వెన్నతో వేయి లాభాలు!

22 May, 2017 02:14 IST|Sakshi
వెన్నతో వేయి లాభాలు!

గతంలో ఆహారాలలో వెన్నను బాగా వాడేవాళ్లం. రొట్టెలపైన వెన్న రాసుకుని తినేవాళ్లం. వేడి అన్నంలో వెన్నపూస వేసుకునే వాళ్లం. అయితే నూనెల వాడకం బాగా పెరిగాక వెన్న వాడకం తగ్గింది. కానీ నిజానికి వెన్న చాలా శ్రేష్ఠమైన, ఆరోగ్యకరమైన ఆహారం.
► వెన్నలో విటమిన్‌ ఏ, విటమిన్‌ డి, విటమిన్‌ ఇ, విటమిన్‌ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్‌ లినోలిక్‌ యాసిడ్‌ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి.
► వెన్నలోని బ్యుటిరేట్‌ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు... ఇది మంచి శక్తివనరు. మన జీవక్రియలకు అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది.
► మనం తిన్న ఆహారం చిన్నపేగుల్లోకి ప్రవేశించాక... అక్కడ ఆ జీర్ణాహారం  ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది వెన్నలోని  బ్యుటిరేట్‌. దీనికి మరో సుగుణం కూడా ఉంది. చిన్న పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా సమర్థంగా తగ్గిస్తుంది.
► వెన్నలోని బ్యుటిరేట్‌ పెద్ద పేగుల క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తుంది.
► వెన్నలోని కాంజుగేటెడ్‌ లినోలిక్‌ యాసిడ్‌ (సీఎల్‌ఏ) విషయానికి వస్తే – మనకు అవసరమైన పోషకాలలో దానికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. గుండె ఆరోగ్యానికి అదెంతో మంచిది. నిజానికి చాలామంది వెన్న తినడం వల్ల కొవ్వు పెరిగి, గుండె ఆరోగ్యానికి అదంత  మంచిది కాదని అనుకుంటారు. కానీ పరిమితమైన వెన్న వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
► వెన్నలో యాంటీఆక్సిడెంట్స్, ఒమెగా–3, ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఎక్కువే. ఇవి వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, అనేక క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి.
► చాలామందికి వెన్న వల్ల స్థూలకాయం వస్తుందనే అపోహ ఉంటుంది. కానీ పరిమితమైన వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు పాళ్లు తగ్గుతాయి. వెన్న తిన్న తర్వాత ఉండే సంతృప్త భావన మితిమీరి తినడాన్ని ఆపుతుంది. ఆ చర్య ద్వారా బరువు పెరగకుండా చూస్తుంది. మరీ ముఖ్యంగా పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న దోహదపడుతుంది.
ఇలా మన ఆహారంలో పరిమితంగా వెన్న తీసుకోవడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అయితే వెన్నతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి కదా అని ఎక్కువగా తీసుకోవడం మాత్రం సరికాదు. రోజుకు 25 గ్రాములు మితం.

మరిన్ని వార్తలు