నూన్ నుంచి ఆడవాళ్లంతా హాయిగా ఇళ్లకు వెళ్లిపోవచ్చని ఏమీ ప్రకటించలేదు. ఉద్యోగినులే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మగవాళ్లకు ఇస్తున్న జీతాలతో పోల్చిచూస్తే... తమకు వచ్చే జీతానికి తాము 2.38 గంటల వరకు మాత్రమే పనిచేస్తే సరిపోతుందని లెక్కగట్టి, అంతవరకే ఆఫీసులలో ఉంటున్నారు ఐస్‌లాండ్ మహిళా ఉద్యోగులు. సమానమైన పనికి సమానమైన వేతనం ఉండాలని ఎన్నిసార్లు పిడికిలి బిగించి, నినాదాలు చేసినా ఫలితం లేకపోవడంతో వాళ్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దశాబ్దం క్రితం.. 2005లో మధ్యాహ్నం 2.08 గంటల వరకు పని చేసి వెళ్లిపోయేవారు.

2008లో ఆ వెళ్లిపోయే సమయం 2. 25 గం. అయింది. ఇప్పుడు అదే 2.38కి వచ్చింది. అంటే జీతంలోని అసమానతలు కొద్దికొద్దిగా తగ్గేకొద్దీ సోమవారాల్లో వీళ్లు పనిచేసే టైమ్ నిమిషాల వ్యవధిలో పెరుగుతూ వస్తోంది. ఈ ధోరణితో ప్రభుత్వ కార్యాలయాలు తలపట్టుకుంటున్నాయి. వారానికొకసారి కొన్ని గంటల ముందు మహిళా ఉద్యోగినులు ఇళ్లకు వెళ్లిపోతే వచ్చే నష్టం కన్నా... వాళ్లు వెళ్లిపోయాక వెలవెలపోతున్న కార్యాలయాల్లో పురుష ఉద్యోగులు ఉత్సాహం నశించి, ఈసురోమంటూ పని చేసుకుంటూ పోవడం వల్ల ఉత్పాదక తగ్గి ఎక్కువ నష్టం వస్తోందని అక్కడి సర్వేలు చెబుతున్నాయట!

ఈ మాట అలా ఉంచితే... స్త్రీ పురుష వివక్ష లేని దేశంగా కొన్నేళ్ల నుంచీ ఐస్‌లాండ్ మార్కులు కొట్టేస్తోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వాళ్ల ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్’ ప్రకారం ఐస్‌లాండ్‌కు ‘మహిళల స్వర్గసీమ’ అన్న పేరు కూడా ఉంది. ఎంత పేరున్నా నేటికీ ఆ దేశంలోని మహిళలు మగవాళ్లకన్నా 14 నుంచి 17 శాతం తక్కువగా జీతాలు పొందుతున్నారు.

మరిన్ని వార్తలు