మెదడులోని గడ్డలు మళ్లీ మళ్లీ వస్తాయా? 

1 May, 2019 00:47 IST|Sakshi

న్యూరో కౌన్సెలింగ్‌

నా వయసు 40 ఏళ్లు. విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాను. హాస్పిటల్‌లో చూపించుకుంటే టెస్ట్‌లన్నీ చేసి, మెదడులో గడ్డ ఏర్పడినట్టు గుర్తించారు. బ్రెయిన్‌ ట్యూమర్‌లకు సర్జరీ చేయించుకున్నా అవి పూర్తిగా పోవని విన్నాను. నిజమేనా? ఈ గడ్డలను నిర్మూలించడం సాధ్యం కాదా? దయచేసి వివరంగా తెలియజేయండి. 

మీరు బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ గురించి ఈ రోజుల్లో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలతో ట్యూమర్‌ శస్త్రచికిత్స చాలా సురక్షితమే. మెదడులోని గడ్డలను సమూలంగా తొలగించవచ్చు. మెదడులో ట్యూమర్లు రెండు రకాలుగా ఉంటాయి. అవి బినైన్‌ ట్యూమర్లు, మెలిగ్నెంట్‌ ట్యూమర్లు. ఇవి కేంద్ర నాడీమండలం (సీఎన్‌ఎస్‌)లోని పలురకాల కణాల నుంచి ఏర్పడతాయి. మెదడు గడ్డల్లో బినైన్‌ ట్యూమర్లు మెదడులో లోతుగా పాతుకుపోయి ఉండవు. ఈ రకమైన ట్యూమర్లు క్యాన్సర్‌ కారకమైనవి కావు. అందువల్ల బినైన్‌ ట్యూమర్లు ఉన్న ప్రాంతంలో శస్త్రచికిత్స చేయడం సులువు. పైగా వీలైతే వీటిని తేలిగ్గా పూర్తిగా తొలగించి వేయగలగడం సాధ్యమే.

అయితే ఒక్కోసారి వీటిని సర్జరీ చేసి తీసివేసినా మళ్లీ అవి తిరిగి పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. ఈ గడ్డలు చురుకైనవి కావు. అందువల్ల మెదడులోని ఇతర భాగాలలోని కణజాలానికి విస్తరించే అవకాశం ఏమీ ఉండదు. కానీ ఈ బ్రెయిన్‌ ట్యూమర్లు శరీరంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించేవిగా, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారగలవు. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతలను నిర్వర్తిస్తూ, శరీరంలోని భిన్న అవయవాలను నియంత్రిస్తుంటాయి. అందువల్ల ట్యూమర్‌ ఏర్పడిన భాగం మెదడు తన విధులను నిర్వహించడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. అందువల్ల మెదడులో గడ్డ ఏర్పడిన ప్రదేశాన్నిబట్టి, ఆ ట్యూమర్‌ రకాన్ని బట్టి దాని ప్రభావం శరీరంలోని వివిధ భాగాలపై (అంటే అది నియంత్రించే భాగంపైన) కనిపిస్తూ ఉంటుంది.

మెదడులో గడ్డలను బట్టి కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. కొందరిలో అది వినికిడి శక్తిని ప్రభావితం చేస్తే, మరికొందరిలో కంటి చూపును దెబ్బతీయవచ్చు. ఈ విధంగా జరిగినప్పుడు మెదడులో ఒకవైపు ఏర్పడిన బినైన్‌ ట్యూమర్లను తొలగిస్తే మళ్లీ మరోవైపు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే గత దశాబ్ద కాలంలో ట్యూమర్ల చికిత్స అభివృద్ధి చెందింది. గడ్డ ఏర్పడిన మెదడు భాగానికి ఏమాత్రం నష్టం కలిగించకుండా, ఫలితంగా మెదడులోని ఆ భాగం అదుపు చేసే అవయవాల పనితీరు దెబ్బతినకుండా ట్యూమర్‌ను తొలగించివేయగల వైద్యసాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న 3 టెస్లా ఇంట్రా ఆపరేటివ్‌ మాగ్నెటిక్‌ రిసోనెన్స్‌ ఇమేజింగ్‌ (3 టీ ఎమ్మారై) మెదడులో గడ్డల తొలగింపు ఆపరేషన్‌లో గణనీయమైన మార్పు తెచ్చింది.

అప్పటి రోజుల్లో ఎక్స్‌–రే, ఆ తర్వాత అల్ట్రాసౌండ్, ఆపైన ఎమ్మారై... ఇప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ వైద్యసాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల కారణంగా శరీరం లోపలి భాగాల్లో అతి చిన్న మార్పునూ పసిగట్టి చూపగల నిర్ధారణ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటిదే తాజాగా అందుబాటులోకి వచ్చిన ఐఎమ్మారై (ఇంట్రా ఆపరేటివ్‌ ఎమ్మారై). అది మరో అడుగు ముందుకు వేసి ఆపరేషన్‌ చేస్తున్న సమయంలోనే శరీరంలోపలి అవయవాల స్పష్టమైన చిత్రాలను తీస్తుంది. దీని సహాయంతో న్యూరో వైద్య నిపుణులు మెదడులోని గడ్డలను తొలగించే విషయంలో చాలా నైపుణ్యాన్ని, కచ్చితత్వాన్ని సాధించగలిగారు.

 ఈ సాంకేతికతల కారణంగా ఇప్పుడు గడ్డలన్నింటిని దాదాపుగా కూకటివేళ్లతో సహా తొలగించడానికి వీలవుతోంది. అలాగే పార్కిన్‌సన్స్‌ డిసీజ్, వణుకుడు (ఎసెన్షియల్‌ ట్రెమర్స్‌) వ్యాధులకు సంబంధించిన సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలానికి ఏమాత్రం నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా చేయడానికి వీలవుతోంది. అందువల్ల మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా మీ డాక్టర్‌ సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకోండి. 

పార్కిన్‌సన్స్‌ వ్యాధి అంటే ఏమిటి?

మా పెద్దన్న వయసు 63 ఏళ్లు. ఇటీవల ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. చేతులు, కాళ్లు, తల తరచూ వణుకుతున్నాయి. మాట్లాడేటప్పుడు వణుకు వస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చిరునవ్వుతో సంతోషంగా ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉంటున్నాడు. తిండి కూడా సయించడం లేదు. ఏం పెట్టినా రుచీపచీ లేని తిండి పెడుతున్నారంటూ చిరాకు పడుతున్నాడు. డాక్టర్‌కు చూపిస్తే పార్కిన్‌సన్స్‌ వ్యాధిగా నిర్ధారణ చేశారు. పార్కిన్‌సన్స్‌ వ్యాధి అంటే ఏమిటి? ఇది ప్రమాదకరమా? ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి? దయచేసి వివరించండి. 

మీరు చెబుతున్న మీ అన్నగారి లక్షణాలను బట్టి అది పార్కిన్‌సన్స్‌ (వణుకుడు) వ్యాధిగానే అనిపిస్తోంది. పార్కిన్‌సన్స్‌ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డోపమైన్‌ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీకణాలు దెబ్బతినడం, క్షీణించడం కారణంగా ఇది వస్తుంది. డోపమైన్‌ మెదడులోని వివిధ భాగాలకూ... శరీరంలోని నాడీవ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి (కమ్యూనికేషన్‌)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనికి తయారుచేసే కణాలు క్షీణించడం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది. దాంతో శరీరభాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది.

సాధారణంగా అరవై ఏళ్లకు పైబడ్డవారే ఎక్కువగా పార్కిన్‌సన్స్‌ వ్యాధికి గురవుతుంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం ఇది వంశపారంపర్యంగా వస్తూ, చిన్న వయసులోని వారిలోనూ కనిపిస్తుంటుంది. మన దేశంలో దాదాపు కోటికి పైగా మంది దీనితో బాధపడుతున్నారు. సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ఆధునిక సౌకర్యాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం ద్వారా దీన్ని అదుపు చేయడానికి వీలుంటుంది. పార్కిన్‌సన్స్‌ వ్యాధి చికిత్స ఇటీవల సమూలంగా మారిపోయింది. ఈ వ్యాధిగ్రస్తులు తమను వేధిస్తున్న లక్షణాలను అదుపు చేసుకొని, సాధారణ జీవితం గడిపేందుకు ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో వైద్యపరమైన ఔషధాలు, సర్జికల్‌ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.

పార్కిన్‌సన్స్‌ వ్యాధి మధ్యస్థాయిలో ఉండి శరీరక పరిమితులు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో వ్యాధి లక్షణాలను అదుపు చేయటంతో పాటు వాడుతున్న మందుల నుంచి గరిష్ఠప్రయోజనం పొందేందుకు ఇప్పుడున్న ఆధునిక చికిత్సలు తోడ్పడుతున్నాయి. చికిత్సవ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్యపరిస్థితి, శరీరతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్స చికిత్స వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు మందులు, ఫిజియోథెరపీ, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స ఉపయోగపడతాయి. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట కనిపెట్టిన ‘ఎల్‌ డోపా’ అనే ఔషధం వణుకుడు వ్యాధికి సమర్థంగా పనిచేస్తున్నది.

శక్తిమంతమైన ఈ మందును డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మోతాదులో ఏవైనా లోటుపాట్లు జరిగితే మొత్తంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సహాయపడుతూ డోపమైన ఉత్పత్తి జరిగేట్లు చేస్తుంది. దాంతో అవయవాలు బిగుసుకుపోవడం, వణుకుడు తగ్గుతుంది. పార్కిన్‌సన్స్‌ వ్యాధి చికిత్సకు సంబంధించి మరో శక్తిమంతమైన చికిత్స డీబీఎస్‌ (డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌). ఈ శస్త్రచికిత్స వ్యాధి పెరుగుదలను నియంత్రిస్తుంది. గుండె పనితీరును మెరుగుపనిచేందుకు పేస్‌ మేరక్‌ అమర్చినట్లుగానే ఈ సర్జరీ ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్‌లను అమర్చుతారు. మెదడులోని కొన్ని కణాలను తొలగించడం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా వ్యాధి ముదరకుండా చేయగలుగుతారు. డోపమైన తయారీ పునరుద్ధరించగలగడం సాధ్యమవుతుంది.

డాక్టర్‌ ఆనంద్‌ 
బాలసుబ్రమణియం సీనియర్‌ న్యూరోసర్జన్, 
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌  

మరిన్ని వార్తలు