కొత్తగా ఆలోచించండి

13 Mar, 2019 00:39 IST|Sakshi

నేనున్నాను

ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ పెట్టి ‘నేను ఫలానా షోరూమ్‌లో షాపింగ్‌ చేశాను, నేను ఫలానా చోటికి పిక్‌నిక్‌కి వెళ్లాను, లైక్‌లు కొట్టండి’ అని అడగరామె. ‘ఈ వ్యక్తికి ఈ అవసరం ఉంది. నేనింత వరకు చేయగలిగాను, తలా ఓ చెయ్యి వేస్తే వాళ్ల కష్టం తీరుతుంది. మానవత్వంతో స్పందించండి ప్లీజ్‌’ అనే పోస్ట్‌లు మాత్రమే చేస్తారు. ఆ పోస్ట్‌కి స్పందించిన వాళ్లు తమకు తోచిన సాయం చేస్తుంటారు. జగిత్యాలకు చెందిన ఆ ఆరేళ్ల కౌశిక్‌కి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ చేయాల్సి ఉందని ఫేస్‌బుక్‌ ద్వారా తెలుసుకుని, వెంటనే గ్లోబల్‌ హాస్పిటల్‌కి వెళ్లారామె. ఆ తల్లిని, పిల్లాడిని పరామర్శించి కట్టుబట్టలతో వచ్చిన వాళ్లకు అవసరమైన దుస్తులు కొనిచ్చి ఆపరేషన్‌కి కొంత డబ్బిచ్చారు.

పిల్లాడి తల్లిని ఓదారుస్తున్న ఫొటోతోపాటు ఫేస్‌బుక్‌లో ఆపరేషన్‌కు ఇరవై లక్షలవుతాయనే విషయాన్నీ తెలియచేశారు. తనవంతుగా ఒక ప్రయత్నమైతే మొదలైంది. కానీ ఆపరేషన్‌కు అవసరమైనంత డబ్బు సమకూరుతుందో లేదో ఊహకందడం లేదు. ‘ఎవరూ ముందుకు రాకపోతే ముఖ పరిచయం ఉన్న వాళ్లందరినీ బతిమలాడి అయినా డబ్బు సమకూరుస్తాం. ఆపరేషన్‌ మొదలు పెట్టండి’ అని డాక్టర్లను ఒప్పించారు. నిస్వార్థంగా  ఒక మంచి మొదలు పెడితే అవసరమైనవన్నీ వాటంతట అవే సమకూరుతాయి. సరిగ్గా కృష్ణవేణి ప్రయత్నం కూడా అలాగే విజయవంతమైంది. ఒకరు ఏకంగా రెండు లక్షలు విరాళం ఇచ్చారు. అనేక మంది తమకు తోచినంత ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేకి తెలిసి కొంత సాయం చేశారు. పిల్లాడికి ఆపరేషన్‌ జరిగింది. రాత్రి ఒంటి గంట వరకు ఆ తల్లికి ధైర్యంగా పక్కనే ఉన్నారు కృష్ణవేణి. ‘ఇలాంటి పనిలో ఆత్మసంతృప్తి ఉంటుంది. నా సంతోషం కోసమే చేస్తున్నాను’ అన్నారామె.

అంతరం ఇంకా ఉంది
కృష్ణవేణి చేస్తున్న పనులకు పెద్దగా ప్రణాళికలు ఉండవు. తన కళ్లెదుట ఒక వార్త కనిపిస్తే ఆ వార్త రాసిన రిపోర్టర్‌ వివరాలు కనుక్కోవడం, అక్కడికి వెళ్లి బాధితులకు సహాయం చేయడానికి మార్గదర్శనం చేయడమే ఆమె సమాజానికి ఇస్తున్న సర్వీస్‌. ‘సిరిసిల్లలో నరసవ్వకు కళ్లు కనిపించవు, ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు’ అని స్థానిక వార్తాపత్రిక కథనం చూసి అడ్రస్‌ వెతుక్కుంటూ వెళ్లారు కృష్ణవేణి. తన వంతుగా నిత్యావసర వస్తువులు, దుస్తులు, కొంత డబ్బు ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి సిరిసిల్లకు ఒక మహిళ వచ్చి సాయం చేస్తుంటే ఇక్కడుండీ చూస్తూ ఊరుకోవడమా.. అని స్థానికులు ఆమెకు ఒక గూడు కట్టిచ్చారు.

అక్కడి ఇల్లంతకుంటలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధితులకు కూడా ఆమె చేసింది తాత్కాలిక అవసరాలు తీర్చడమే. అయితే ఆమె వేసిన తొలి అడుగును స్ఫూర్తిగా తీసుకుని మరో పదిమంది ఆమె బాటలో నడిచారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు రూపొందించినా ఆ చట్రంలో ఇమడని ఎన్నో సమస్యలు పేదరికాన్ని పరిహసిస్తూనే ఉంటాయి. వాటిని అడ్రస్‌ చేయడమే కృష్ణవేణి సమాజానికి చేస్తున్న సేవ. అయితే ఆమె సేవ అనే మాటను అంగీకరించరు. 

పెద్ద కోడలు
సిరిసిల్లలో పుట్టిన కృష్ణవేణి ఇంట్లో చిన్నమ్మాయి. అత్తగారింట్లో పెద్దకోడలు. ‘‘మా ఇల్లు ఎప్పుడూ బంధువులతో నిండిపోయేది. ఉదయం ఎవరూ లేకపోయినా మధ్యాహ్న భోజనం టైమ్‌కి నలుగురు అదనంగా ఉండేవాళ్లు. మా పక్క ఊళ్ల నుంచి పనుల మీద సిరిసిల్ల పట్టణానికి వచ్చిన వాళ్లకు, హాస్పిటల్‌లో వైద్యం, ప్రసవం కోసం వచ్చిన వాళ్లందరికీ భోజనం, విడిది మా ఇంట్లోనే. అత్తగారింటికి కరీంనగర్‌కి వెళ్తే అక్కడా దాదాపుగా అదే పరిస్థితి. వాళ్లు, వీళ్లు అనే తేడా ఉండేది కాదు ఇంట్లో. కులాలు, మతాలు, ఆర్థిక తారతమ్యాలు లేకుండా వచ్చిన అందరూ కలివిడిగా ఉండేవాళ్లు. మేము హైదరాబాద్‌కి వచ్చినా ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనసాగుతోంది.

గత నెలలో కూడా బంధువులావిడ కంటి ఆపరేషన్‌ చేయించుకుని మా ఇంట్లోనే ఉండి గత వారమే ఊరికి వెళ్లింది. అలాంటి ఇంటి వాతావరణమే నాకు మనుషుల కష్టానికి స్పందించే మనసునిచ్చింది. కష్టంలో ఉన్న వారి కష్టాన్ని మనం తీసి పక్కన పెట్టలేక పోవచ్చు. కానీ నాలుగు మంచి మాటలు చెప్పి, జీవితం పట్ల ధైర్యాన్ని కలిగించడానికి, ఓదార్పునివ్వడానికి మన ఆస్థులు ఖర్చయిపోవు కదా!. నా పిల్లలు పెద్దయ్యారు. భర్త ప్రభుత్వ ఉద్యోగి. నాకు రోజులో ఐదారు గంటల ఫ్రీ టైమ్‌ ఉంటుంది. వైద్యం కోసం మా ఇంటికి వచ్చిన వాళ్లను హాస్పిటల్‌కి తీసుకెళ్తాను. అక్కడ నాకు ఎవరైనా అవసరంలో ఉన్నట్లు కనిపిస్తే చేయగలిగింది చేస్తాను. ఎదుటి వాళ్ల కష్టాన్ని మన మనసుతో చూస్తే పరిష్కారానికి ఒక మార్గం కనిపిస్తుంది’’ అన్నారు కృష్ణవేణి.

ఔదార్యమే జీవితం
‘పేదరికాన్ని మించిన శాపం మరొకటి ఉండదు. ఆ శాపంతో బతుకు పోరాటం చేస్తున్న వాళ్లను ఈసడించుకుని పక్కకు తప్పుకుని పోవడం కాదు జీవితమంటే. అన్నీ అమరిన తన విస్తరిలో నుంచి ఆకలితో ఉన్న వాళ్లకు ఒక పిడికెడు మెతుకులు పెట్టగల ఔదార్యమే జీవితం’. కృష్ణవేణి నమ్ముతున్న ఫిలాసఫీ ఇది, ఆమె అనుసరిస్తున్న ఫార్ములా కూడా అదే. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ‘మలేసియా తెలుగు సంఘం’ కృష్ణవేణికి సేవా విభాగంలో పురస్కారం అందించింది. ఆ అవార్డు అందుకుని ఇండియాకి వచ్చిన కృష్ణవేణి.. మహిళా దినోత్సవం రోజు వికలాంగులైన మహిళలను, సురభి మహిళా కళాకారులను చీర, సారెలతో సత్కరించారు. పేదరికాన్ని పరిహసించకూడదని నమ్మే కృష్ణవేణి పదిహేనేళ్ల కిందట ఇళ్లలో పని చేసుకునే వాళ్లను తనింటికి ఆహ్వానించి భోజనం వండి పెట్టడంతో పేదవాళ్లను అక్కున చేర్చుకోవడం మొదలు పెట్టారు. ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. 
వాకా మంజులారెడ్డి, 
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

నిరంతరం సేవాదృక్పథం 
ఇంటర్‌తో చదువు మాన్పించి పెళ్లి చేశారు మా పెద్దవాళ్లు. పిల్లలు పుట్టిన తర్వాత కామర్స్‌లో డిగ్రీ, ఎల్‌ఎల్‌బి చేశాను. ఇంట్లో ఒక దశలో ముగ్గురం స్టూడెంట్స్‌మి. మా అబ్బాయి ఇంజనీరింగ్, పాప మెడిసిన్, నేను ఎల్‌ఎల్‌బిలో ఉన్నాను. మా వారు ‘ఇద్దరు పిల్లల్ని కాదు ముగ్గుర్ని చదివిస్తున్నాను’ అని నవ్వుతూ అనేవారు. ఆయన ఇంటికి వచ్చేటప్పటికి ఏదో ఒక ప్రోగ్రామ్‌ రెడీగా ఉంటుంది. ‘ఫలానా బ్లైండ్‌ స్కూల్లో పిల్లలు చలికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు స్వెట్టర్లు తీసుకెళ్దాం అని ఓ రోజు, అనాథ పిల్లల్ని సినిమాకు తీసుకెళ్దామని ఓ రోజు.. ఇలా ఏదో ఒకటి. ఓ వారం పది రోజుల పాటు కొత్త ప్రోగ్రామ్‌ ఏదీ చెప్పకపోతే ‘కొత్త కృష్ణవేణి కొత్తగా ఏమీ చేయడం లేదా’ అని అడుగుతారు. 

కొత్త కృష్ణవేణి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా