ఎయిడ్స్‌ నుంచి మూడో వ్యక్తికీ విముక్తి?

11 Mar, 2019 00:29 IST|Sakshi

ప్రాణాంతక ఎయిడ్స్‌ వ్యాధి నుంచి ఇంకో వ్యక్తి విముక్తి పొందాడా? అవును అంటున్నారు నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు. డిస్సెలెడ్రోఫ్‌ రోగి అనిపిలుస్తున్న ఈ వ్యక్తి మూడు నెలలకు యాంటీ రెట్రోవైరల్‌ మందులకు దూరంగా ఉన్నప్పటికీ శరీరంలో వైరస్‌ ఛాయలు కనిపించలేదని కాన్ఫరెన్స్‌ ఆన్‌ రెట్రోవైరెసెస్‌ అండ్‌ ఆపర్చూనిస్టిక్‌ ఇన్ఫెక్షన్‌ సదస్సులో శాస్త్రవేత్తలు ప్రకటించారు. 1980 ప్రాంతంలో ప్రపంచానికి తెలిసిన హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాధి కొన్ని కోట్ల మంది ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే.

ఈ వైరస్‌కు సహజ సిద్ధమైన నిరోధకత కలిగిన వ్యక్తి ఎముక మజ్జను అందివ్వడం ద్వారా 2007 ప్రాంతంలో తిమోతీ బ్రౌన్‌ అనే వ్యక్తి వ్యాధి నుంచి బయటపడ్డాడు. పన్నెండేళ్ల తరువాత ఇదే చికిత్సా పద్ధతి ద్వారా రెండో వ్యక్తికి కూడా వ్యాధి నుంచి ఉపశమనం లభించింది. తాజాగా డిస్సెలెడ్రోఫ్‌ రోగికి కూడా ఇదే పద్ధతి ద్వారా నయమైందని అన్నేమేరీ వెన్‌సింగ్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు. అంతేకాదు.. ఇంకా కొంతమంది రోగులకు ఎముక మజ్జ మార్పిడి జరిగిందని.. వీరి శరీరంలోని వైరస్‌ ఆనవాళ్ల కోసం పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వివరించారు.  

మరిన్ని వార్తలు