ఇంద్రజాలం

12 Jun, 2016 22:56 IST|Sakshi
ఇంద్రజాలం

లైఫ్ ఈజ్ ఫన్.. బెటర్.. అండ్ గుడ్!
ఇదీ ఇంద్రానూయి ఫిలాసఫీ ఫర్ పెిప్సీకో.
ఎంత పెద్ద ఆలోచన అయినా... ఎంత పెద్ద బ్రాండ్ అయినా
ఎంత పెద్ద మార్కెట్ వ్యూహం అయినా పెప్సీకో చేరాల్సింది... నాలుకకే!
ఫిలాసఫీ రుచించింది. నూయికి సక్సెస్ దక్కింది.
షి ఈజ్ ఎ మెజీషియన్.
ఆహారపానీయాల ఆహార్యాన్ని మార్చిన వ్యూహకర్త.
ఆమె ఇంద్రజాలానికి అందరూ ముగ్ధులే.
టేస్ట్ ది సక్సెస్!

 

ఫోర్బ్స్‌నీ, పెప్సీనీ, ఫార్చూన్‌నీ, టైమ్‌నీ.. కాసేపు పక్కన పెట్టేయండి. ఇంద్రా నూయిని ఈ దిగ్గజాలన్నీ ‘ఆహా.. ఓహో..’ అనడం ఎన్నాళ్ల నుంచో వింటున్నాం! ఆమె జీతం కూడా బాగా పాతబడిపోయిన పే స్లిప్. ఎలాగూ కోట్లలో ఉంటుంది. కొత్తగా క్లాప్స్ కొట్టేందుకేమీ లేదు. ఇక ‘ఫారిన్ కంపెనీని నడుపుతున్న శారీ అమ్మాయ్’ అనే మాట కాస్త బెటర్. ఎన్నాళ్లకైనా వినసొంపుగానే ఉంటుంది. మరి ఏం మిగిలి ఉంది.. కొత్తగా ఇవాళ ఆమె బయోగ్రఫీలోకి వెళ్లేందుకు? ఉంది. ఆమెకంటూ ఒక ‘వ్యూ’ ఉంది. అది.. ఈ ప్రపంచానికి మహిళాశక్తిని సాక్షాత్కరింపజేసిన చూపు.

 

ఒక సాధారణ మహిళకు ఇంద్రా నూయి ఇచ్చే స్ఫూర్తి.. ఆమె సాధించిన ‘మోస్ట్ పవర్‌ఫుల్’, ‘మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్’ లిస్టుల నుంచి వచ్చింది కాదు. ఆమెకై ఆమెలో ఓ పవర్ ఉంది. ఉమన్ పవర్! సో స్వీట్ కదా!

 
ఇదిగో... వర్క్‌ప్లేస్‌లో ఆడవాళ్లను ఇలాంటి మాటలంటేనే.. విసుగ్గా చూస్తారు నూయీ. ‘స్వీటీ’, ‘హనీ’.. అనే మాటలు నూయికి వికారం తెప్పిస్తాయి. ఎగ్జిక్యూటివ్‌ని ఎగ్జిక్యూటివ్‌గా చూడకుండా ‘క్యూటీ’గా చూడడం నూయికి నచ్చదు. కానీ.. ఆమె తన కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటికీ ఈ ముద్దు మురిపాలను ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నారు. సమాన వేతనం మాత్రమే కాదు. సమానమనే భావన కూడా ఉండాలన్నది నూయీ ‘పాయింట్ ఆఫ్ వ్యూ’.

 

సహాయం.. సమానత్వం
పనికి వెళ్లి వచ్చే మగవాళ్లకు, ఆడవాళ్లకు తేడా ఉంటుంది. మగవాళ్లు వాళ్లెంత చిన్న పొజిషన్‌లో ఉన్నా.. ఇంటికి వెళ్లాక రిలాక్స్ అవడానికి ఉంటుంది. ఆడవాళ్లు వాళ్లెంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా.. ఇంటికి వెళ్లాక అక్కడ మళ్లీ ‘ఫ్రెష్’గా పని ఎదురు చూస్తుంటుంది. నూయీనే చూడండి. ఈ పెప్సీ కంపెనీ సి.ఇ.వో. ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వెళ్లగానే తల్లిగా, భార్యగా, కోడలిగా, ఇంకా అప్పటికప్పుడు ఊహించని కొన్ని అతిథి పాత్రలను పోషించవలసి వస్తుంది. ఇంతకీ నూయి అనడం ఏమంటే... ఇంటినీ, ఆఫీస్‌ను చక్కబెట్టుకోడానికి అనువైన సదుపాయాలతో పాటు మహిళా ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం అందేవిధంగా ప్రతి కంపెనీ కొన్ని నియమాలు ఏర్పరచాలని. అంతే తప్ప, ఏవో కొన్ని సౌకర్యాలు కల్పించి, సంబోధనలతో గారాం చేస్తూ, జెండర్ ఈక్వాలిటీ తెచ్చేశామోచ్ అంటే నూయీ ఊరుకోరు.

