ఊహిస్తే చాలు...  ఆలోచనలు మారతాయి!

11 Jul, 2018 01:07 IST|Sakshi

‘‘నువ్వు తలచుకోవాలేగానీ.. ఏదైనా సాధ్యమే’’ అని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతూంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి గానీ.. ఎంత మనం అనుకున్నా ఐన్‌స్టీన్‌లా మారిపోగలమా అనే అనుమానం మనకూ వస్తుంది. ఇందులో కొంత నిజం లేకపోలేదని అంటున్నారు బార్సిలోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఫ్రాంటియర్స్‌ ఇన్‌ సైకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం... ఐన్‌స్టీన్‌లా అనుకునేవారి ఆలోచనలు క్రమేపీ మెరుగైన దిశగా మార్పు చెందుతాయి.

వర్చువల్‌ రియాలిటీ ఆధారంగా తాము కొందరిపై ఒక పరిశోధన నిర్వహించామని, ఇందులో ఐన్‌స్టీన్‌ మాదిరి శరీరం ఉన్నట్టు ఊహించుకోవలసిందిగా సూచించినవారు కొంత సమయానికి ఆత్మవిశ్వాస పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మెల్‌ స్లేటర్‌ అంటున్నారు.  వర్చువల్‌ రియాలిటీ ప్రయోగాల్లో ఇతరుల శరీరం, కదలికలను ఊహించుకోవడం వల్ల తమ అసలు శరీరం, ఆలోచనలను ప్రభావితం చేస్తుందని గతంలోనే కొన్ని ప్రయోగాలు నిరూపించాయని ఆయన అన్నారు. తెల్ల రంగు వారు నల్లటి రంగు శరీరాలను ఊహించుకుని వర్చువల్‌ రియాలిటీలో చూసుకున్న తరువాత వారికి అప్పటివరకు నల్ల రంగు వారిపై ఉన్న భేదభావం తగ్గిందని చెప్పారు. ఇదే తరహాలో ఐన్‌స్టీన్‌లా ఊహించుకున్నప్పుడు వారి ఆలోచనల్లోనూ మార్పులు వచ్చినట్లు తమ తాజా అధ్యయనం చెబుతోందని వివరించారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు