చలి  కొరుకుతున్నప్పుడు ఏం తినాలి

1 Dec, 2018 00:01 IST|Sakshi

చలికాలంలో ఏదో ఒకటి వేడిగా తినాలన్న యావ ఉంటుంది. పెనం మీద నుండి తీసి తింటే కడుపులో వెచ్చగా ఉండదు. నాలిక దాటాక చలి కొరుకుతూనే ఉంటుంది. మరి ఆవురావురని ఆవ తింటే...  కాలిన కడుపుకి వెచ్చని కాపు కాస్తుంది. అందుకే ఆవురావురుమంటూ  ఈ ఆవ పెట్టిన కూరలను వండండి... వేడివేడిగా తినండి...

బొప్పాయి  ఆవ పెట్టిన  కూర
కావలసినవి: బొప్పాయి తురుము – రెండు కప్పులు (బొప్పాయి కాయలను శుభ్రంగా కడిగి, సన్నగా తురుముకోవాలి); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఆవాలు – 2 టీ స్పూన్లు (తగినన్ని నీళ్లల్లో నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి); జీలకర్ర – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 4; అల్లం తురుము – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టేబుల్‌ స్పూను; చిక్కటి చింతపండు పులుసు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా.

తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఒక దాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ∙తరిగిన పచ్చి మిర్చి, అల్లం తురుము, కరివేపాకు వేసి మరోమారు బాగా కలపాలి ∙బొప్పాయి తురుము, ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ∙బొప్పాయి తురుము మెత్తపడేవరకు ఉడికించాలి ∙చింతపండు రసం, ఆవ ముద్ద వేసి కలియబెట్టి, చింతపండు రసం పచ్చి వాసనపోయే వరకు ఉడికించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి ∙అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.

అరటి దూట ఆవపెట్టిన కూర
కావలసినవి: అరటి దూట  – పెద్ద ముక్క; పల్చటి మజ్జిగ – రెండు గ్లాసులు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను ; తరిగిన పచ్చిమిర్చి – 5; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవ ముద్ద – ఒక టీ స్పూను; చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నువ్వుల నూనె – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర – కొద్దిగా

తయారీ: ∙ముందుగా అరటిదూటను శుభ్రం చేసి, సన్నగా ముక్కలుగా తరగాలి ∙ఈ ముక్కలను మజ్జిగలో వేయాలి, లేదంటే న ల్లబడిపోతాయి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చి మిర్చి, అల్లం తురుము వేసి దోరగా వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి. తరిగిన అరటిదూటను మజ్జిగలో నుంచి గట్టిగా పిండి తీసి, వేగుతున్న పోపులో వేయాలి ∙పసుపు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙అరటి దూట బాగా ఉడికిన తరవాత ఆవ ముద్ద, చింతపండు రసం వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి ∙ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది.

పనస పొట్టు ఆవపెట్టిన కూర
కావలసినవి: పనస పొట్టు – ఒక కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను (ఆవ పెట్టడం కోసం); చిక్కటి చింతపండు పులుసు – రెండు టీ స్పూన్లు
పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – నాలుగు (ముక్కలు చేయాలి); తరిగిన పచ్చి మిర్చి – నాలుగు; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – తగినన్ని; నూనె – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర – కొద్దిగా

తయారీ: ∙పనస పొట్టును నీళ్లలో శుభ్రంగా కడిగి నీరంతా పిండేసి తీసేయాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి ∙ఆవాలకు నాలుగు స్పూన్ల నీళ్లు జత చేసి, పావు గంట తరవాత మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ ఉడికించిన పనస పొట్టును కుకర్‌ నుంచి బయటకు తీయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి, నూనె వేసి కాగాక, పోపు దినుసులు వేసి వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి ∙ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙పనస పొట్టును గట్టిగా పిండి పోపులో వేసి బాగా కలపాలి ∙చింతపండు రసం, ఉప్పు, పసుపు, ముందుగా నూరి పెట్టుకున్న ఆవ పొడి వేసి బాగా కలిపి, దింపేయాలి ∙వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. కొత్తిమీరతో అలంకరించాలి.

క్యాబేజీ ఆవపెట్టిన కూర
కావలసినవి: తరిగిన క్యాబేజీ – 2 కప్పులు; పోపు దినుసులు – ఒక టేబుల్‌ స్పూను; ఆవ పొడి – ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 2; తరిగిన పచ్చి మిర్చి – 2; పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – ఒక టేబుల్‌ స్పూను

తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక టేబుల్‌ స్పూను నూనె వేసి కాగాక, ఎండు మిర్చి, పోపు దినుసులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి ∙పచ్చి మిర్చి జత చేసి వేయించాలి ∙పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి ∙క్యాబేజీ తరుగు వేసి బాగా కలపాలి ∙బాగా ఉడికిన తరవాత, ఆవ పొడి వేసి కలపాలి ∙చివరగా నిమ్మ రసం జత చేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి.

కంద–బచ్చలి  ఆవపెట్టిన కూర
కావలసినవి: కంద – పావు కేజీ; బచ్చలి కూర – 150 గ్రా.; ఉప్పు – రుచికి తగినంత; చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను. 
ఆవాల ముద్ద కోసం: ఆవాలు – 2 టీ స్పూన్లు; బియ్యం – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు –  2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2; నువ్వుల నూనె – ఒక టేబుల్‌ స్పూను

తయారీ: ∙చిన్న పాత్రలో ఆవాలు, బియ్యం, ఎండుమిర్చి, తగినన్ని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి ∙మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేసి పక్కన ఉంచాలి ∙కందను శుభ్రం చేసి, తొక్క వేరు చేసి, కందను పెద్ద పెద్ద ముక్కలుగా కట్‌ చేయాలి ∙బచ్చలికూరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙ఒక పాత్రలో కంద ముక్కలు, తరిగిన బచ్చలి ఆకు వేసి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లోఉంచి మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి ∙చల్లారాక, ఎక్కువగా ఉన్న నీళ్లను వేరు చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, పసుపు, ఎండు మిర్చి వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙ఉడికించిన కంద, బచ్చలి మిశ్రమం వేసి బాగా కలపాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలిపి చివరగా ఆవ ముద్ద, చింతపండు రసం వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి.

అరటికాయ  ఆవపెట్టిన కూర
కావలసినవి: అరటి కాయలు – 4; తరిగిన పచ్చి మిర్చి – 5; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను (తగినన్ని నీళ్లలో అరగంట సేపు నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నువ్వుల నూనె – ఒక టేబుల్‌ స్పూను

తయారీ:  ∙అరటికాయలను శుభ్రంగా కడిగి, పైన తొక్కను తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడించాలి ∙పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ∙కరివేపాకు, పచ్చి మిర్చి, అల్లం ముద్ద వేసి మరోమారు బాగా వేయించాలి ∙ఉడికించి ఉంచుకున్న అరటి కాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా మెదపాలి ∙ఆవ ముద్ద, చింతపండు రసం వేసి బాగా కలిపి, ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా