చిన్న ఊళ్లు పెద్ద కలలు

3 Apr, 2016 23:16 IST|Sakshi
చిన్న ఊళ్లు పెద్ద కలలు

ఫ్యాన్ ఉండేది గదిలో గాలాడకపోతే వేసుకోవడానికి.
జీవితంలో గాలాడకపోతే ఉరేసుకోవడానికి కాదు.

  

జంషడ్‌పూర్ అంటే ఉక్కు పట్టణం. స్టీల్. మనుషులు కూడా గట్టిగా పరిస్థితులను ఎదుర్కొనడంలో ఉక్కులా నిలబడాలి. కాని తికమకపడిపోతున్నారు. కళవళపడిపోతున్నారు. పారిపోతున్నారు. ముఖ్యంగా అక్కడి అమ్మాయిలు పెద్ద కలలు విసిరే వలల్లో చిక్కుబడి దారి వెతుక్కోలేక తప్పులు చేసేస్తున్నారు. హైదరాబాద్‌లో ‘అసంగతమైన’ పనులు చేస్తూ దొరికిపోయి చట్టబద్ధమైన దండనను ఫేస్ చేసిన శ్వేత బాసు ప్రసాద్ జంషడ్‌పూర్ అమ్మాయే. వీరభద్ర వంటి పెద్ద సినిమాలో బాలకృష్ణ వంటి హీరో పక్కన యాక్ట్ చేసి కూడా సౌత్‌లో కాని ముంబైలో కాని తగిన పాత్రలతో స్థిరపడలేక సతమతమవుతున్న తనుశ్రీ దత్తా కూడా జంషడ్‌పూర్ అమ్మాయే. తాజాగా ప్రత్యూష బెనర్జీ. ఓటమి మీద ప్రతీకారం ప్రాణాలు తీసుకోవడమే అని భావించింది.

  

ఎంకి పెళ్లి సుబ్బి కల్యాణానికి వచ్చింది.
టెలివిజన్‌లో కోట్లాది ప్రేక్షకులను కట్టిపడేసిన ‘బాలికా వధు’ సీరియల్‌లో ‘ఆనంది’ అనే చిన్నారి చిన్న వయసులోనే పెళ్లికూతురు అవుతుంది. అక్కణ్ణుంచి ఆ చిన్నారి జీవితం ఏమవుతుంది అనేది దేశ ప్రజల తక్షణ సమస్య అయ్యింది. ఆ పాత్రను పోషించిన చైల్డ్ అవికా గౌర్ పెద్ద స్టార్ అయ్యింది. అయితే ఆ పాత్ర యుక్త వయసులోకి వస్తుండగా దానిని ఎవరు పోషించాలన్న విషయం పై సీరియల్ నిర్మాతలు ఏకంగా ఒపీనియన్ పోల్‌నే నిర్వహించారు. ఆడిషన్స్ ద్వారా ముగ్గురు యువతలను ఎంపిక చేసి వీరిలో ఎవరో తేల్చుకోండి అనంటే లక్షలాది ఓట్లు ఒకే పేరును తేల్చాయి- ప్రత్యూష బెనర్జీ. ఒక తార జన్మించింది అని అంటూ ఉంటారు. కాని అంతలోనే అస్తమించింది.

  

తెల్లవారు జామున నాలుగ్గంటల సమయంలో పుట్టిందట ప్రత్యూష. అందుకని ఆ అమ్మాయికి ప్రత్యూష అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ పిచ్చి. జట్టు సరిచేసుకోవడం, గోళ్లు సరి చేసుకోవడం, ముక్కు ముఖం అందంగా చూసుకోవడం... జంషడ్‌పూర్‌లో ‘లోకల్ టాలెంట్’గా అందరి గుర్తింపు పొందింది. కాని అంతకు మించి ఎదగడానికి ఎత్తు ఒక సమసై కూచుంది. ఐదు అడుగుల ఒక అంగుళం. ఈ ఎత్తుతో ఏదైనా ఎలా సాధిస్తారు గ్లామర్ ఫీల్డ్‌లో అని అందరూ అడిగేవారు. సాధించగలను అని ముంబై చేరుకుంది ప్రత్యూష.

  

చిన్న ఊరు అమ్మాయి. లోఖండ్ వాలాలో చిన్న గది తీసుకొని దిగితే అంతా ఉక్కిరిబిక్కిరి. కొంతమంది అమ్మాయిలు స్నేహితులయ్యారు. ఇదిగో ఇలాంటి బట్టలు వేసుకోవాలి... ఇలా నంగి నంగిగా మాట్లాడాలి... కనపడ్డ ప్రతి అడ్డమైన వెధవని హగ్ చేసుకుంటూ పలకరించాలి... అన్నీ నేర్చుకుంది. కాని పాత్రను ఇచ్చింది మాత్రం కేవలం ఆమె చురుకుదనం, ప్రతిభ, ఏదైనా సరే చేసి తీరాలి అనే పట్టుదల. ఫేస్‌బుక్‌లు రావడం అందులోనే తన ప్రొఫైల్ పిక్చర్ చూసి ఆడిషన్‌కు పిలవడం చివరకు బాలికా వధుకు ఎంపిక కావడం వేగంగా జరిగిపోయాయి.

