కందకాలుంటే భయం అక్కర్లేదు!

9 Oct, 2018 05:59 IST|Sakshi

నాలుగేళ్ల క్రితం నుంచి విస్తృతంగా కందకాలు తవ్వుతున్నందు వల్ల తమ ఉద్యాన తోట భూమిలో నీటి తేమ పుష్కలంగా ఉందని, వచ్చే ఫిబ్రవరి నెల వరకూ ప్రత్యేకంగా నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కె. చైతన్య రెడ్డి ‘సాగుబడి’తో చెప్పారు. భువనగిరి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామ పరిధిలో ఆయనకు 40 ఎకరాల ఉద్యాన తోట ఉంది. ఇది ప్రధానంగా మామిడి తోట అయినప్పటికీ శ్రీగంధం, ఎర్రచంద్రనం, కొబ్బరి సహా కొన్ని సంవత్సరాల క్రితమే మొత్తం లక్ష మొక్కలు నాటటం విశేషం. గతంలో తీవ్ర నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో బయటి నుంచి నీటి ట్యాంకులు తెచ్చి పోయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ లేదు.

తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జి. దామో దర్‌రెడ్డి(94407 02029)లను సంప్రదించి 4 ఏళ్ల క్రితం మొదటి విడత కందకాలు తవ్వారు. తర్వాత ప్రతి ఏటా ఖాళీ ఉన్న చోటల్లో కందకాలు తవ్వుతూనే ఉన్నారు. ఆ కందకాలలో ఆకులు అలములు వేయడం, అవి కుళ్లి కంపోస్టుగా మారిన తర్వాత కొత్తగా కొన్ని పండ్ల జాతుల మొక్కలు నాటడం.. దగ్గర్లో మళ్లీ కందకాలు తవ్వటం విశేషం. కందకాల్లో కంపోస్టుపై నాటిన మొక్కల వేళ్లు భూమి లోతుల్లోకి సులువుగా చొచ్చుకెళ్తున్నాయని, తద్వారా చెట్లు ఆరోగ్యదాయకంగా పెరగడంతోపాటు.. వాన నీరు కూడా సమర్థవంతంగా భూమిలోకి ఇంకుతున్నదని, తద్వారా లోపలి మట్టిపొరల్లోనూ నీటి తేమ నిల్వ ఉంటున్నదని చైతన్య రెడ్డి తెలిపారు.

ఒక్క వానతోనే బోర్చు రీచార్జ్‌
ఈ ఖరీఫ్‌ సీజన్‌లో చాలా రోజుల వరకు తమ తోట వద్ద సరైన వర్షం పడలేదని, 20 రోజుల క్రితం కురిసిన ఒక్క వానతోనే కందకాల ద్వారా బోర్లు రీచార్జ్‌ అయ్యాయని తెలిపారు. తమ తోటకు 3 వైపులా ఎత్తయిన ప్రదేశాలుండటం వల్ల వర్షపు నీరు భారీగా తమ తోటలోకి వస్తుందని, కందకాలు విస్తృతంగా తవ్వడం వల్ల ఆ నీరు బయటకు పోకుండా ఎక్కడికక్కడే ఇంకుతున్నదన్నారు. మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా కందకాలు తవ్వడం వల్ల ఎక్కడి నీరు అక్కడే భూమిలోకి ఇంకి, మట్టిలో తేమ బాగా ఉందన్నారు.

ఫిబ్రవరి వరకు నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.  మనం పైన అందించే నీరు లోపలి పొరలకు చేరదని, భూమి లోపలికి ఇంకిన నీటి తేమే తోటలను బెట్ట నుంచి రక్షిస్తుందన్నారు. రైతులు ఎవరి భూముల్లో వారు కందకాలు తవ్వుకుంటే నీటి వనరుల పరిరక్షణతోపాటు మన పొలంలోని విలువైన పైపొర మట్టి వానకు కొట్టుకుపోకుండా నిలబడుతుందని, లోపలి మట్టి పొరల్లోనూ నీటి తేమ చాలా కాలంపాటు ఉంటుందన్నారు. వర్షాకాలంలో కురిసిన వర్షపు నీటి తేమ ఫిబ్రవరి వరకు చెట్లను నిలబెడుతుందన్నారు. ఆ తర్వాత నీటిని అందిస్తే సరిపోతుందని చైతన్య రెడ్డి(95500 23456) వివరించారు. 

మరిన్ని వార్తలు