సూట్‌కేసులో డయాలసిస్‌ కేంద్రం...

1 Mar, 2019 01:10 IST|Sakshi

పరి పరిశోధన

‘స్పర్థయా వర్ధతే విద్య’ అని సామెత. పోటీ ఉంటేనే రాణింపు అని దీని అర్థం. హైదరాబాద్‌ వేదికగా 15 ఏళ్లుగా ఏటా జరుగుతున్న బయో ఆసియా సదస్సులోనూ ఇదే జరుగుతోంది. జీవశాస్త్ర రంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు సదస్సు నిర్వాహకులు ఏర్పాటు చేసిన పోటీలో అనేక స్టార్టప్‌ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తూంటాయి. రెండు రోజుల క్రితమే ముగిసిన 16వ బయో ఆసియా సదస్సులో పదుల సంఖ్యలో స్టార్టప్‌లు పాల్గొనగా.. వాటిలో కీలకమైన, ఆసక్తికరమైన టెక్నాలజీలు, ఆవిష్కరణలు ఇలా ఉన్నాయి...

కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న వారు తరచూ డయాలసిస్‌ చేయించుకోవాల్సి ఉంటుందని మనకు తెలుసు. ఈ కేంద్రాలు తక్కువగా ఉండటం, ఒకసారి ట్రీట్‌మెంట్‌కు బోలెడంత సమయం పడుతూండటం, ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల రోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన పద్మసీతా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ చిన్న సూట్‌కేసులోనే ఇమిడిపోయే డయాలసిస్‌ యంత్రాన్ని సిద్ధం చేసింది. అయితే ఇది పూర్తిస్థాయి డయాలసిస్‌కు ప్రత్యామ్నాయం కాదని, పెరిటోనియల్‌ డయాలసిస్‌ మాత్రమే చేస్తుందని సంస్థ నిర్వాహకుడు గౌరీశంకర్‌ తెలిపారు.

కిడ్నీ సక్రమంగా పనిచేయనివారికి ముందుగా ఈ రకమైన డయాలసిస్‌ చేస్తారని, పూర్తిస్థాయిలో దెబ్బతిన్న తరువాత మాత్రమే హీమో డయాలసిస్‌ అవసరమైనప్పటికీ మరోమార్గం లేక డాక్టర్లు రెండో రకం డయాలసిస్‌ చేయించుకోవాల్సిందిగా సూచిస్తూంటారని ఆయన వివరించారు. నెలకు పదివేల రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ఈ యంత్రాన్ని వాడుకోవచ్చునని, రక్తశుద్ధికి వాడే రసాయనాలు తక్కువగా ఉండటమే కాకుండా, మళ్లీమళ్లీ వాడుకునే అవకాశం ఉండటం విశేషమని చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ సాయంతో దీన్ని ఎక్కడి నుంచైనా పనిచేయించవచ్చునని, రోగి తన శరీరానికి అమర్చిన గొట్టంలోకి యంత్రం నుంచి వచ్చే గొట్టాన్ని కలుపుకుంటే చాలని చెప్పారు. సంప్రదాయ డయాలసిస్‌ యంత్రాలతో పోలిస్తే పదో వంతు తక్కువ ఖరీదు చేసే ఈ యంత్రాలను పీహెచ్‌సీలతోపాటు చిన్న చిన్న వైద్య కేంద్రాల్లోనూ వాడుకోవచ్చునని చెప్పారు.

వరి పొట్టుతో ఐదు ఉప ఉత్పత్తులు...
వరిపొట్టుతో కనీసం ఐదు ఉత్పత్తులను సిద్ధం చేసేందుకు ఒడిషాకు చెందిన ప్రో బయోకెమ్‌ ఇండియా ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ధాన్యం మర పట్టిన తరువాత మిగిలే తవుడుతో నూనెలు చేసుకుంటాం. మిగులును దాణాగా వాడుతూంటాం. వరిపొట్టు విషయానికి వచ్చేసరికి  ఇలాంటి ఆప్షన్లు ఏవీ లేవు. వృథాగా కాల్చేయాల్సిందే. ఇప్పటివరకూ ఉన్న ఈ అంచనాలను మార్చేసింది ప్రో బయోకెమ్‌ ఇండియా. వరి పొట్టును కొన్ని ప్రత్యేకమైన రసాయనాలతో కలిపి, ప్రాసెస్‌ చేసి అనేక ఉపయోగకరమైన పదార్థాలను తయారు చేయవచ్చునని వీరు నిరూపించారు. ఈ ఉప ఉత్పత్తుల్లో మైక్రో క్రిస్టలీన్‌ సెల్యులోజ్, సిలికాజెల్, ఆల్ఫా సెల్యూలోజ్‌ పోషకాలతో కూడిన ఉప్పు, చిట్టచివరిగా ప్లైవుడ్‌ లాంటి ఫైబర్‌ బోర్డులు ఉన్నాయి. వీటన్నింటికీ వేర్వేరు చోట్ల ఉపయోగాలు ఉన్నాయని, రైతుకు అదనపు ఆదాయం అందివ్వడంతోపాటు పర్యావరణానికి మేలు చేసే ఈ టెక్నాలజీని ఇతర వ్యవసాయ వ్యర్థాలకూ మళ్లించవచ్చునని ప్రో బయోకెమ్‌ సీఈవో మహమ్మద్‌ గులేబహార్‌ షేక్‌ తెలిపారు.

అరచేతిలో ఈసీజీ...
ఫొటోలో కనిపిస్తున బుల్లి గాడ్జెట్‌ పేరు సంకేత్‌ లైఫ్‌. గుండె పనితీరును గమనించేందుకు ఆసుపత్రుల్లో వాడే ఈసీజీకి సూక్ష్మరూపం అన్నమాట. ఈసీజీతో మంచి ఫలితాలు రావాలంటే దాదాపు 12 తీగలను ఛాతీలోని వేర్వేరు భాగాలకు అతికించాల్సి ఉంటుంది. సంకేత్‌ లైఫ్‌తో ఆ అవసరం లేదు. గాడ్జెట్‌ పైన కనిపిస్తున్న రెండు సూక్ష్మ రంధ్రాలపై చేతి బొటనవేళ్లు రెండూ ఉంచితే చాలు... ఎంచక్కా ఈసీజీ రీడింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లో వచ్చేస్తుంది. ఒకవేళ పూర్తిస్థాయి 12 లీడ్‌ల ఈసీజీ కావాలన్నా దీని ద్వారా తీసుకోవచ్చు. సంప్రదాయ ఈసీజీలతో పోలిస్తే సంకేత్‌ లైఫ్‌ ఈసీజీ రీడింగ్స్‌ 96 శాతం వరకూ కచ్చితత్వంతో ఉంటాయట. ఈసీజీ కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు.


 

మరిన్ని వార్తలు