  

సీరియల్‌లో తన పాత్ర మొదలైంది. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. అందరూ పలకరించేవారే. అందరూ పలకరించాలనుకునేవారే. భారీ ఫేమ్. బాలికా వధు... అనే మాటే ఎంత పెద్ద పార్టీలోకైనా ఎంట్రీ కార్డ్. ఒక బాయ్ ఫ్రెండ్... పేరు మకరంద్ మల్హోత్రా. కొన్నాళ్లకు ఇబ్బందులు వచ్చాయి. అతడి మీద పోలీస్ కేస్ పెట్టేంత వరకూ వెళ్లి గోల అయ్యింది. ఆ తర్వాత మరో బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్. అతడు ఏదో కారు లోన్ విషయంలో ఆమెను మోసం చేశాడని వార్తా. మరోవైపు బాలికా వధులో ఎపిసోడ్ వెంట్ ఎపిసోడ్ చేసుకుంటూ మొహం మొత్తి బయటకు వచ్చాక హీరోయిన్ అవుదామని అంతకు మించి ఎదుగుదామని భావించాక అలాంటి అవకాశాలు రాలేదు. వచ్చిన ఒకటి రెండు సీరియల్స్ చానెల్స్‌లో నిలబడలేదు. లేదా ఆ పాత్రల్లో ఆమె నిలబడలేదు. ఈ లోపు పెద్ద డబ్బు ఎరచూపే ‘బిగ్‌బాస్’ షోలో ఆమె పాల్గొనడం పెద్ద ప్రతికూలత అయ్యింది. వ్యక్తిత్వానికి ఒక నమూనాగా నిలిచిన బాలికా వధు పాత్రను పోషించిన అమ్మాయి బిగ్ బాస్ షోలో అందరు మనుషుల్లానే రకరకాల బలహీనతలు ప్రదర్శిస్తూ అపరిణితంగా వ్యవహరిస్తూ ఉంటే జనం చూడలేకపోయారు. అయ్యో అనుకున్నారు. అందులో నుంచి బయటకు వచ్చాక కూడా కెరీర్ ఆశావహంగా అనిపించలేదు. అవకాశాల కోసం ప్రయత్నించడం... ప్రయత్నించడం...కాని అవకాశాల కంటే కూడా సీలింగ్‌కు ఉన్న ఫ్యానే దగ్గరగా ఉన్నట్టు అనిపించింది.

  

జంషడ్‌పూర్ దేశంలోని అన్ని చిన్న పట్టణాలలాగే ఒక చిన్న పట్టణం. అక్కడి అమ్మాయిలకు ఒక సంరక్షణాయుతమైన వాతావరణంలో పెరుగుతారు. ఏవైనా సమస్యలు వస్తే ఊరే అయినవారే నిలబడి సాయం చేస్తారు. కాని పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద కలల్లో అడుగు పెట్టాక అందుకు అవసరమైన తర్ఫీదు, చదువు, పరిణితి లేక వచ్చిన పేరును చూసి పొంగిపోయి పేరు పోతే కుంగిపోయి ఏవైనా సమస్యలు ఎదురైతే ఎలా వాటిని ఎదుర్కొనాలో తెలియక పలాయనంలోకి వెళుతున్న నేటి తరం యువతకు ప్రతినిధి ప్రత్యూష బెనర్జ్జీ అని అనిపిస్తుంది. బిహార్, జార్ఖండ్‌లు తల ఎత్తుకునేలా చేస్తాను అన్న అమ్మాయి శవాన్ని అందరూ తలెత్తి చూడాల్సి వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘త్వరలోనే మీకో సర్‌ప్రైజ్ ఇస్తాను’ అని కెరీర్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్య ఇలాంటి సర్‌ప్రైజ్ మారడం విషాదం.

 
‘కాంట్రవర్సీలు సృష్టించడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ సృష్టించదలుచుకుంటే ఈ చిన్నాచితకా బాయ్‌ఫ్రెండ్ కాంట్రవర్సీలు కాదు. పెద్ద కాంట్రవర్సీనే సృష్టిస్తాను’ అందామె. కాని ఆమె మృత్యువే ఆమె కోరిన అతి పెద్ద కాంట్రవర్సి కావడం నిజంగానే విషాదం. ఫ్యాన్ ఉన్న గది మాత్రమే లోకం కాదు. బయట చాలా ఉంది.చూడ్డానికి పెను గాలులూ సుడిగాలులూ ఎదురుగాలులూ కనిపించవచ్చు. ఆ గాలిలోనే మనం బతకడానికి అవసరమైన ప్రాణవాయువు కూడా ఉందని గ్రహిస్తే ఇవి కేవలం వచ్చి పోయే సమస్యలు.కలలు కలాలి. నిజం చేసుకోవడానికి ప్రాథమికంగా జీవించి ఉండాలి. జీవించి ఉండటమే నేటి తరానికి అతి పెద్ద కెరీర్.

 - సాక్షి ఫ్యామిలీ

 

బిహార్, జార్ఖండ్‌లు తల ఎత్తుకునేలా చేస్తాను అన్న అమ్మాయి శవాన్ని అందరూ తలెత్తి చూడాల్సి వచ్చింది.

 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు