వద్దు బాస్...వదిలేద్దాం!

15 Nov, 2015 16:30 IST|Sakshi
వద్దు బాస్...వదిలేద్దాం!

సోల్ / అసహనం
ఇదో భౌతిక ఉద్వేగం! ఉద్వేగం మానసికమైనది కదా! మరి ఈ ‘భౌతిక ఉద్వేగం’ ఏమిటి? ఇన్‌టాలరెన్స్ అన్నమాట. అంటే అసహనం. అసహనంలో మైండ్ కన్నా ముందు,  భౌతికమైన పరిణామాలేవో పనిచేస్తాయి. అందుకే అసహనాన్ని ‘భౌతిక ఉద్వేగం’ అనడం! సామాన్యుల దగ్గర్నుంచి అసామాన్యుల దాకా ఏదో ఒక రకంగా.. ఎప్పుడో అప్పుడు.. లేదంటే అప్పుడప్పుడు ఇంకా కాదంటే ఎప్పుడూ వాళ్ల వాళ్ల మానసిక స్థితిగతులననుసరించి ఈ ఉద్వేగానికి గురికాక తప్పరు.

ఆ మాటకొస్తే దేశాలు, సమాజాలూ అసహనాన్ని మోసాయి.. మోస్తున్నాయి! పర్యవసానాలూ అనుభవించాయి... అనుభవిస్తున్నాయి.. ఏ కాలానికి ఆ కాలం కొత్తే కాబట్టి పాత పాఠాలనే కొత్తగా నేర్చుకోవడానికి నేటికీ సిద్ధంగా ఉన్నాయి.
 
అడిగింది అందకపోతే చిన్నపిల్లలకు అసహనం... ఆశించింది దొరక్కపోతే యువతలో అసహనం!
 ఇంట్లో తన మాట సాగకపోతే భర్తకు అసహనం.. ఆదరణ కరువైతే భార్యలో అసహనం!
 అహం ఓడిపోయే అసహనం పురుషుడైతే... అస్తిత్వం కోల్పోయిన అసహనం స్త్రీది!
 ఇక కులజాఢ్యం, మతమౌఢ్యం, వర్ణవివక్ష, అధికార దాహం, ఆక్రమణకాంక్ష, అగౌరవం.. మొత్తం మానవజాతి అసహనానికి కారణాలు!
 కరువు, వరదలు, భూకంపాలు, సునామీలు, గ్లోబల్‌వార్మింగ్ వంటివన్నీ ప్రకృతి అసహనానికి నిదర్శనాలు!
 ఏదైనా, ఎవరైనా తను మెచ్చినట్లు, తనకు నచ్చినట్లు ఉండకపోవడం అనే దగ్గర్నుంచే అసహనం మొదలవుతుంది. ఈ భావన మనిషి నుంచి సమాజానికి విస్తరిస్తే ఫలితమూ అంతే పరిధిలో ఉంటుంది. పుక్కిటనున్న పురాణాలను కదిపినా... చరిత్రగా మిగిలిన గతాన్ని కదిలించినా ఉదాహరణ హెచ్చరికలు కోకొల్లలు!
 
రామాయణ, భారతాలూ...
పురాణాల్లో సహనం ప్రస్తావన ఉన్నా కనిపించేది మాత్రం ఎక్కువగా అసహనమే! రామాయణంలోని రావణాసురుడి పాత్ర అసహనానికి అసలైన ఉదాహరణ. సీతాస్వయంవరంలో శివుడి విల్లు విరవలేని ఓటమి దగ్గర మొదలైన రావణుడి అసహనం.. తన చెల్లెలు శూర్పణఖ ముక్కుచెవులను లక్ష్మణుడు ఖండించడంతో పీక్‌కి చేరుతుంది. రాముడితో యుద్ధానికి నగారా మోగిస్తుంది. రావణుడి అసహనం అతడిని పరాజితుడిని చేస్తే.. రావణుడు అంటే అతడి తమ్ముడు విభీషణుడికి ఉన్న అసహనం,

వాలిసుగ్రీవులిద్దరికీ ఒకరంటే ఒకరికి ఉన్న అసహనం ఈ యుద్ధంలో రాముడిని విజేతగా నిలబెట్టాయి! లంకలో బందీగా ఉన్న ‘సహనశీలి’ సీత హనుమంతుడితో వెళ్లడానికి నిరాకరించడం కూడా ఒకరకంగా రాముడి మీద అమెకున్న అసహనంగా అనుకోవచ్చేమో! ఆయనే వచ్చి తీసుకెళ్లాలని ఆమె ఆశ. ఆ ఆశ నెరవేరడంలో జరిగే జాప్యం వల్ల వచ్చిన అసహనం అది. మహాభారతానికి వస్తే అది అన్యాపదేశంగా బోధించింది అసహనాన్నే. అందులోని వృద్ధ పాత్రల నుంచి కుర్ర పాత్రల దాకా అందరిదీ అసహనమే. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా అసహనం గురించిన లెసనే!
 
