ఆలోచనలే ఆదేశాలైపోతాయి...

10 Apr, 2018 00:26 IST|Sakshi

ఫొటోను కాస్త జాగ్రత్తగా చూడండి.. ఆ వ్యక్తి చెవి దగ్గర మొదలై మెడ, నోటివరకూ విస్తరించిన గాడ్జెట్‌ను ఇంకొన్నేళ్లలో మీరూ తగిలించుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకలా? ఏమిటి దాని స్పెషాలిటీ అంటారా? సింపుల్‌. మీరు మనసులో అనుకునే మాటలనే ఆదేశాలుగా మార్చి సమాచారం అందిస్తుంది ఇది. అర్థం కాలేదు కదూ.. ఉదాహరణతో చూద్దాం. రోడ్డుపై వెళుతున్నారు... షాపు గాజు కిటికీలోంచి ఓ మంచి షర్ట్‌ కనిపించింది. భలే ఉందే షర్టు అనుకుంటే చాలు.. ఈ గాడ్జెట్‌ ఆ షర్ట్‌పై ఉండే బార్‌కోడ్‌నో లేదా షాపు వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ డిజైన్‌ షర్ట్‌ను గుర్తించో.. లేకపోతే ఇంకో మార్గం ద్వారానో దాని రేటు కనుక్కుని తెలియజేస్తుంది. మామూలుగానైతే.. ఈ పనులన్నీ మనం కీబోర్డు సాయంతో చేయాల్సినవి. అవేవీ లేకుండానే మన ఆలోచనలతోనే చేసేస్తుందన్నమాట. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచేసిన ఈ నమూనా యంత్రం పేరు ‘ఆల్టర్‌ ఈగో’. మనుషులు, కంప్యూటర్ల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సులువుగా జరిగిపోయేందుకు ఇది ఉపయోగపడుతుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న భారతీయ సంతతి శాస్త్రవేత్త అర్ణవ్‌ కపూర్‌ అంటున్నారు.

గాడ్జెట్‌లోని ఎలక్ట్రోడ్‌లు, మెషీన్‌ లెర్నింగ్‌ వ్యవస్థ, బోన్‌ కండక్షన్‌ హెడ్‌ఫోన్ల వంటివన్నీ కలిసి ఈ పనులు చేస్తాయన్నమాట. ఆల్టర్‌ ఈగో పనితీరును వివరిస్తూ ఎంఐటీ ఒక వీడియోను సిద్ధం చేసింది. ఇందులో అర్ణవ్‌ కపూర్‌ ఓ సూపర్‌ మార్కెట్‌లో తిరుగుతూ నచ్చిన ఉత్పత్తివైపు చూస్తే చాలు.. దాని ధర, వివరాలు వినిపిస్తూంటాయి. బిల్లింగ్‌ కౌంటర్‌ వద్దకు వచ్చే సమయానికి మీరు తీసుకున్న వస్తువుల తాలూకూ మొత్తం బిల్లు రెడీగా ఉంటుంది.  

మరిన్ని వార్తలు