 

తన విజయం వెనుక తనే!
పురుషుడి ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. రైట్. స్త్రీ ప్రతి విజయం వెనుక? ఆమె స్వయం కృషి ఉంటుంది. లేదంటే ఆమె తల్లి పడ్డ కష్టం ఉంటుంది. చిన్నప్పుడు నూయీ వాళ్ల అమ్మగారు పిల్లలు ముగ్గుర్నీ కూర్చోబెట్టుకుని వాళ్లకొక పరీక్ష పెడుతుండేవారు. ఒక్కొక్కరు లేచి నిలబడి ఏదైనా విషయం మీద మాట్లాడాలి. చక్కగా, అర్థవంతంగా మాట్లాడిన వాళ్లు విజేత. వాళ్లకొక చాక్లెట్. ఆ అనుభవం, ఆ వాక్పటిమ, ఆ క్లారిటీ జీవితంలోని ప్రతి దశలోనూ ఆమెకు ఉపయోగపడింది. ఏ రోజు ఎక్కడ ఉన్నా ఇప్పటికీ నూయి రోజుకు రెండు మూడుసార్లైనా తన తల్లికి ఫోన్‌చేసి మాట్లాడుతుంటారు. గత ఏడాది కోల్‌కతా ఐ.ఐ.ఎం.లో చదువు పూర్తిచేసుకుని బయటి ప్రపంచంలోకి వెళుతున్న విద్యార్థులకు ఇచ్చిన ప్రసంగంలో నూయీ ఈ మాటే చెప్పారు. మీరెంత పెద్ద స్థాయిలో ఉండనివ్వండి. మీరెంత బిజీగా ఉండనివ్వండి. ‘అమ్మా నేను బిజీగా ఉన్నాను’ అని మాత్రం అనకండి అని చెప్పారు నూయి.

 

అమ్మానాన్నలకు ధన్యవాదాలు
పెద్ద పెద్ద కంపెనీల సిఇవోలు పదవిని చేపట్టినప్పుడో, పదవీ విరమణ పొందుతున్నప్పుడో ఉద్యోగులందర్నీ ఉద్దేశించి ఒక లేఖ రాస్తుంటారు. ఇంద్రా నూయి కూడా రాశారు. కానీ ఉద్యోగులకు కాదు. వారి తల్లిదండ్రులకు. ‘మీ అబ్బాయిని / అమ్మాయిని మా పెప్సీ కంపెనీకి కానుకగా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అంకితభావంతో కూడిన వారి అత్యద్భుతమైన పనితీరుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను’ అని ప్రతి ఎంప్లాయీ తల్లిదండ్రులకు తన సంతకం ఉన్న లెటర్ పంపించారు నూయి!

 

గుడ్... బెటర్... ఫన్
ఇండియాలో నూయీ తొలి ఉద్యోగం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రాడక్ట్ మేనేజర్‌గా. తర్వాత మెట్టూర్ బియర్డ్‌సెల్ అనే వస్త్ర పరిశ్రమ సంస్థలో. తర్వాత యు.ఎస్. వెళ్లాక అక్కడి బూజ్ అలెన్ హామిల్టన్ అనే మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో సమ్మర్ ఇంటెర్న్‌షిప్. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు, మోటరోలా, ఏషియా బ్రౌన్ బొవెరీ. 1994లో నూయీ పెప్సీకోలో చేరేనాటికి ఆమె వయసు 39 సం. 118 ఏళ్ల చరిత్రగల అమెరికన్ కంపెనీ పెప్సీకో చైర్‌పర్సన్, సి.ఇ.ఒ అయ్యే నాటికి 51 సం. ఆ పన్నెండేళ్ల వ్యవధిలో నూయీ తన ‘స్ట్రాటెజిక్ రీడెరైక్షన్’ విధానాలతో పెప్సీనీ పవర్‌ఫుల్‌గా పునర్నిర్మించారు. ఫన్ ఫర్ యు (పొటాటో చిప్స్, రెగ్యులర్ సోడా), బెటర్ ఫర్ యు (డైట్ లేదా లోఫ్యాట్ స్నాక్స్, సోడాలు), గుడ్ ఫర్ యు (ఓట్ మీల్ పదార్థాలు).. ఇదీ నూయీ స్ట్రాటెజిక్ రీడెరైక్షన్. హిట్ అయింది. షేక్ చేసి మూత తీసిన బాటిల్‌లా పెప్సీకో లాభాలు పొంగిపొర్లాయి.

