ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్‌ ఉంది... నాకూ వస్తుందా?

27 Nov, 2019 06:05 IST|Sakshi

క్యాన్సర్‌ కౌన్సెలింగ్‌

మా ఇంట్లో చాలామంది క్యాన్సర్‌తోనే చనిపోయారు. కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్‌బారిన పడి ఉంటే, ఆ కుటుంబ వారసులూ జాగ్రత్తగా ఉండాలని విన్నాను. మా ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్‌ కేసులు ఎక్కువ కాబట్టి నేనూ క్యాన్సర్‌తో చనిపోతాననే ఆందోళన ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.

సాధారణంగా క్యాన్సర్‌ వ్యాధి బారిన పడి చనిపోయిన కుటుంబ చరిత్ర ఉంటే వాళ్ల వారసులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగానే ఉందని చెప్పాలి. దీనికి స్త్రీ, పురుషులు, వయసు వంటి అంశాలతో సంబంధం లేదు. ఎవరికైనా రావచ్చు. అయితే మా తాతగారి కాలంలో క్యాన్సర్‌ వ్యాధికి సరైన చికిత్సే కాదు... దానిని ముందుగా కనిపెట్టేందుకు తగినంత వైద్యపరిజ్ఞానం కూడా లేదు. దాంతో అప్పట్లో క్యాన్సర్‌ పదం వింటేనే ఆ వ్యాధి బారిన పడ్డవారిపై ఆశలు వదులుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో పాటు నిపుణులైన డాక్టర్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. అంతేకాదు ముఖ్యంగా ఈ క్యాన్సర్‌వ్యాధిని ముందే గుర్తించే అధునాతనమైన వైద్య పరికరాలు, ఉపకరణాలు, వైద్య పరీక్షలు, ఇతరత్రా అనేక ప్రక్రియలు మనకు అందుబాటులోకి వచ్చాయి.సాధారణంగా ఏ రకమైన క్యాన్సర్‌నైనా మొదటిదశలోనే గుర్తిస్తే దాన్ని సమూలంగా రూపుమాపవచ్చు.

సకాలంలో గుర్తిస్తే దాదాపు 75 శాతం వరకు దీనిని ఎదుర్కొనే వైద్యసదుపాయాలు ఉన్నాయి. కానీ దీని బారిన పడ్డవారు చివరిదశలో చికిత్సకోసం వస్తే మాత్రమే వారి జీవితానికి 25 శాతం హామీ ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే... మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న అలవాట్లను బట్టి మీరు వెంటనే కొన్ని వైద్యపరీక్షలు చేయించుకుంటే మీకు క్యాన్సర్‌ వస్తుందా... రాదా అని కూడా చెప్పవచ్చు. మీకు ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చు. ఒకవేళ చెడు అలవాట్లకు లోనైతే క్యాన్సర్‌బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే అందరూ గుర్తించి, పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి... ∙పొగతాగే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మానేయాలి ∙మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.  క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి  తాజా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు తినాలి.  చిన్నప్పుడు ఇవ్వాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లను పిల్లలకు ఇవ్వాలి.
డాక్టర్‌ సిహెచ్, షైనీ రెడ్డి సీనియర్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్‌. మలక్‌పేట, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు