అక్క ప్రేమ

23 Jan, 2019 01:31 IST|Sakshi

రిక్షా బంధన్‌

తల్లి బొడ్డుతాడు తెగితేనే బిడ్డ స్వేచ్ఛగా ఊపిరి పోసుకుంటుంది. నడవలేని తమ్ముడిని తనకు బొడ్డుతాడులా కట్టుకుని రోజూ స్కూలుకు తీసుకెళ్లి, తీసుకొస్తోన్నఈ అక్క.. తమ్ముడి భవిష్యత్తుకు ఊపిరిపోస్తోంది. 

అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ ఉంటుంది, గొడవలూ ఉంటాయి. చెల్లి కోసం అన్న చిటారు కొమ్మన ఉన్న కాయలు కోసిస్తాడు. చెల్లి కోరుకుంటోందని తాను తినకుండా రెండూ చెల్లికే ఇచ్చేస్తాడు కూడా. నాన్న తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లను తమ్ముడి కోసం అక్క త్యాగం చేస్తుంటుంది. తాను త్యాగం చేయకముందే వాటిని తమ్ముడు తినేస్తే దెబ్బలాడుతుంది కూడా. ఎంత దెబ్బలాడినా సరే.. తమ్ముడికి అవసరమైనప్పుడు అమ్మలా బాధ్యత తీసుకుంటుంది అక్క. మయూరి కూడా తన తమ్ముడి విషయంలో తండ్రి బాధ్యతను తలకెత్తుకుంది. నడవలేని తమ్ముడి వీల్‌ చైర్‌ని తన సైకిల్‌కి ‘లింక్‌’ చేసుకుంది. రోజూ తనతోపాటు తమ్ముడు నిఖిల్‌ని స్కూలుకు తీసుకెళ్తోంది!

తమ్ముడి కష్టం.. నాన్న అవస్థ 
హోల్‌ గ్రామం మహారాష్ట్ర, çపుణే జిల్లాలోని బారామతి తాలూకాలో ఉంది. మయూరి, నిఖిల్‌ ఉండేది హోల్‌ గ్రామంలోనే. నిఖిల్‌కి పదమూడేళ్లు, మయూరికి పదహారేళ్లు. నిఖిల్‌ ఫిజికల్లీ చాలెంజ్‌డ్‌ చైల్డ్‌. దాంతో నిఖిల్‌ని రోజూ అతడి తండ్రి స్కూటర్‌ మీద స్కూల్లో దింపేవాడు. తండ్రి ఇతర పనుల మీద బయటకు వెళ్లాల్సిన టైమ్‌ అవుతున్నా సరే.. నిఖిల్‌ స్కూల్‌ వేళల్లో  ఆయన అందుబాటులో ఉండాల్సిందే.

ఉదయం స్కూల్లో దించే టైమ్‌ లోపు వచ్చేయొచ్చు అనుకుని ఎప్పుడైనా బయటికి వెళ్లినప్పుడు ఒక్కోసారి స్కూల్‌ టైమ్‌కి రాలేకపోతే ఆ రోజు నిఖిల్‌ స్కూలుకి ఆబ్సెంట్‌ అవ్వక తప్పేది కాదు. సాయంత్రం తండ్రి రావడం ఆలస్యమైతే నిఖిల్‌ స్కూల్లోనే ఎదురు చూడాల్సి వచ్చేది. పిల్లలందరూ ఇళ్లకు వెళ్లి పోతుంటే తమ్ముడిని వదిలి వచ్చేయలేక మయూరి కూడా తండ్రి వచ్చే వరకు స్కూల్లోనే ఎదురు చూసేది. తమ్ముడి కష్టం, తండ్రి అవస్థ అర్థమవుతున్నాయామెకి.

అక్క సైకిల్‌కి తమ్ముడి వీల్‌చైర్‌
చదువులో చురుకైన కుర్రాడు నిఖిల్‌. నెలలో నాలుగైదు రోజులు స్కూలుకు వెళ్లలేక పాఠాలు మిస్‌ అవుతున్నాడు. పరిష్కారం కోసం ఆలోచించిందా అమ్మాయి. తనకొచ్చిన ఐడియాని టీచర్లకు చెప్పింది. ప్రిన్సిపాల్‌ మెచ్చుకున్నాడు. ఇద్దరు టీచర్లకు మయూరి ఆలోచనను ఆచరణలో పెట్టే బాధ్యత అప్పగించారాయన. సైన్స్‌ టీచర్‌లు జయరామ్, వాశీకర్‌లు మయూరి అడిగినట్లు డిజైన్‌ను కాగితం మీద గీసిచ్చారు. మెకానిక్‌కు చెప్పి వెల్డింగ్‌ చేయించారు.

మయూరి వీల్‌చైర్‌తో ఉన్న సైకిల్‌ తొక్కేటప్పుడు బ్యాలెన్స్‌ తప్పకుండా ఉండడానికి సపోర్టు రాడ్‌ పెట్టించడం వంటి మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. వారం రోజుల్లో సైకిల్‌కు వీల్‌ చైర్‌ అనుసంధానం అయింది! ఇప్పుడు అక్కాతమ్ముళ్లిద్దరూ కలిసి స్కూలుకెళ్తున్నారు. కాదు కాదు... అక్క రోజూ తమ్ముడిని స్కూలుకు తీసుకెళ్తోంది. తండ్రికి తన పనులు చేసుకోవడానికి తగినంత వెసులుబాటు కల్పించింది. పాఠాలు తప్పిపోకుండా చదువుకోవడానికి తమ్ముడికి మార్గం చూపించింది. ‘‘మయూరి చేసిన ప్రయోగం తమ్ముడికి, తండ్రికి సహాయపడడమే కాదు స్కూలుకి మంచి పేరు తెచ్చింది’’ అంటున్నారు ప్రిన్సిపాల్‌ ఏఎస్‌ అతర్‌.

‘‘నస్రపూర్‌లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్‌ పోటీల్లో ఈ సైకిల్‌ను ప్రదర్శించాం. ప్రైజ్‌ వచ్చింది. రాష్ట్ర స్థాయి సైన్స్‌ పోటీల్లో ప్రదర్శించడానికి అర్హత సాధించింది. ఇలా మా ఆనంద్‌ విద్యాలయ స్కూల్‌కి మంచి పేరు రావడమే కాదు, ఈ సైకిల్‌ డిజైన్‌ నడవలేని పిల్లలున్న పేరెంట్స్‌ చాలా మందికి ఉపయోగకరం అవుతుంది’’ అన్నారాయన సంతోషంగా.మెదడు పెట్టి చేసిన డిజైన్‌ కమర్షియల్‌గా హిట్‌ అవుతుందేమో, కానీ మనసు పెట్టి ప్రేమ రంగరించి చేసిన ఈ సైకిల్‌ డిజైన్‌ హృదయాలను బరువెక్కిస్తోంది. సంతోషం నిండిన నిట్టూర్పుతో గుండెని తేలిక పరుస్తోంది.
– మంజీర
 

మరిన్ని వార్తలు