జస్టిస్‌ ఫర్‌ ‘దిశ’ ఘటనపై ఫేస్‌బుక్‌ ఏమంటోంది?

2 Dec, 2019 03:38 IST|Sakshi

జస్టిస్‌ ఫర్‌ ‘దిశ’ ఘటన గురించి సోషల్‌ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. కొందరు కోపంగా, కొందరు ఆగ్రహంగా, కొందరు సాలోచనగా స్పందిస్తున్నారు. కొందరు తమ ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. చాలా చర్చలు కొనసాగుతున్నాయి. వాటిలో కొన్ని స్పందనలను ఇక్కడ ఇస్తున్నాం.

జాగ్రత్త అమ్ములూ (కూతురికి తల్లి లేఖ)
చూశావు కదా అమ్మలూ... తెలిసినవాడే, స్నేహితుడే అని మాట్లాడటానికి వెళ్ళింది. ఏమైందో చూడు. ఎవర్నీ నమ్మొద్దు. జాగ్రత్త. రాత్రి తొమ్మిదే కదా ఏమవ్వుద్ధి అనుకోవద్దు. మొన్న రాత్రి ఒక్కదానివే సెవెన్‌ సీటర్‌లో వచ్చావు కదా. డాడీకి ఫోన్‌ చేస్తే వచ్చి తీసుకొచ్చేవాడు, ఒక్కదానివే ఎందుకొచ్చావు అని కోప్పడితే కోపమొచ్చింది కదా. చూడు... చదువుకుని ఉద్యోగం చేసే ధైర్యం ఇచ్చిన నమ్మకంతో, తనను తాను నమ్ముకుని రోడ్డు మీదకు ఒంటరిగా రాత్రి పూట వెళ్ళింది. ఏమైందో చూడు. జాగ్రత్త. చూడు అమ్మలూ... మేము రావటానికి ఇంకో గంట పడుతుంది. ఎవరయినా కాలింగ్‌ బెల్‌ కొట్టితే కీ హోల్‌ లోంచి చూసి తలుపు తియ్యి. ఎడాపెడా తలుపు తియ్యొద్దు. జాగ్రత్త. ఆటోని నమ్మకు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ని నమ్ము. వీలైనంతవరకూ బస్సు ఎక్కు. లేట్‌ అయితే ఫోన్‌ చెయ్యి. ఎవరో ఒకళ్ళం వస్తాం. జాగ్రత్త దగ్గర దారి గదా అని చీకట్లో, సందుగొందుల్లో రాకు. దూరమైనా లైట్లున్న రోడ్లో, నలుగురు తిరిగే రోడ్లోనే రా. జాగ్రత్త. చూడు.

ఇంట్లో ఒక్కదానివి ఉండకు. డాడీ ఆఫీస్‌ నుండి తొందరగా వస్తారు. లేదు నేను లీవ్‌ పెడతాను. రైలింగ్‌ పని చేస్తున్నారు, ఎక్కడెక్కడ్నుంచొచ్చారో. అందరూ తెలియనోళ్లే. మన జాగ్రత్తలో మనముండాలి కదా! చూడు... ట్యూషన్‌ నుండి దగ్గరే కదా అని నడుచుకుంటూ రాకు. డాడీనో, నేనో వచ్చి తీసుకొస్తాం. గేటు దగ్గర్నుంచి ఒకోసారి లైట్లు లేక చీకటిగా వుంటుంది. ఎవరయినా వెంటపడితే? జాగ్రత్త. స్కూల్‌ అయిపోయాక కూర్చుని కంబైన్డ్‌ స్టడీస్‌ చేస్తున్నారా.. స్కూల్‌ లో ఇంకా ఎవరయినా వుంటున్నారా.. వాచమేన్‌ ఒక్కడే వుంటున్నాడా... జాగ్రత్త. ఫోన్‌ తీసుకెళ్లు. ఏదైనా అవసరమయితే వెంటనే ఫోన్‌ చెయ్యి. తెలియని ఊరులో ఒక్కదానివే టాయిలెట్‌ దాకా వెళ్ళటం క్షేమం కాదు.

వొక్కదానివే వెళ్లొద్దు. చూడు అక్కడ తుప్పలు బాగా వున్నాయి. ఎవరో తిరుగుతున్నారు. జాగ్రత్తగా వుండాలి. నేనూ వస్తున్నాను పద. చూడు. చిన్నప్పుడు వేరు. ఇప్పుడు వేరు. వాళ్ళందరూ తెలిసినవాళ్లే. ఏమో ఎవరి బుద్ధి ఎలాంటిదో. పక్కన కూర్చోవడం, చనువుగా ముట్టుకోవటం చేయ్యొద్దు. మన జాగ్రత్తలో మనముండాలి. క్యాబ్‌ బుక్‌ చెయ్యొచ్చు కదా, పగలే కదా అంతదూరం వెళ్తానని అంటావా. వద్దు. వాళ్ళింటికా, నైట్‌ స్టే చేస్తావా, వొద్దు. ఒద్దొద్దు. జాగ్రత్తగా వుండాలి. ఇంట్లో చదువుకో, చాల్లే, వచ్చినన్ని మార్కులు వస్తాయి. ఎన్ని జాగ్రత్తలు చెప్పీ, తీసుకుని పెంచుతున్నామురా. అయినా కానీ మింగుతున్నారు కదరా. మా రెక్కలు ఎంత బలహీనమయినవో పదే పదే నిరూపిస్తున్నారు కదరా.

– బోడపాటి పద్మావతి

వ్యవస్థను పని చేయనివ్వాలి
‘దిశ’ ఘాతుకం నుంచి నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే మనకు వ్యవస్థను సరిగా ఉపయోగించుకోవడం రాదని. ఒక సౌకర్యం గురించి విస్తృతంగా అవగాహన లేదని. అమెరికాలో ఏ కష్టం వచ్చినా, పిల్లి చెట్టెక్కినా, దొంగలు పడ్డా, హార్ట్‌ ఎటాక్‌ వచ్చినా వెంటనే 911కి ఫోన్‌ చేస్తారు. ఇది చిన్న పిల్లలకి కూడా తెలిసిన విషయం. సరే అమెరికా కనుక వెంటనే స్పందించి పోలీసులు మూడు నిమిషాల్లో గుమ్మం దగ్గర ఉంటారు. మన దగ్గర అలా కాకపోవచ్చు. కానీ అసలు పని చేయవు వ్యవస్థలు అని తిట్టిపోయడం పరిష్కారమా అని కూడా ఆలోచించాలి.100, 112 మొదలైన నెంబర్లు సరిగా పనిచేయకపోతే వాటిని పని చేయించాలి.

మనకి తెలీకుండా వాటిని వాడుకోకుండా అసలు ఏవీ పని చేయమని కొట్టిపారేయడం కూడా కరెక్ట్‌ కాదు. మనం ఉండాల్సింది ఈ సమాజంలోనే. మనని చూడాల్సింది ఈ పోలీసులే. వాళ్ళకి జీతాలిచ్చి పెట్టింది అందుకే. జనాలు ఆపద వచ్చినప్పుడు కాల్‌ చేస్తున్నారు అంటే పోలీసులు కూడా అప్రమత్తం అవుతారు. అధికారులు కూడా system streamline చేస్తారు. టెక్నాలజీ విషయంలో ప్రపంచానికే పుట్టిల్లయిన మన దేశంలో అందులోనూ హైదరాబాదులో మనం టెక్నాలజీని వాడుకుని వ్యవస్థలు పని చేసేలా చెయ్యకపోతే ఎలాగ? హండ్రెడ్‌ నెంబర్‌ దేనికి పని చేస్తుంది.

చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ ఏమిటి, షీటీమ్స్‌ని ఏ సందర్భంలో పిలవచ్చు, భరోసా సెంటర్‌ ఎందుకు ఉంది అన్నీ ముందు ఆకళింపు చేసుకోవాలి.ఏదన్నా చిన్న సంఘటన జరిగినా దాన్ని పోలీసుల దష్టికి తీసుకురావాలి. ఏ గొడవా మనకు సంబంధం లేదులే అని దులుపుకొని పోయే అలవాటు మానుకోవాలి. మనకి అత్యంత సమీపమైన పోలీస్‌ స్టేషన్‌ ఏదీ అనేది తెలుసుకొని నెంబర్లు రాసి పెట్టుకోవాలి. ఒక కమ్యూనిటీగా వెళ్లి లోకల్‌ పోలీస్‌ స్టేషన్లో పరిచయం చేసుకుని మన నెంబర్లు కూడా వాళ్ళకి ఇచ్చి ఏ గొడవ వచ్చినా మేము కూడా స్పందిస్తామని చెప్పి రావాలి వాళ్ల contact తీసుకోవాలి.

– ఉషా తురగా

సమాజానికి ఇవ్వడం తెలుసుకో
సమాజమంటే నీ ఇష్టానుసారం వాడుకుని వదిలేసే ఒక ఉచిత వనరు అనే కద నీ అవగాహన. అయితే నీవు వాడుకుని వదిలేసే సమాజం నీ సమస్యగా మారుతుందనీ, నీవు పట్టించుకోని సమాజమే నీకు
ప్రమాదాలు తెచ్చిపెడుతుందనీ నీకెవరూ చెప్పలేదు కద. అంతా నా తెలివే, అంతా నా చాకచక్యమే, అంతా నా లౌక్యమే అని విర్రవీగే నీకు... నీ భద్రతా, నీ శాంతి, నీ సుఖాలూ సమాజం వేసిన భిక్ష అనీ, ఏ సుఖాలూ నోచని జనాల చాకిరీ వల్లే  నీకీ భద్ర జీవితమనీ నీవు తెలుసుకోవలసిన రోజొచ్చింది.

నీ పిల్లలతో పాటూ అందరు పిల్లలూ సంతోషంగా, ప్రేమగా ఎదిగినప్పుడే అందరూ బాగుంటారని నీవు గ్రహించాల్సిన రోజొచ్చింది. నీ ఇంట్లో చెత్త వీధిలో పారేస్తే చాలదు. నీ వీధిలోని చెత్త కూడా నీవు ఎత్తేయాల్సి వుంటది. నీ ఒక్కడివి సంతోషంగా, గౌరవంగా ఉంటే చాలదు. అందరికీ ఆ సంతోషం, గౌరవం ఎలా దక్కుతాయో  నీవు ఆలోచించాల్సి ఉంటుంది. నీ అంతులేని స్వార్థం, నీ నిర్దయలే నీ పాలిటి శత్రువులై నిన్ను చుట్టుముడతాయని నీవు తెలుసుకోక తప్పని రోజొచ్చింది.

– గడియారం భార్గవ

లైంగిక అవసరాల పట్ల మౌనం ఎందుకు?
మూల కారణాలన్నీ చర్చించాలి. పరిష్కారాలు అన్వేషించాలి, తోచిన మార్గంలో పని చేయడానికి ముందుకు రావాలి. నేరస్తులకు శిక్ష పడాలి– వీటన్నిటి చివరా ఏ ట్రోలింగ్‌కీ జడవకుండా మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది. స్త్రీ పురుషుల తొలి యవ్వనోద్రేకపు, సాధారణ – (ఆరోగ్యకరమైన) లైంగిక అవసరాల పట్ల మనందరి మౌనం ఏది ఉందో అది కూడా ఒక నేరకారణం. అత్యాచారాలు తక్కువ ఉన్న దేశాల్లో లైంగిక సంబంధాలు ఎట్లా ఉన్నాయన్నది విశ్లేషణ చేయడం ఏవన్నా ఉపయోగపడొచ్చు.

– కె.ఎన్‌.మల్లీశ్వరి

ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది
అన్నిటికీ ప్రభుత్వాలని అంటే ఎలా ఇంటినుంచి మార్పు రావాలి అని సన్నాయి నొక్కులు నొక్కకండి. ప్రభుత్వాలు చెయ్యాల్సింది చాలా ఉంది. జెండర్‌ ఎడ్యుకేషన్‌ తేవాలి స్కూలు స్థాయి నుంచి. ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగికి జెండర్‌ ట్రైనింగ్‌ ఇవ్వాలి. అటు పేదరికం వల్ల పట్టించుకునే కుటుంబం లేక, ఇటు బతకటానికి అవసరమయ్యే ఏ స్కిల్‌ రాక, నేర్పే వాళ్ళూ లేక ఆ ఫ్రస్టేషన్‌ నుంచి మీరు ఫ్రీగా అందిస్తున్న పోర్న్‌ చూసి పెర్వర్ట్‌లుగా మారుతున్న టీన్స్‌ని ట్ఛ్చఛిజి ౌu్ట కావాలి. చెయ్యదలుచుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి మార్పులు ఉద్యమాల వల్ల, దాని వల్ల ఏర్పడే పొలిటికల్‌ విల్‌ వల్ల మాత్రమే జరుగుతాయి. మనకు ఉద్యమాలు గిట్టవు. పొలిటికల్‌ విల్‌ లేదు.

– సి.వనజ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిజమైన హీరోలు కావాలి

తొలి గెలుపు

అద్దె మాఫీ

నాట్యప్రియ

బహుమతులు

సినిమా

సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!

కాజోల్‌, నైసా బాగున్నారు: అజయ్‌ దేవ్‌గణ్‌

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

కరోనా విరాళం

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం