మాట వింటే దేవత.. మీటూ అంటే దెయ్యం 

13 Feb, 2019 00:09 IST|Sakshi

ఒక స్త్రీ.. పితృస్వామ్య సమాజం రూపొందించిన చట్రంలో ఇమిడిపోతే ఆమెను దేవతగా కొలుస్తారు. ఆమెను ఇంటికి దీపం అంటారు. అదే స్త్రీ తనకు తాను స్వతంత్ర అభిప్రాయాలతో, వ్యక్తిత్వంతో రాణిస్తుంటే దెయ్యం అనేస్తారు. మగ ఉద్యోగులు లేడీ బాస్‌లను భరించలేకపోవడానికి కారణం కూడా ఈ భావజాలమేనా? ‘ఎస్‌’ అంటున్నారు సుధా మీనన్‌. 

‘ఉమెన్‌ ఆన్‌ టాప్‌’ అనే అంశం మీద గత నెలలో హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో ఒక చర్చాగోష్ఠి జరిగింది. మహిళలు ఎన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారో తలుచుకుంటూ స్ఫూర్తిదాయకంగా సాగుతోంది చర్చ. ప్రపంచంలో స్త్రీ– పురుషుల మధ్య సమానత్వం అనేది ఎక్కడా ఆచరణలో లేదని, అవకాశాల్లో అది ప్రతిబింబిస్తూనే ఉంటుందని, అయినప్పటికీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగడంలో మహిళలు ఎక్కడా వెనుకడుగు వేయకపోవడం వల్లనే ఈ లక్ష్యాలు సాధ్యమయ్యాయని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సుధా మీనన్‌ వంటి రచయితలు తమ అనుభవాలను పంచుకున్నారు కూడా. ఇదే సభలో ఒక వ్యక్తి లేచి ‘ఒక వైపు ‘మీటూ’ ఉద్యమం ఉధృతంగా నడుస్తోంది. మరోవైపు ‘ఉమెన్‌ ఆన్‌ టాప్‌’ అని చర్చా వేదికలూ మీరే నిర్వహిస్తారు. దీనిని ద్వంద్వ వైఖరిగా చూడవచ్చా?’ అనే ప్రశ్న లేవనెత్తాడు. దీని మీద హక్కుల కార్యకర్త వసంత కన్నభిరాన్‌ స్పందిస్తూ ‘‘అది ద్వంద్వ వైఖరి కాదు, అవి రెండూ రెండు వేర్వేరు కోణాలు మాత్రమే’’ అన్నారు. ‘‘మీటూ ఉద్యమం పట్ల మగవాళ్ల అసహనం ఇలా బయటపడుతోందంతే. మగ సమాజం నుంచి ఎదురవుతున్న సవాళ్లకు బెంబేలు పడి వెనక్కిపోయే మహిళలకు ధైర్యం చెప్పడానికి ‘ఉమెన్‌ ఆన్‌ టాప్‌’ అనే అంశం మీద చర్చ చాలా అవసరం’’ అన్నారామె.

ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు
‘ఉమెన్‌ ఆన్‌ టాప్‌’ చర్చలో భాగంగా సుధా మీనన్‌.. మహిళలకు ఎదురయ్యే అనేక సామాజిక పరిమితులను ప్రస్తావించారు. వాటన్నింటినీ అధిగమించి సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం, దానిని నిలబెట్టుకోవడంలో మహిళలకు తానే చక్కటి నిదర్శనమని కూడా చెప్పారామె. ‘‘చిన్నప్పుడు నేను చాలా ముభావంగా ఉండేదాన్ని. నా భావాన్ని బయటకు చెప్పడం వచ్చేది కాదు. బాల్యం అంతా బిడియంతోనే గడిచింది. మాట్లాడేటప్పుడు ఎదుటి వారి కళ్లలోకి చూడడానికి కూడా భయపడేదాన్ని. అమ్మ ఎప్పుడూ ‘చదువుని నిర్లక్ష్యం చేయకూడదు’ అని చెప్తుండేది. ఎందుకు? ఏమిటి? అని తెలియకపోయినప్పటికీ ఆమె మాటను పాటించడం ఒక్కటే నేను చేసింది.

చదవడం వల్ల నాకు నా భావాలను వ్యక్తం చేయడానికి రచన అనే వేదిక దొరికింది. నేను రాసిన ఐదు రచనలకూ సమాజంలో స్త్రీనే ఇతివృత్తం. ఏదీ ఫిక్షన్‌ కాదు. ప్రతిదీ వాస్తవిక సంఘటనల ఆధారంగా మలిచిన కథనాలే. దశాబ్దాలు దాటినా ఆ రచనలు ఇప్పటికీ కాలదోషానికి గురికాలేదంటే... మన సమాజంలో మహిళ పట్ల మగవాళ్లు చూపిస్తున్న వివక్ష అలాగే ఉందని అర్థం.  ఇప్పటికీ ఆడపిల్లలు తమ భావాలను మనసులో దాచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు తప్ప వ్యక్తం చేయడానికి సాహసించడం లేదు. ఎందుకంటే సమాజం ఒక లేబిల్‌ వేస్తుంది. ఆ లేబిల్‌ని భరిస్తూ జీవించాల్సి వస్తుందనే భయం. చెప్పినట్లు వింటే దేవత. వినకుంటే దెయ్యం. ‘దేవి, దివా ఆర్‌ షీ డెవిల్‌’లో అదే రాశాను’’ అని తెలిపారు సుధా మీనన్‌.

 సర్దుబాట్లు మహిళకే!
‘‘ఒక మగవాడు కెరీర్‌లో బిజీ అయితే ఆ ఇంట్లో అందరూ అతడికి సహకరిస్తారు. బంధువుల ఫంక్షన్‌లకు అతడు హాజరుకాలేకపోతే భార్య, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ‘అతడి తీరికలేనితనాన్ని’ ఇంట్లో వాళ్లతోపాటు బంధువులు కూడా గౌరవిస్తారు. అదే ఒక మహిళ తన ఆఫీస్‌లో బాధ్యతల కారణంగా ‘ఫలానా ఫంక్షన్‌కి నేను రాలేను, మీరు వెళ్లండి’ అంటే ఇంటి నుంచే వ్యతిరేకత మొదలవుతుంది. ‘ఎలాగోలా సర్దుబాటు చేసుకుని రావాలి’ అని ఒత్తిడి చేస్తారు. ఈ పరిస్థితి చూస్తూ పెరిగిన ఆ ఇంటి ఆడపిల్లలు తమ ఇష్టాలను, అభిప్రాయాలను గొంతులోనే నొక్కేసుకుంటున్నారు. ఆడపిల్లలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వాతావరణం కల్పించలేని ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి తనకేం కావాలో సమాజంలో మాత్రం నోరు ఎలా తెరవగలుగుతుంది’’ అని ప్రశ్నించారు సుధ. ‘సమాజంలో అవరోధాలు ఎప్పుడూ ఉంటాయి.

వాటిని ఎదుర్కొని నిలబడిన వాళ్లే టాప్‌లో నిలవగలుగుతారు. టాప్‌లో నిలవడానికి చేస్తున్న ప్రయత్నంలో లోపం ఉండరాదు’ అన్నారామె. అదే సందర్భంలో వ్యక్తం అయిన ‘మీటూ ఉద్యమం – ఉమెన్‌ ఆన్‌ టాప్‌’ అంశాల పట్ల విశ్లేషణాత్మక వాదన కొనసాగింది. అంతిమంగా... ‘మీటూ అంటూ ఉద్యమించాల్సిన పరిస్థితులు సమాజంలో అడుగడుగునా ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొని పెద్ద స్థానాలను అధిరోహించిన మహిళలను గుర్తు చేసుకోవడం ఎప్పుడూ అవసరమే. ఇప్పుడు మరింత అవసరం. ఎందుకంటే ‘మీటూ’ ఉద్యమంలో బయటపడుతున్న భయానకమైన అనుభవాలను చూసి ఆడపిల్లలు చాలెంజింగ్‌ జాబ్స్‌లోకి రావడానికి జంకే ప్రమాదం ఉంటుంది. భయపడి దాక్కోవడం కాదు, బయటకొచ్చి నిలబడాలని చెప్పడానికి ‘ఉమెన్‌ ఆన్‌ టాప్‌’ అనే చర్చ ఎప్పుడూ అవసరమే. మీటూ ఉన్నంతకాలం ఈ చర్చకు ప్రాసంగికత ఉంటూనే ఉంటుంది’ అనే ముగింపుతో గోష్ఠి ముగిసింది.

మీటూపై పురుషుల అసహనం
లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు ‘మీ టూ’ అంటూ ముందుకు రావడంతో ఎంతోమంది ప్రముఖుల ముసుగులు తొలిగాయి. ఇలా ఇంకా ఎన్ని తలలు రాలుతాయోననే భయం మగ సమాజాన్ని వెంటాడుతోందిప్పుడు. ఆ అభద్రతలో నుంచి వస్తున్న వితర్క వాదనలే ఇవన్నీ. ఆడవాళ్లకు ఇంత ధైర్యం వచ్చిందేమిటి... అనే అసహనం కూడా పెరిగిపోతోంది. మహిళలు లక్ష్యాలను సాధిస్తున్నారు, టాప్‌లో నిలుస్తున్నారనే వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి కూడా అహం అడ్డు వస్తోంది. తనకు ఇంత వరకు తెలిసిన సమాజం తమకు ఫ్రెండ్లీగా ఉంది, ఇప్పుడు మహిళలు గళమెత్తితే వచ్చే మార్పు తమకు అనుకూలంగా ఉండకపోవచ్చు.. అనే ఆందోళన మగవాళ్ల చేత ఇలా మాట్లాడిస్తోంది.

చలనశీలి  
సుధా మీనన్‌.. బిజినెస్‌ జర్నలిస్టు, రచయిత, మోటివేషనల్‌ స్పీకర్‌. మహిళల్లో నాయకత్వ లక్షణాలు, స్త్రీ–పురుష వైవిధ్యతల ఆధారంగా కార్పొరేట్‌ సంస్థలు, విద్యాసంస్థల్లో తలెత్తే అంశాలను చర్చించి పరిష్కరించడంలో ఆమె నిష్ణాతురాలు. నాన్‌ఫిక్షన్‌ రచనలు ఐదు చేశారు. అవి ‘ఫైస్టీ యట్‌ ఫిఫ్టీ’, ‘దేవి, దివా ఆర్‌ షీ డెవిల్‌’, ‘గిఫ్టెడ్‌: ఇన్‌స్పైరింగ్‌ స్టోరీస్‌ ఆఫ్‌ పీపుల్‌ విత్‌ డిసేబిలిటీస్‌’, ‘విరాసత్‌’, ‘లెగసీ: లెటర్స్‌ ఫ్రమ్‌ ఎమినెంట్‌ పేరెంట్స్‌ టు దెయిర్‌ డాటర్స్‌’. వీటితోపాటు ఆమె ‘గెట్‌ రైటింగ్‌’, ‘రైటింగ్‌ విత్‌ ఉమెన్‌’ పేరుతో రైటింగ్‌ వర్క్‌షాపులు నిర్వహించారు.

- వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు