నటనకు సరిహద్దులు లేవు...

4 Aug, 2014 23:07 IST|Sakshi
నటనకు సరిహద్దులు లేవు...

లైఫ్‌బుక్

పద్నాలుగు సంవత్సారాల వయసులోనే మోడలింగ్‌లోకి ప్రవేశించాను. ‘బారిష్ కే ఆన్సు’ ‘తన్నీర్ ఫాతిమా బి.ఏ’ మొదలైన టీవి సీరియల్స్ నాకు గుర్తింపు తెచ్చాయి. ‘బోల్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాను. రాబోయే ‘రాజా నట్వర్‌లాల్’ సినిమాలో ఇమ్రాన్ హష్మీ సరసన నటిస్తున్నాను.
     
చిన్న వయసులోనే కెమెరా ముందుకు రావడం వల్ల కావచ్చు... కెమెరా నాకు చాలా పాత స్నేహితురాలు అనిపిస్తుంది. మనుషులతో మాట్లాడడం కంటే కెమెరా ముందు నిల్చొని నటించడంలోనే నాకు సౌకర్యంగా ఉంటుంది.
     
మోడలింగ్, నటన... రెండు రంగాల్లో పని చేస్తున్నప్పటికీ, నటన అంటే చాలా ఇష్టం. మోడలింగ్ కంటే నటనతోనే ఎక్కువమందికి చేరువకాగలం. పేరు తెచ్చుకోగలం. చెప్పొచ్చేదేమంటే, ఫ్యాషన్ మోడల్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీ వారికి మాత్రమే తెలుస్తారు. నటులు మాత్రం మారుమూల గ్రామాలకు సైతం తెలుస్తారు.
     
సరిహద్దులు నటుల ప్రతిభను ప్రభావితం చేయలేవు. నటులకు సరిహద్దులతో పనిలేదు. దేశాలకు అతీతంగా మనం నటులను ప్రేమించేది ఈ కారణంతోనే. నేను పాకిస్థాన్ నటిని అయినప్పటికీ ఇండియాలో నటించినప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఎలాంటి వివక్ష కనిపించలేదు.
     
 స్క్రిప్ట్‌లో శక్తి ఉంటే చిన్న బడ్జెట్ సినిమా అయినా నా దృష్టిలో పెద్ద బడ్జెట్ కింద లెక్క.
     ‘‘ఫలానా సినిమాలో నాకు ఒక పాత్ర వచ్చింది. అది నాకు నచ్చింది. ఆ పాత్రకు వందశాతం ఎలా న్యాయం చేయాలి?’’ అనే దాని గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తాను.
     
అందానికి, వ్యక్తిత్వానికి దగ్గర సంబంధం ఉంటుంది. చూడడానికి బాగున్నా, ప్రవర్తన చెడుగా ఉంటే వాళ్లు అందంగా లేనట్లే. అందమైన వ్యక్తిత్వమే అసలు అందం అనేదాన్ని నమ్ముతాను.
 
- హుమైమా మాలిక్, హీరోయిన్
 

మరిన్ని వార్తలు