 

కిరీటం ఇంట్లోకి రాకూడదు!
పెప్సీ సి.ఇ.ఒ. గా నూయికి ఇది పదో ఏడాది. ఈ పదేళ్లలో అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు ఆమెను అనేకసార్లు ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమన్’గా కీర్తించాయి. సి.ఇ.ఒ. అయిన తొలినాళ్లలో ఓ రోజు.. నూయి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. ‘అమ్మా.. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి’ అన్నారు నూయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులైన మహిళల్లో నూయి కూడా ఒకరు అని అంతకుముందే ఫార్చూన్ పత్రిక ప్రకటించింది. ఆ విషయాన్నే ఆమె తన తల్లికి చెప్పదలచుకున్నారు. ‘ఆ ముఖ్యమైన విషయమేదో తర్వాత చూద్దాం. ముందు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురా’ అన్నారు శాంత(మ్మ). నూయి ఆశ్చర్యపోయారు. ‘రాజ్ ఇంట్లోనే ఉన్నాడు కదా. తనని తెమ్మనాల్సింది’ అన్నారు. ‘అబ్బాయి అలసిపోయాడు’- శాంతమ్మ సమాధానం. అల్లుడి అలసట ఆమెకు కనిపించింది కానీ, అలసిపోయి ఇంటికొచ్చిన కూతురు కనిపించలేదు. నూయి కోపంగా బయటికి కెళ్లి పాల ప్యాకెట్‌తో తిరిగొచ్చారు. ప్యాకెట్‌ని కిచెన్ టేబుల్ మీద పడేసి తల్లి వైపు తిరిగారు. ‘ఇప్పుడు చెప్పు. పాలు నేనే వెళ్లి ఎందుకు తేవాలి? మిగతావాళ్లు ఎందుకు తేకూడదు?’ అన్నారు. శాంతమ్మ మాట్లాడలేదు. ఒక చూపు మాత్రం చూశారు. తర్వాత మెల్ల్లిగా మొదలు పెట్టారు. ‘‘చూడు.. నీ కిరీటాన్ని గ్యారేజీలోనే వదిలేయ్. నీతోపాటు దాన్ని ఇంట్లోకి తీసుకురాకు. నువ్వు మొదట భార్యవి. తర్వాత తల్లివి. ఆ తర్వాతే మిగతావన్ని. నీ కుటుంబానికి పాలు అవసరం అయినప్పుడు నీకున్న ముఖ్యమైన పని పాలు తెచ్చు కోవడం ఒక్కటే’’ అన్నారు శాంతమ్మ ఏకబిగిన! ఈ ఏడాది ఫోర్బ్స్ లిస్ట్‌లో పేరొచ్చిన ప్పుడు కూడా మొదట ఆమెకు తన తల్లి మాటలే గుర్తుకొచ్చి ఉంటాయి.

 
‘పవర్‌ఫుల్ ఉమన్’ అని ఎవరు ఎన్ని టైటిల్స్ ఇచ్చినా, ‘పవర్’ అంటే ఇంద్రానూయి దృష్టిలో ఒకటే. స్త్రీపురుష సమభావనకు, సమభాగస్యామ్యానికి కృషి చేయగల సామర్థ్యం ఉండడం. ఆమెలో ఆ సామర్థ్యం ఉంది. అందుకే ఆమె పవర్‌ఫుల్ ఉమన్. ఆఫీసులలో మహిళలు ఒకరికొకరు సహాయం చేసుకుంటే.. ఉమన్ టు ఉమన్.. ఆ పవర్ ప్రవహించడం పెద్ద కష్టమేం కాదని కూడా నూయి అంటుంటారు.

                             

 

ఇంద్రా నూయి (60), వ్యాపార నిర్వాహక దిగ్గజం
పూర్తి పేరు    :     ఇంద్ర కృష్ణమూర్తి
జన్మస్థలం     :     చెన్నై
జన్మదినం     :     28 అక్టోబర్ 1955
చదువు  :           పి.జి.డిప్లమా ఇన్ మేనేజ్‌మెంట్ (ఐ.ఐ.ఎం. కోల్‌కతా)
మాస్టర్స్ డిగ్రీ - పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్‌మెంట్ (యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, యు.ఎస్.)

 

 

తల్లితండ్రులు :     కృష్ణమూర్తి, శాంత
తోబుట్టువులు      :     చంద్రిక, నారాయణ్
భర్త :     రాజ్.కె.నూయి (యామ్‌సాఫ్ట్ ప్రెసి.)
పిల్లలు   :     {పీతా నూయి, తారా నూయి
ప్రస్తుత నివాసం    :     {Xన్‌విచ్, కనెక్టికట్ (యు.ఎస్.)

 

మరికొన్ని విశేషాలు
ఇంద్రా నూయి తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. తల్లి గృహిణి. యేల్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు నూయీ తన రోజువారీ ఖర్చుల కోసం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉండే షిఫ్టులో రిసెప్షనిస్టుగా పని చేశారు.యు.ఎస్.లో తొలి ఉద్యోగానికి నూయి చీర కట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లారు. చెన్నైలో ఉన్నప్పుడు అక్కడి ఆల్ ఉమెన్ రాక్ బ్యాండులో నూయీ ప్రధాన గిటారిస్టు. కాలేజ్‌లో నూయీ క్రికెట్ ప్లేయర్.కార్పోరేట్ సంస్థల వేడుకల్లో సంగీత నేపథ్యంతో (కరావొకె) పాటలు పాడడం నూయీ హాబీ. ఇప్పటికీ పాడుతుంటారు.  పెప్సీకో లో ఏ సమావేశానికైనా నూయీ చీర  కట్టుతోనే హాజరవుతారు.

మరిన్ని వార్తలు