నా కూతుర్ని చంపిన వాళ్లింకా బతికే ఉన్నారు

7 Dec, 2019 02:08 IST|Sakshi
‘నిర్భయ’ తల్లి ఆశాదేవి

ఏడేళ్లుగా ‘నిర్భయ’ తల్లి

ఏడు సంవత్సరాల క్రితం ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగింది. ఆ కేసులో నిందితులకు విధించిన శిక్ష ఇప్పటివరకు అమలు జరగలేదు. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణలో ‘దిశ’ నిందితులు నలుగురూ సరిగ్గా వారు ‘హత్యాచారానికి’ పాల్పడిన వారానికి ఎన్‌కౌంటర్‌ కావడం పట్ల ‘నిర్భయ’ తల్లి ఆశాదేవి సంతోషం వెలిబుచ్చారు.

‘‘ఆ నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారన్న విషయం విన్నాను. అసలు ఎలా జరిగిందా అనుకున్నాను. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. పరుగెత్తుకుంటూ వచ్చి టీవీ పెట్టాను. నిజమే!! హైదరాబాద్‌ పోలీసులకు నమస్కరిస్తున్నాను. వారి చర్యను స్వాగతిస్తున్నాను, దిశపై అత్యాచారం చేసిన నిందితులకు సరైన శిక్ష పడిందని భావిస్తున్నాను. ఈ ఎన్‌కౌంటర్‌తో ‘దిశ’ ఆత్మ శాంతించే ఉంటుంది. అయితే నా కుమార్తె విషయంలో కూడా నేరస్థులకు తక్షణం శిక్ష అమలు కావాలని నేను ఏడేళ్లుగా కోరుకుంటున్నా నాకు న్యాయం దక్కలేదని ఆవేదనగా ఉంది. నిర్భయ కేసులో దోషులుగా తేలినవారు ఇంకా బతికే ఉన్నారనే విషయాన్ని నేను పదేపదే గుర్తు చేయవలసి వస్తోంది.

నా కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వారికి శిక్ష అమలు చేసినప్పుడే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ ఏడేళ్లూ నేను నిర్భయకు న్యాయం చేయాలని కోరుతూ చాలామందినే కలిశాను. అందరూ హామీ ఇచ్చారే కాని, ఆచరణ మాత్రం శూన్యమే. ఇప్పుడు దిశ కేసులో జరిగిన ఎన్‌కౌంటర్‌ తర్వాతైనా నిర్భయ నిందితులకు వెంటనే ఉరిశిక్షను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయవ్యవస్థను మరోసారి అభ్యర్థిస్తున్నాను. అత్యాచారం తర్వాత నా కూతురు పదిరోజులు బతికే ఉంది. ప్రతిరోజూ కొద్ది కొద్దిగా మరణించడం నా కళ్లతో చూస్తూ ఉండిపోయాను. పది రోజుల పాటు, ఆమెకు కనీసం చెంచాడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయాను’’ అంటూ బరువైన హృదయంతో మీడియాతో అన్నారు ఆశాదేవి.

2012 డిసెంబర్‌ 16న జరిగిన సంచలనాత్మక ‘నిర్భయ’ ఘటనలో అత్యాచారం, హత్య, కిడ్నాప్, దోపిడీ, దాడి వంటి పలు కేసుల కింద అరెస్ట్‌ అయిన ఆరుగురు నిందితులలో ఒకరు బాలనేరస్థుడు. జైల్లోనే అతడి శిక్షాకాలం పూర్తవడంతో విడుదల చేశారు. మిగిలిన ఐదుగురిలో రామ్‌సింగ్‌ అనే నిందితుడు విచారణ జరుగుతున్న కాలంలోనే  చనిపోయాడు. మిగతా నలుగురికి కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే ఇంతవరకు ఆ శిక్ష అమలు అవలేదు. దీనిపై ఈ నెల 13న ఆశాదేవి మళ్లీ కోర్టును ఆశ్రయించబోతున్నారు. ‘‘వారికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉందని వస్తున్న వార్తలు నా మనసును కలచివేస్తున్నాయి. అదే నిజమైతే నా కూతురి ఆత్మకు శాంతి చేకూరదు’’ అని ఆశాదేవి అన్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా