మగపిల్లల తల్లి

30 Mar, 2019 01:18 IST|Sakshi

లెగ్గింగ్స్‌

ఆడపిల్లల్ని దేహాలుగా తప్ప ఇంకే విధంగానూ చూడలేని మనోస్థితి నుంచి బయటపడే పరిణతిని మగపిల్లలు సాధించేవరకు ఎన్ని యుగాలైనా సరే, లెగ్గింగ్స్‌ వేసుకుని బయటికి వచ్చేందుకు వేచి ఉండటమేనా ఆడపిల్లలు చేయగలిగింది?! అసలు ప్రాబ్లమ్‌ ఎవరితో? మగపిల్లల్తోనా, ఆడపిల్లల్తోనా?

మాధవ్‌ శింగరాజు
‘ది అబ్జర్వర్‌’ పత్రిక మార్చి 25 సోమవారం సంచికలో ఒక ఉత్తరాన్ని ప్రచురించింది. ‘అసలు ఇలాంటి ఉత్తరాన్ని ఎలా ప్రచురిస్తారు?’ అని నేటికీ ఆ పత్రిక ఎడిటర్‌కు మెయిల్స్, ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు బాగా కోపంగా ఉన్నారు. పత్రికకు ఆ ఉత్తరం రాసింది నలుగురు మగపిల్లలు ఉన్న ఓ తల్లి! ‘అమ్మాయిలూ.. దయజేసి మీరు లెగ్గింగ్స్‌ ధరించడం మానండి..’ అని ఆ ఉత్తరంలో ఆ తల్లి విన్నవించుకున్నారు. ‘మగపిల్లల్లో రెండు రకాలవాళ్లు ఉంటారు. ఒంటిని అంటుకుని ఉండే దుస్తుల్లో ఉన్న అమ్మాయిలను చూసి, కళ్లు తిప్పుకోలేక సతమతం అవుతుండేవారు, అసలు ఆవైపే చూడకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండేవారు. ఆ ఇద్దరినీ మీ లెగ్గింగ్స్‌ ఇబ్బంది పెడుతుంటాయి. మగపిల్లల తల్లిగా నేను చేస్తున్న ఈ అభ్యర్థనను సహృదయంతో అర్థం చేసుకుని.. లెగ్గింగ్స్‌ని అవాయిడ్‌ చెయ్యండి’.. అని ఉత్తరం రాసిన ఆ తల్లి పేరు.. మరియన్‌ వైట్‌. ఈ ‘అబ్జర్వర్‌’ పత్రిక మనందరికీ తెలిసిన ‘అబ్జర్వర్‌’ పత్రిక కాదు. అది బ్రిటన్‌ నుంచి వచ్చే న్యూస్‌పేపర్‌. ఆదివారం ఆదివారం వస్తుంది.

ఇది యు.ఎస్‌.లోని ఇండియానా స్టేట్‌లో ఉన్న ‘నోటర్‌ డామ్‌’ యూనివర్సిటీ ప్రచురించే పత్రిక.  నోటర్‌ డామ్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీ. అందులో క్యా లిక్‌ మత పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతుంటాయి. వాటిలో ముఖ్యమైనవి యూనివర్సిటీ పత్రికలో వస్తుంటాయి. అంతగా ముఖ్యం కాని ప్రజాభిప్రాయాలను కూడా తరచు ఆ పత్రిక ప్రచురిస్తుంటుంది. ‘ముఖ్యమైనవి కాని’ అంటే.. పత్రికా సంపాదకునితో ఏకాభిప్రాయం లేనివి. అలాంటిదే మరియన్‌ వైట్‌ రాసిన ఈ ఉత్తరం. మరియన్‌ క్యాథలిక్‌. గత ఏడాది ఆమె తన నలుగురు కొడుకులతో కలిసి సామూహిక ప్రార్థనా మందిరానికి వెళ్లినప్పుడు అక్కడికి వచ్చిన అమ్మాయిల గుంపు ఒకటి.. ఒంటికి అతుక్కుని, కదలికలకు సౌకర్యంగా ఉండే ‘స్నగ్‌–ఫిటింగ్‌’ పాంట్స్‌ (లెగ్గింగ్స్‌)తో కనిపించింది. వారిలో కొందరి లెగ్గింగ్స్‌  ఒంటికి పెయింట్‌ చేసినట్లుగా  ఉన్నాయి! మరియన్‌  ఇబ్బందిగా ఫీల్‌ అయ్యారు. ముఖ్యంగా వాళ్ల నడుము కింది భాగం మగపిల్లల దృష్టి పడేలా ఉండటం ఆమెకు అసౌకర్యంగా అనిపించింది. చుట్టుపక్కల ఉన్నవాళ్ల చూపులు అప్రమేయంగా ఆ వైపు మళ్లడం ఆమె గమనించారు.

అప్పటికప్పుడు వెళ్లి ఆ అమ్మాయిలకు చెప్పలేరు కదా. కొన్నాళ్లు ఆగి, పత్రికకు ఉత్తరం రాశారు. ‘‘అమ్మాయిల వైపు అదే పనిగా చూడటం, కామెంట్‌ చెయ్యడం సభ్యత కాదనే సంస్కారంతోనే నా పిల్లలు పెరిగారు కనుక ఆ అమ్మాయిల గురించి నాకు భయం లేదు. కానీ మగపిల్లలందరూ ఒకేలా ఉంటారన్న నమ్మకం ఏముంది?’’ అని అబ్జర్వర్‌కి రాసిన ఉత్తరంలో మరియన్‌ ప్రశ్నించారు. ‘‘చూపు మరల్చుకోవడం ఆ వయసులోని మగపిల్లలకు పెద్ద శిక్ష. వాళ్లను చూపు తిప్పుకోనివ్వకుండా చేసి శిక్ష విధించడం అన్యాయం’’ అని కూడా ఆమె రాశారు. వెంటనే దీనిపై ఆడపిల్లల తల్లి ఒకరు తీవ్రంగా స్పందించారు. ‘‘లోకంలో ఎన్నో జెండర్‌ సమస్యలు ఉన్నాయి. సిల్లీగా లెగ్గింగ్స్‌కి అడ్డుపడటం ఏమిటి?’’ అని ఆమె చికాకు పడ్డారు. ఆడపిల్లల్ని దేహాలుగా తప్ప ఇంకే విధంగానూ చూడలేని మనోస్థితి నుంచి బయటపడే పరిణతిని మగపిల్లలు సాధించేవరకు ఎన్ని యుగాలైనా సరే, లెగ్గింగ్స్‌ వేసుకుని బయటికి వచ్చేందుకు వేచి ఉండటమే ఆడపిల్లలు చేయవలసిన పని అని మరియన్‌ చెప్తున్నట్లుగా ఆమెకు అనిపించింది.

మరియన్‌ ఉత్తరానికి నిరసనగా నోటర్‌ డామ్‌ విద్యార్థులు సుమారు పదిహేను వందల మంది బుధవారం యూనివర్సిటీ క్యాంపస్‌లో ‘లెగ్గింగ్స్‌ ప్రొటెస్ట్‌’ నిర్వహించారు. సోషల్‌ మీడియాలో కూడా ‘లెగ్గింగ్స్‌ డే ఎన్‌డి’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో అమ్మాయిలు లెగ్గింగ్స్‌తో ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేయడం మొదలైంది. ఇవన్నీ ఇలా ఉంచండి. మరియన్‌ వైట్‌పై ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. ‘ఆడపిల్లలు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఎలాంటివి ధరించకూడదో మీరెలా చెబుతారు? అలా చెప్పడం మానవ హక్కుల్ని హరించడమే’ అంటున్న వాళ్లే ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్లకు మరియన్‌ వైట్‌ చెబుతున్న సమాధానం ఒక్కటే. ‘‘ఒక తల్లిగా నేను నీ ఒంటిని నిండుగా కప్పేందుకు దుప్పటి కోసం వెతుక్కుంటాను. ఒక తల్లిగా నేను నా కొడుకు కళ్లకు గంతలు కట్టేందుకు ఒక స్కార్ఫ్‌ని తెచ్చుకుంటాను. నా కొడుకు నుంచి నిన్ను కాపాడుకోవడం కోసం దుప్పటి.

నీ నుంచి నా కొడుకును కాపాడుకోవడం కోసం స్కార్ఫ్‌’’ అని! అయినా కూడా ఆమెకేం మద్దతు లభించడం లేదు! మద్దతు కోసం ఆమె కూడా పనిగట్టుకుని ఏమీ చూడటం లేదు. దుప్పటి.. స్కార్ఫ్‌.! మరియన్‌ వైట్‌ వాదన బాగుంది. అయితే ఆడపిల్లలకు ఆ వాదన కచ్చితంగా నచ్చదు. నచ్చాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అమ్మాయిలు ‘చూపులు పడేలా’ ఉన్నప్పుడు.. వాళ్లను చూస్తున్నారని చెప్పి అబ్బాయిల్ని తప్పు పట్టడం న్యాయం కాదని మరియన్‌ ఎలాగైతే అంటున్నారో.. ‘చూపులు పడకుండా’ దుస్తుల్ని ఎంపిక చేసుకుని ధరించమని అమ్మాయిలకు చెప్పడం కూడా అలాగే న్యాయం కాదు. అయినా చెబుతూనే ఉన్నామంటే.. అది మన చూపులో ఉన్న భయం మాత్రమే. తల్లులకు, తండ్రులకు ఉండే భయమే! ఉండే భయమే కానీ, ఉండాల్సిన భయం కాదు.      

మరిన్ని వార్తలు