గతం...
అంతా అసహనాల పుట్టే! చరిత్రలో నమోదైన ఏ యుద్ధానికి అయినా నాంది అసహనమే. అతిపెద్ద సామ్రాజ్యాలుగా పేరొందిన రోమ్ నుంచి మొగల్‌దాకా అన్ని రాజ్యాలు, రాజవంశాలు అసహనానికి బానిసలుగానే బతికాయి. అసహనం ఆసరాతోనే క్రుసేడులనే యుద్ధాలూ వీరంగం చేశాయి. ఆధునిక ప్రపంచ యుద్ధాలకూ ఆజ్యంపోసింది అసహనమే. మొదటి ప్రపంచయుద్ధానికి సామ్రాజ్య విస్తరణ కాంక్ష విత్తు నాటితే రెండో ప్రపంచ యుద్ధానికి జాత్యహంకారమనే అసహనం బీజమైంది. తత్ఫలితమే హిట్లర్ పేరుపక్కన నియంత అనే సఫిక్స్ చేరింది.
 
ప్రాంతాల మధ్యే కాదు...
అసహనం మనిషి నుంచి సమూహానికి పాకి ప్రాంతాలుగా విడగొట్టిన దుదృష్టకర సంఘటనలూ ఉన్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇండియా, పాకిస్తానే! కులం, మతం, చివరకు చర్మం రంగును సాకుగా చేసుకొని మనుషుల మధ్య సంబంధాలను చెడగొట్టి వివక్ష అనే పదాన్ని సృష్టించిన ఘనతా అసహనానిదే. అంటరానితనాన్ని ఉనికిలోకి తెచ్చిన కీర్తీ దానిదే. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కూల్చిన అపకీర్తీ దానికే! ఆఫ్టనిస్తాన్‌ను మట్టిదిబ్బగా మిగిల్చిన దోషమూ అసహనానిదే. ఇజ్రాయేల్, పాలెస్తీనాల మధ్య సాగుతున్న మారణహోమం తాలూకు పాపభారాన్ని మోస్తున్నదీ అసహనమే.
 
ఆగని ఆగడం...
‘అసహనం’ మిగిల్చిన భయోత్పాతాలు భూతంలా వర్తమానాన్ని వెంటాడుతున్నా... దాన్ని జయించే సాహసం చేయట్లేదు ప్రపంచం. పైగా కొత్తగా సాధించుకున్న సాంకేతికత దానికి శక్తినిచ్చే పోషకంగా మారింది. చాలా సౌకర్యంగా మనకు తెలియకుండానే మన సహనాన్ని రీప్లేస్ చేస్తోంది. అందుకే అప్పుడు భూమి కోసం దానిమీదున్న మనుషులతో యుద్ధం చేస్తే ఇప్పుడు భూమిలో ఉన్న వనరుల కోసం మనుషులకు మనుగడ లేకుండా చేస్తోంది అసహనం. భరిస్తున్న ప్రకృతిని కూడా గిల్లుతోంది. ప్రకోపంతో కంపిస్తున్న ప్రకృతి పట్ల డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో నిర్లక్ష్యంగానే ఉంటోంది తప్ప సహనంతో చెలిమితో దాన్ని మేనేజ్ చేసుకోవాలనే ఇంగితాన్ని మాత్రం గ్రహించట్లేదు.
 
నాగరికత అంటే మనం నేనుగా మారడం కాదు.. నేను మనం అవడం!
సహనం నేనును మనంగా చూపిస్తుంది. అసహనం మనల్ని నేనుగా మారుస్తుంది!
 నేను మనంగా ఆలోచించడమే మతం... అంటే ఇప్పటికీ మనం అసహనానికి వెట్టిచేస్తూ అనాగరికులుగానే ఉన్నామన్నమాట! మన దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలే దీనికి అద్దం పడుతున్నాయేమో!
 - సరస్వతి రమ
 
ఆటమ్... అసహనమ్!
రెండో ప్రపంచ యుద్ధంలో అటం బాంబ్‌ను ఉపయోగించడంలో యూదులు కీలకపాత్ర వహించారట. జర్మనీలోని నాజీల అసహనానికి గురైన యూదులు ఆ యుద్ధంలో నాజీల మీదే ఆటమ్‌బాంబ్‌ను ప్రయోగించాలని పథకం పన్నారు. కానీ వాళ్లు సరెండర్ కావడంతో ఆ బాంబ్ జపాన్‌మీద ప్రయోగించారట.
 
ప్రపంచంలో ఎక్కువ అసహనాన్ని అనుభవించింది యూదులు అని చరిత్ర చెబుతోంది.
  మూడొంతుల ప్రపంచాన్ని ఆక్రమించిన రోమన్ సామ్రాజ్యం, దాని చక్రవర్తులు మొదట్లో పరమత సహనశీలురుగానే ఉన్నారట. పౌరులు చక్రవర్తికి విధేయులుగా ఉండాలనే పట్టింపు తప్ప వారి మతవిశ్వాసాల జోలికి వెళ్లలేదట. కానీ తర్వాత కాలంలోనే అధికార దురహంకారంతో పరమత అసహనానికి లోనయ్యారట.

>
మరిన్ని వార్తలు