మైగ్రేన్‌ నయమవుతుందా? 

20 Jun, 2019 08:10 IST|Sakshi

నా వయసు 26 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన తలనొప్పి వస్తోంది. ఆఫీసులో ఏపనీ చేయలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్‌ అన్నారు. హోమియో మందులతో ఇది తగ్గుతుందా? 
– ఆర్‌. జానకి, అమలాపురం 
పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్‌ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ. 
కారణాలు:  తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన వాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్‌ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. 
లక్షణాలు: పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడురకాలుగా విభజించవచ్చు. 
1 పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు : ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్లముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. 
2 పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. 
3 పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు: చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
చికిత్స / నివారణ: కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్‌టిట్యూషన్‌ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. 
 

>
మరిన్ని వార్తలు