-

మనోవ్యధలు తీర్చే క్షేత్రం

15 Mar, 2016 23:19 IST|Sakshi
మనోవ్యధలు తీర్చే క్షేత్రం

మంగళగిరి
ఈ నెల 23 వరకు బ్రహ్మోత్సవాలు

 
 ఆ స్వామికి భక్తితో చెంబుడు పానకం సమర్పించుకుంటే చాలు...
కొండంత కష్టమైనా కరిగిపోతుందని భక్తుల నమ్మకం.
ఆ కొండ మెట్లెక్కడం మంగళకరం.

 
దక్షిణభారతదేశంలోని అతిపెద్ద శ్రీ వైష్ణవక్షేత్రం శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామివారు కొలువైన దివ్యక్షేత్రం మంగళగిరి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో ముగ్గురు మూర్తులు కొలువై భక్తుల నుంచి పూజలు అందుకుంటారు. కృష్ణానదికి అతిదగ్గరలో ఉంది ఈ దివ్య క్షేత్రం. స్త్రీలు మంగళగౌరివ్రతంలో పూజించే లక్ష్మీదేవి ఈ పవిత్రక్షేత్ర  పర్వతంపైన తపస్సు చేసినందువల్ల ఈ క్షేత్రం మంగళగిరిగా ప్రసిద్ధికెక్కినట్లు చరిత్ర చెబుతుంది. మంగళగిరి క్షేత్రాన్ని సందర్శిస్తే మనోవ్యధలు మంచుపొరల్లా వీడిపోతాయని నానుడి. అందుకే ఎక్కడెక్కడినుంచో భక్తులు వచ్చి ఈ క్షేత్రాన్ని సందర్శించి, తేలికపడిన మనస్సుతో తిరిగి వెళతారు.

ఈ క్షేత్రంలో భక్తుల నుంచి పానకాన్ని స్వీకరిస్తూ పానకాలరాయుడుగా కొలువైన స్వామి వారు ముఖ్యదేవత కాగా కొండదిగువన పాండుపుత్రుడు ధర్మరాజు ప్రతిష్టించిన శ్రీలక్ష్మీనృసింహస్వామివారు కూడా పూజలందుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా అంబరాన్ని తాకుతున్నట్లుండే 11 అంతస్థుల గాలిగోపురం, దక్షిణావృత శంఖం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తుండగా ప్రతిఏడాది దేవస్థానంలో ప్రత్యేకంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి వేడుకలు, స్వామివారి కళ్యాణం సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఆలయానికి ప్రత్యేకతలు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే బంగారు దక్షిణావృత శంఖంతో తీర్థం అందించే వైకుంఠ ఏకాదశినాడు లక్షల సంఖ్యలో ఆలయానికి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థం స్వీకరిస్తారు.

వైభవోపేతంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు
రాష్ట్రవ్యాప్తంగా మంగళగిరి తిరునాళ్ళగా ప్రసిద్ధి చెందిన బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ షష్టి నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు బహుళ విదియ వరకు తొమ్మిదిరోజులపాటు నవాహ్నిక దీక్షతో వైభవంగా నిర్వహిస్తారు. పుష్పయాగం అనంతరం ఉగాది పండుగ వరకు అలంకారోత్సవాలు నిర్వహిస్తారు. ధర్మరాజు దిగువ సన్నిధిలో స్వామివారిని ప్రతిష్టించిన నాటి నుంచి ఎగువ సన్నిధిలో జరగాల్సిన ఉత్సవాలను దిగువసన్నిధిలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ధ్వజావరోహణంతో పరిసమాప్తం అవుతాయి. తొమ్మిదిరోజులపాటు రోజుకో వాహనంపై స్వామి వారు తిరువీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

రథోత్సవం సాంస్కృతిక మహోత్సవం
బ్రహ్మోత్సవాలలో స్వామి వారి కళ్యాణం అనంతరం నిర్వహించే స్వామివారి దివ్యరథోత్సవంలో పాల్గొనడం భక్తులు తమ పూర్వజన్మ ఫలితంగా భావిస్తారు. స్వామివారి కళ్యాణం మరుసటి రోజు పౌర్ణమి రోజున ప్రతిఏడాది తిరునాళ్ళ జరుపుకుంటారు. అదేరోజు దేశవ్యాప్తంగా హోళిపండుగ జరుగుతుంది. దేవాలయంలో ఆరుచక్రాలతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు రథోత్సవంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రథాన్ని లాగేందుకు చిన్న, పెద్ద, ఆడ, మగ, కులం, మతం అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తారు. రథోత్సవంలో తాడుని తాకిన తమ జన్మసార్ధకమైనట్లు భక్తులు ఉత్సాహభరితంగా ముందుకు వస్తారు. గాలిగోపురం నుంచి బయలుదేరే రథగమనాన్ని నిర్ధేశించేలా రథచక్రాలకు చప్టాలను వేస్తుంటారు. ఇందుకొరకు ప్రత్యేక భక్తబృందం వుంటుంది. ప్రతిఏడాది కన్నుల పండువలా జరిగే రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటారు.
 - ఐ. వెంకటేశ్వర రెడ్డి
 
ఇలా చేరుకోవాలి: విజయవాడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని మంగళగిరికి చేరుకునేందుకు ఆర్టీసి బస్సు సౌకర్యంతో పాటు రైలు ప్రయాణసౌకర్యం ఉంది. విజయవాడ, గుంటూరు, తెనాలిల నుంచి ఆర్టీసి బస్సు సౌకర్యంతో పాటు రైలు ప్రయాణంతోనూ చేరుకోవచ్చు. ఎగువ సన్నిధి చేరుకునేందుకు దిగువ సన్నిధి ప్రాంతం నుంచి ఆటో సౌకర్యం ఉంది. మంగళగిరి గుంటూరు నుంచి 20 కిలోమీటర్లు, తెనాలి నుంచి 25 కిలోమీటర్లు, రాజధాని అమరావతి నుంచి 34 కిలోమీటర్లు, తుళ్ళూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
ఈ క్షేత్రంలో భక్తుల నుంచి పానకాన్ని స్వీకరిస్తూ పానకాలరాయుడుగా కొలువైనస్వామి వారు ముఖ్యదేవత కాగా కొండదిగువన పాండుపుత్రుడు ధర్మరాజు ప్రతిష్టించిన శ్రీలక్ష్మీనృసింహస్వామివారు కూడా పూజలందుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు