విధేయులైన పామరులతోనే మహాద్భుతాలు

10 Nov, 2019 03:57 IST|Sakshi

సువార్త

గమలీయేలు పౌలు వంటి ఎంతో మంది ఉన్నత విద్యాధికుల్ని తయారు చేసిన గొప్ప మేధావి, మహోపాధ్యాయుడు, నాటి యూదుల సన్‌ హెడ్రిన్‌ చట్టసభలో ముఖ్యుడుగా,. యేసుప్రభువును సిలువ వేయాలన్న తీర్మానం అతని కనుసన్నల్లోనే జరిగింది. అయితే, పిరికివాడు, పామరుడైన పేతురు, యేసుప్రభువు పునరుత్థానం తర్వాత ఎంతో ధైర్యంగా సువార్త బోధిస్తుంటే, యూదయ, యెరూషలేము ప్రాంతాల సామాన్య ప్రజలంతా క్రైస్తవంలోకి వేల సంఖ్యలో చేరుతున్న రోజులవి. సామాన్యులందరికీ అదంతా పండుగలా ఉంటే, యేసును చంపిన యూదుమతపెద్దలకేమో చాలా అవమానకరంగా ఉంది. ప్రభువు  పునరుత్థాన శక్తిని పొందిన పేతురు తదితరుల ప్రసంగాలు, పరిచర్యతో క్రైస్తవం ఇలా ఉపిరి పోసుకొని విస్తరిస్తోంది.

‘మీరంతా కలిసి యేసును చంపారు, కాని దేవుడాయనను తిరిగి సజీవుని చేశాడు, దానికి మేమంతా సాక్షులం’ అంటూ యూదుపెద్దలను దుయ్యబట్టుతూ పేతురు సువార్త ప్రకటించాడు (అపో.కా.3:15). అది విని తట్టుకోలేక ఇక వాళ్ళందరినీ చంపాల్సిందేనంటూ యూదుమత పెద్దలు నిర్ణయించారు. అయితే ‘పేతురు పరిచర్య దేవుని వల్ల కలిగినదైతే మీరు అడ్డుకోలేరు, అలా కాకపోతే, గతంలో ఇలా వచ్చి అలా మాయమైన చాలామంది కోవలోకి వాళ్ళు కూడా చేరుతారు. కాబట్టి మీరు కంగారుపడొద్దు’ అంటూ గమలీయేలు ఇచ్చిన సలహాతో, వాళ్ళు పేతురును ఇతరులను చంపకుండా, కేవలం దెబ్బలు కొట్టి వదిలేశారు(అపో.కా.5:33–40).. పేతురు ప్రసంగాలు విని యేసుప్రభువును అంగీకరించిన వాళ్ళు, పేతురు ప్రసంగాలతో రెచ్చిపోయి అతన్ని చంపాలనుకున్నవాళ్ళు ఆనాడు వేలల్లో ఉన్నారు.

కాని కర్రవిరక్కుండా పాము చావాలనుకునే గమలీయేలు లాంటి మూడవ తెగ వాళ్ళు కూడా కొందరున్నారు. మేధావి వర్గం అంటే ఇదే!! ‘నువ్వు జోక్యం చేసుకోకు, దేవుడే చూసుకుంటాడు’ అన్నది వీళ్ళ ఊతపదం!! సువార్తకన్నా, సిద్ధాంతాల మీద వీళ్లకు శ్రద్ధ, పట్టు ఎక్కువ. చర్చిల్లో, పరిచర్యల్లో  కళ్లెదుటే అపవిత్రత, అనైతికత కనిపిస్తున్నా అందుకు వ్యతిరేకంగా ఉద్యమించరు, కాని వాటిని ‘విశ్లేషిస్తూ’, ఉద్యమించేవారికి ఉచిత సలహాలిస్తూ ‘బ్రేకులేసే’ పరిచర్య వాళ్ళది. గమలీయేలు నాటి యూదులందరికీ పితామహునిలాంటి వాడు.పాత నిబంధననంతా అధ్యయనం చేసి, అందులోని యేసుప్రభువు ఆగమన ప్రవచనాలు, ఆనవాళ్ళన్నీ ఎరిగిన మేధావిగా గమలీయేలు, ‘యేసుప్రభువే మనమంతా ఎదురుచూసే మెస్సీయా’ అని ఆనాడు ధైర్యంగా ప్రకటించి ప్రభువు పక్షంగా నిలబడి ఉంటే ఎంత బావుండేది.

చాందస యూదులంతా పశ్చాత్తా్తపం పొంది క్రైస్తవులై ఉండేవారు కదా!! గమలీయేలు అలా పరలోకానికి వెళ్లి ఉండేవాడు, దేవుడు ఉజ్వలంగా వాడుకున్న సువార్తికుడుగా చరిత్రలో మిగిలిపోయేవాడు. కాని గమలీయేలు, ఉచితాసలహాలిచ్చే  పాత్రతో సరిపెట్టుకున్నాడు. అతని వద్దే విద్యనభ్యసించిన పౌలు మాత్రం గొప్ప సువార్తోద్యమకారుడై గురువును మించిన శిష్యుడయ్యాడు.. పేతురులాంటి పామరులు లోకాన్నంతా దేవుని కోసం జయించే పనిలో ఉంటే, గమలీయేలు లాంటి వారు పూలదండలు, సన్మానాలు, తాము పెట్టుకున్న దుకాణాలే తమకు చాలనుకున్నారు. అలా జీవితకాలపు ఒక మహత్తరమైన అవకాశాన్ని గమలీయేలు చేజార్చుకున్నాడు. అర్థం కాని శాస్త్రాలెన్నో చదివిన మేధావుల వల్ల క్రీస్తుకు, క్రైస్తవ ఉద్యమానికి ఒరిగేదేమీ లేదు. దేవుని ఆదేశాలకు విధేయులైన పామరుల వల్లే దేవుని రాజ్యం అద్భుతంగా నిర్మితమవుతుందన్నది చారిత్రక సత్యం. దేవుని రాజ్య స్థాపనకు కావలసిందల్లా దేవుని వాక్యం పట్ల సంపూర్ణమైన విధేయతే తప్ప, సకలశాస్త్ర పాండిత్యం, మేధోసంపత్తి కానేకాదు !!
 రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్‌
సంపాదకులు, ఆకాశధాన్యం మాసపత్రిక
ఈమెయిల్‌:  prabhukirant@gmail.com

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు