ఇంటిపంటలకు షేడ్‌నెట్‌ అవసరమే లేదు!

26 Feb, 2019 05:32 IST|Sakshi
ఇంటిపైన పచ్చని పంటల మధ్య లత

నాలుగేళ్లుగా వేసవిలోనూ షేడ్‌నెట్‌ వేయకుండా

సేంద్రియ ఇంటిపంటలు పండిస్తున్న గృహిణి లత

కాంక్రీటు జంగిల్‌లా మారిన మహానగరంలో నివాసం ఉంటూ రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తమ మేడ మీదే పండించుకోవడానికి మించిన సేఫ్‌ ఫుడ్‌ ఉద్యమం మరొకటి ఉండదు. ఎందుకంటే.. ఆహారంతో పాటు కడుపులోకి వెళ్లే రసాయనాలు ఎన్నో జబ్బులకు కారణమవుతూ జీవితానందాన్ని ఏ విధంగా హరించివేస్తున్నాయో తెలియజెప్పే నివేదికలు రోజుకొకటి వెలువడుతూనే ఉన్నాయి కదా..!

అటువంటి ఉత్తమాభిరుచి కలిగిన అరుదైన సేంద్రియ ఇంటిపంటల సాగుదారులే ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి, లత దంపతులు. హైదరాబాద్‌ బీరంగూడ రాఘవేంద్ర కాలనీ (బీహెచ్‌ఈఎల్‌ దగ్గర)లో తమ స్వగృహంపై నాలుగేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలను మక్కువతో సాగు చేస్తూ.. మొక్కలతో ఆత్మీయస్నేహం చేస్తూ, ప్రకృతితో మమేకం అవుతున్నారు! 1800 చదరపు గజాల టెర్రస్‌ను పూర్తిగా కూరగాయ మొక్కలు, పూలమొక్కలతో నింపేశారు. ప్రేమతో పండించుకునే సేంద్రియ కూరగాయలను ఆరగించడంలోనే కాదు ఇతరులతో పంచుకోవడంలోనూ అమితానందాన్ని పొందుతున్నారు లత. తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు ఇతర బంధువుల కుటుంబాలకు పండిన పంటలో సగం మేరకు పంచుతుండటం విశేషం.

టెర్రస్‌ పైన పిట్టగోడలకు అనుక్ముని 3 వైపులా హాలో బ్రిక్స్‌ను ఏర్పాటు చేసుకుని మట్టి మిశ్రమం పోసి మొక్కలు పెట్టారు. 300కు పైగా కుండీలు, మూడు సిమెంటు రింగ్స్‌లో రకరకాల మొక్కలు పెంచుతుండటంతో జీవవైవిధ్యం ఉట్టిపడుతోంది. చిక్కుడు కాయలు, వంకాయలు, టమాటోలు, మిరపకాయలు, సొర, నేతిబీర, బీర, కాకరకాయలు ఇప్పుడు పుష్కలంగా వస్తున్నాయి. చేమ మొక్కలను దుంపల కోసమే కాకుండా ఆకుకూరగా కూడా వాడుతున్నారు. పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలకు కొదవ లేదు. అంజీర, సపోట, జామ, నిమ్మ (5 రకాలు), బత్తాయి, ఆరెంజ్, దానిమ్మ, స్టార్‌ ఫ్రూట్, మామిడి (4 రకాలు) వంటి పండ్ల మొక్కలు చక్కగా పెరుగుతూ దిగుబడినిస్తున్నాయి.

నాలుగేళ్లుగా ఇంటిపంటలు సాగు చేస్తున్న లత ఎండాకాలంలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటుంటారు. షేడ్‌నెట్‌ వేయకుండానే ఇంటిపంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటుండటం విశేషం. ఈ ఏడాది ఎండలు ఎక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో చాలా మంది ఇంటిపంటల సాగుదారులు ఇప్పటికే షేడ్‌నెట్‌లు వేసుకున్నారు. అయితే, ఈ ఏడాదీ షేడ్‌నెట్‌ వేయకుండానే పంటలను జాగ్రత్తగా కాపాడుకుంటానని లత  అంటున్నారు. సమ్మర్‌లో రెండుపూటలా మొక్కలకు నీరు ఇస్తానని, అది కూడా తగుమాత్రంగా కొద్ది కొద్దిగానేనని ఆమె అంటున్నారు. కుండీలు, మడుల్లో మట్టి బీటలు వారకుండా చూసుకుంటూ తగుమాత్రంగా రెండు పూటలా నీరు అందించాలని ఆమె సూచిస్తున్నారు. పోషకాలు తగ్గకుండా అప్పుడప్పుడూ వర్మీ కంపోస్టును/ సొంతంగా తయారు చేసుకున్న కంపోస్టును మొక్కలకు అందిస్తూ.. జీవామృతాన్ని వాడుతూ ఉంటే ఎండలకు భయపడాల్సిందేమీ లేదని లత చెబుతున్నారు. ఇంటిపంటలను జీవనశైలిలో భాగంగా మార్చుకున్న ఆదర్శ గృహిణి లత (96032 32114) గారికి జేజేలు!

మరిన్ని వార్తలు