థ్రెడ్డింగ్ థియరీ..

27 Oct, 2015 22:36 IST|Sakshi
థ్రెడ్డింగ్ థియరీ..

బ్యూటిప్స్

ముఖానికి కనుబొమ్మలు ఎంత అందమో..వాటికి షేపింగ్ మరింత అందాన్ని ఇస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదంటున్నారు మగువలు. ఐబ్రోస్‌ను షేపింగ్ చేసే పద్ధతుల్లో థ్రెడ్డింగ్ ఒకటి. ఈ పద్ధతికి బదులుగా ఒకప్పుడు కేవలం ఐబ్రో పెన్సిల్‌ను మాత్రమే ఉపయోగించేవారు. తర్వాతి రోజుల్లో ఈ థ్రెడ్డింగ్ పద్ధతి నగరాలను దాటి గ్రామాల్లోకీ వెళ్లింది. దాంతో ఇప్పుడు గృహిణుల్లో  60శాతం, విద్యార్థుల్లో 90శాతం మంది షేపింగ్ చేయించుకోకుండా ఉండటం లేదంటున్నారు నిపుణులు. థ్రెడ్డింగ్‌కు వెళ్లినప్పుడు ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి.

మీరు ఎలాంటి షేప్ కావాలని కోరుకుంటున్నారో థ్రెడ్డింగ్ చేసేవారికి ముందే వివరించండి. లేదంటే మీరు అనుకున్న షేప్ రాకపోతే మళ్లీ దాన్ని మారుస్తూ ఉంటే చర్మం స్టెయిన్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకు ఇదివరకు చేయించుకున్న తాలుకు ఫొటోలు ఏమైనా ఫోన్లో ఉంటే వారికి చూపించండి.

ఈ విషయంలో శుభ్రత కూడా ముఖ్యం. థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఎక్కువమంది దారాన్ని నోట్లో పంటి కింద పెట్టుకొంటుంటారు. అమెరికాలోని కాలిఫోర్నియాలాంటి నగరాల్లో దారాన్ని నోట్లో కాకుండా మెడ చుట్టూ చుట్టుకుంటారట. అక్కడ దారాన్ని నోట్లో పెట్టుకొని థ్రెడ్డింగ్ చేయడం నేరం. కుదిరితే మీరు కూడా రెండో పద్ధతిలోనే చేయించుకోండి. వాళ్ల చేతికి గ్లౌజులు ఉండేలా చూసుకోండి.

బ్యుటీషియన్లు ఉపయోగించేది కాటన్ థ్రెడ్డేనా కాదా అన్న విషయం కనుక్కొండి. అవి కాకుండా వేరే దారాలు వాడటం మంచిది కాదు. ఎందుకంటే వెంట్రుకలకు బదులు చర్మం ఊడితే ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి కట్టింగ్‌లో తక్కువ వెంట్రుకలు మాత్రమే రావాలని వారికి వివరించండి.

తక్కువ ధరే కదా అని ఎవరితో పడితే వారితో థ్రెడ్డింగ్ చేయించుకోవడం హానికరం. వాళ్లు ఎక్కడ ట్రెయిన్ అయ్యారో కనుక్కొని మరీ వెళ్లండి. మరో ముఖ్య విషయం ఏంటంటే వారు ఒక మనిషికి థ్రెడ్డింగ్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో గమనించాలి. గబగబా కాకుండా నిదానంగా చేయాల్సిందిగా బ్యుటీషియన్లకు ముందే చెప్పండి.
     
{థెడ్డింగ్ అయ్యాక రెండు గంటల పాటు ఎలాంటి మేకప్ వేసుకోకూడదు. థ్రెడ్డింగ్ అయిపోయాక తప్పకుండా లోషన్ రాసుకోవాలి. అలా చేస్తే ఎలాంటి స్కిన్ ఇన్‌ఫెక్షనులు రావు. అవి కూడా నాణ్యమైన లోషన్లనే ఎంచుకోవాలి. థ్రెడ్డింగ్ సమయంలో ఐబ్రోస్ పౌడర్ తప్పనిసరిగా వేయించుకోండి.
 

 

>
మరిన్ని వార్తలు