తెలివైన వారు ఎవరంటే..?

16 Apr, 2015 23:27 IST|Sakshi
తెలివైన వారు ఎవరంటే..?

జీవన వికాసం
 
శ్రీశ్రీ రవిశంకర్
 
వ్యవస్థాపకులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్

 
ప్ర: సమాజంలో ఇన్ని దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి. వీటిని నివారించలేమా?

శ్రీశ్రీ రవిశంకర్: సమాజంలో ఇన్ని దుఃఖాలు ఎందుకు ఉన్నాయి? ఆనందంగా లేకపోవటం వలన. ఆనందంగా ఉన్న మనిషి పనిగట్టుకుని ఎవరినీ కదిలించటం, గొడవలు పెట్టుకోవటం చేయడు. ఆనందంగా ఉన్న వ్యక్తి కేవలం ఆనందాన్నే పంచుతాడు.  ఆనందంగా లేనివారే ఈ సమాజంలో మరింత దుఃఖాన్ని సృష్టిస్తున్నారు. మనం సమాజానికి ఆనందాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా ఆనందం ఉండలేదు. అయితే మన ఆలోచనా విధానంలో, మన దృక్పథంలో, మన సమాజంలో మార్పు తేవటం అవసరం. ఆధ్యాత్మికత ఆ మార్పుకు ఆధారం కాగలదు. నేరస్తుల దృక్పథం సైతం మార్చబడుతుంది. ఎందుకంటే ప్రతీ మనిషి అంతరంగంలోనూ సౌందర్యం, ఆనందం ఉంటుంది. మనం దానిని తట్టిలేపితే చాలు, వారిలోపల ఉన్న శక్తిసంపద పైకి ఉబికివస్తుంది. అప్పుడిక అన్ని చెడ్డ భావనలను వారు మరచిపోతారు. వాటిని వదిలేస్తారు అంతే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, అపి చేత్సుదురాచారో భజతే మాం అనన్యభాక్. సాధరేవ స మన్తవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః. ఎంతటి దురాచారాలకు లోబడినవారైనా సరే జ్ఞానంలోకి వచ్చినపుడు, ధ్యానం చేయటానికి సంకల్పించినపుడు, ఆధ్యాత్మికపథంలోకి అడుగిడినపుడు వారిని మనం క్షమించాలి, వారి తప్పులను క్షమించాలి. ఎందుకంటే వారు సరియైన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారు. సంస్కృతంలో ఒక సూక్తి ఉన్నది, కావ్య శాస్త్ర విచారేషు కాలో గచ్ఛతి ధీమతః తెలివైనవారు వారి సమయాన్ని జ్ఞానచర్చలలో, సంగీతం, సాహిత్యం, విజ్ఞానం తెలుసుకోవటంలో, ప్రజలను సమైక్యపరచటంలో గడుపుతారని అర్థం. మూర్ఖులు దీనికి విరుద్ధంగా తమ సమయాన్ని ఎల్లప్పుడూ వ్యసనాలలో, తగాదాలలో, కొట్లాటలలో గడుపుతారు.  ఇక్కడ మనలో అనేకమంది తెలివైనవారు ఉన్నారు. తెలివైనవారే ఆధ్యాత్మికం వైపు వస్తారు. ఎవరు తెలివైనవారు? ఎవరిలోనైతే కొంచెం ఆధ్యాత్మికత ఉన్నదో వారే. ఆ కొంచెమూ లేనట్లయితే వారు కళ్ళకు గంతలు కట్టిన గుఱ్ఱ ం వంటివారు. విశాల దృష్టి ఉండదు. వారి జీవితాన్ని వారు చూసుకోలేరు. వారు నిజంగా ఎవరో వారికి తెలియదు. మనకు ఈ జ్ఞానం, సమాజాన్ని మార్చే తెలివి ఉన్నది. ఏదేనా అన్యాయం జరుగుతుండగా మీరు చూశారనుకోండి, ఏం జరుగుతుంది? కోపం వస్తుంది.

మీరు కోపంగా ఉన్నపుడు మీరు చేయాలనుకున్నదాన్ని చేయలేరు. ఎందుకంటే మీశక్తిలో చాలాభాగాన్ని కోపం హరించివేస్తుంది. అయితే మీ కోపపు దిశను సృజనాత్మకతవైపు మళ్ళించినపుడు ఎటువంటి పరిస్థితినైనా మీరు మార్చగలరు. మీలో ఆ జ్ఞానం, ఆ శక్తి సంపూర్ణంగా ఉన్నాయి. మీరు ధ్యానం ద్వారా సంపాదించి అంతశ్శక్తి, ఆధ్యాత్మికత పనికివచ్చేది అప్పుడే. శ్రీకృష్ణుని కిరీటంగా నెమలిపింఛం ఎందుకు ఉంటుందో తెలుసా? సాధారణంగా రాజులకు ఉండే కిరీటం చాలా బరువుగా ఉంటుంది. వారి బాధ్యతను అది సూచిస్తూ ఉంటుంది. కిరీటం ధరించినవారు ఏమంత ఆనందంగా ఉండలేరు. అయితే కిరీటంలో నెమలిపింఛం ఉన్నపుడు అది, ఆ కిరీటం తేలికగా ఉన్నదని సూచిస్తూ ఉంటుంది. దాని అర్థం నీవు బాధ్యతను తీసుకోవాలి, అదే సమయంలో నెమలి పింఛంలా తేలికగా, దానిలోని రంగులలా ఉత్సాహభరితంగా ఉండాలి. నీపై ఉంచిన బాధ్యతను ఒక బరువుగా భావించి కుంగిపోవటం లేదు. నీవు జ్ఞానాన్ని కలిగిఉన్నపుడు నీ కిరీటం నెమలి పింఛమంత తేలికగా ఉంటుంది. www.artofliving.org
 
 

మరిన్ని వార్తలు