త్రీ మంకీస్ - 18

5 Nov, 2014 23:29 IST|Sakshi
త్రీ మంకీస్ - 18

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 18
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి


ఓ ధనవంతుడు ప్రధానమంత్రి అవచ్చని నెహ్రూ ఋజువు చేశాడు.
 ఓ బీదవాడు ప్రధానమంత్రి అవచ్చని లాల్‌బహదూర్ శాస్త్రి ఋజువు చేశాడు.
 ఓ మహిళ ప్రధానమంత్రి అవచ్చని ఇందిరాగాంధీ ఋజువు చేసింది.
 ఓ వృద్ధుడు ప్రధానమంత్రి అవచ్చని మొరార్జీ దేశాయ్ ఋజువు చేశాడు.
 ఓ చదువు రాని వాడు ప్రధానమంత్రి అవచ్చని చరణ్ సింగ్ ఋజువు చేశాడు.
 ఓ అసమర్థ పైలట్ ప్రధానమంత్రి అవచ్చని రాజీవ్ గాంధీ ఋజువు చేశాడు.
 ఓ రాజవంశీకుడు ప్రధానమంత్రి అవచ్చని వి పి సింగ్ ఋజువు చేశాడు.
 ఓ పండితుడు ప్రధానమంత్రి అవచ్చని పివి నరసింహారావు ఋజువు చేశాడు.
 ఓ కవి ప్రధానమంత్రి అవచ్చని వాజ్‌పేయ్ ఋజువు చేశాడు.
 ఎవరైనా ప్రధానమంత్రి అవచ్చని దేవెగౌడ ఋజువు చేశాడు.
 ఓ టీ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అవచ్చని మోడీ ఋజువు చేశాడు.
 భారతదేశానికి అసలు ప్రధానమంత్రి అవసరమే లేదని మన్మోహన్ సింగ్ ఋజువు చేశాడు.’’
 గట్టిగా నవ్వులు, ఈలలు, చప్పట్లు.

 ‘‘మై డియర్ ఫ్రెండ్స్, నేనా మధ్య కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ముంబై వెళ్తూంటే ఎయిర్‌హోస్టెస్ సెల్‌ఫోన్స్‌ని ‘మన్మోహన్ సింగ్ మోడ్‌లో ఉంచమని’ ప్రకటించింది. అంటే ఏమిటో మీకు తెలుసు... మన్మోహన్ సింగ్ ఇప్పుడు తన ఆత్మకథని రాస్తున్నాడని తెలుసా? దాని పేరు? ఫోర్ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ : టు జి, త్రి జి, సోనియాజి, రాహుల్‌జి... సోనియా గాంధీ మన్మోహన్ సింగ్‌కి ఎస్సెమ్మెస్ పంపింది, విసుగ్గా ఉందని, ఏదైనా మంచి జోక్‌ని పంపమని! ‘ఇప్పుడు కుదరదు మేడం. నేను మంత్రిమండలి మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నాను’ అని జవాబు ఎస్సెమ్మెస్ పంపారు మన్మోహన్. వెంటనే సోనియాజీ నించి ఆయనకి ఇంకో ఎస్సెమ్మెస్ వచ్చింది - ‘చాలా మంచి జోక్. ఇంకోటి పంపండి’ అని! ‘‘మీరీ జోక్స్ ఎంజాయ్ చేస్తున్నారా?’’ సిద్ధాంత్ అడిగాడు.

 ‘‘యస్’’ చాలామంది అరిచారు.
 ‘‘గుడ్. రజనీకాంత్ జోకులు మీ అందరికీ తెలుసు. విలన్ పేల్చిన బుల్లెట్‌ని చేత్తో పట్టుకుని దాన్ని విలన్ మీదకే విసిరి చంపేది ప్రపంచంలో ఒక్క రజనీకాంతే. ఆయన్నించి జేమ్స్ బాండ్ చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అలాంటి రజనీకాంత్‌కి ప్రధానమంత్రి అవాలనే కోరిక గల ప్రణబ్ ముఖర్జీ ఓ సవాల్ విసిరాడు. ‘నేను చెప్పిన మూడిటిని లేపితే నువ్వు నేషనల్ హీరోవి అవుతావు. లేదా నేషనల్ జోక్‌వి అవుతావు.’ రజనీకాంత్ ఆ సవాలుని అంగీకరించాక ఎవరెస్ట్ దగ్గరకి తీసుకెళ్ళి దాని శిఖరాన్ని ఓసారి లేపి కింద పెట్టమని ప్రణబ్ ముఖర్జీ కోరాడు. మన రజనీకాంత్‌కి అదో లెక్కా? నిమిషంలో ఎడం చేత్తో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తి బాబాలోని తన పెద్ద డైలాగ్‌ని చెప్పి దాన్ని యథాస్థానంలో ఉంచాడు. తర్వాత ఆల్ఫ్స్ పర్వతం దగ్గరకి తీసుకెళ్ళి దాన్ని ఓసారి ఎత్తమని ప్రణబ్ సవాల్ విసిరాడు. రజనీకాంత్ మళ్ళీ దాన్ని ఎత్తి అరుణాచలం సినిమాలోని పెద్ద డైలాగ్‌ని చెప్పి కింద ఉంచాడు.

‘ఈ రెండూ తేలికే. మూడోది చాలా కష్టం. దాంట్లో గెలిస్తే నువ్వు నేషనల్ హీరోవి అవుతావు’ అని మన్మోహన్ సింగ్ కూర్చున్న ప్రైమ్ మినిస్టర్ కుర్చీ దగ్గరకి తీసుకువెళ్ళి సింగ్ గారిని కుర్చీలోంచి లేపమని, ఆయన లేవగానే తను కూర్చోడానికి తయారుగా నిలబడ్డారు. ఎవరు? ప్రణబ్ గారు. ‘లే’ అంటూ ఎడం చేత్తో రజనీకాంత్ మన్మోహన్ చెయ్యి పట్టుకుని లాగాడు. ఊహు. లేపలేకపోయాడు. ఈసారి రెండు చేతులతో ఆయన చేతిని పట్టుకుని ఎత్తినా మన్మోహన్ సింగ్ లేవలేదు. ‘ఎత్తు నాయినా. ఎత్తు’ అని ఆయన గారు నవ్వారు. రజనీకాంత్ రెండు చేతులని సింగ్ గారి చంకల కిందకి పోనించి లేపే ప్రయత్నం చేశారు. రజనీకాంత్‌కి చమటలు కమ్మాయి తప్ప మన్మోహన్ సింగ్ మిల్లీమీటర్ కూడా కదల్లేదు. ‘ఏనుగులని మింగావా? పర్వతాలని ఫలహారం చేశావా?’ అని అరిచి ఎంత ప్రయత్నించినా రజనీకాంత్ ప్రైమ్ మినిస్టర్ సీట్‌లోంచి మన్మోహన్ సింగ్‌ని లేపలేకపోయాడు’’
 మన్మోహన్ సింగ్ మీద మరికొన్ని పొలిటికల్ జోక్స్ చెప్పాక సిద్ధార్థ చెప్పాడు.

 ‘‘ఇరవయ్యవ శతాబ్దంలో రెండు దేశాలకి ఒకేరోజు స్వతంత్రం వచ్చింది. వాటిలోని ఓ దేశం మార్స్‌కి రాకెట్‌ని పంపింది. రెండో దేశం ఇంకా పక్క దేశంలోకి చొరబడాలనే ప్రయత్నిస్తూ విఫలం అవుతోంది... ముఖ్య అతిథి దారిలో ఉన్నారని తెలిసింది... ఈలోగా కొన్ని పొలిటికల్ సామెతలు చెప్తాను... పార్టీ పోరు, పార్టీ పోరు ఓటరు తీర్చాడు... గంజికి లేనమ్మకి గేస్‌స్టవ్ ఇచ్చినట్లు... అపోజిషన్ పార్టీ లీడర్ని ఎందుకు కలిశావంటే మన పార్టీ పరిస్థితి తెలుసుకోడానికన్నాట్ట... రాజకీయాల్లో తల దూర్చి రౌడీలకి భయపడితే ఎలా?... జగమెరిగిన జయప్రదకి రాజమండ్రి అయినా ఒకటే, రాంపూర్ అయినా ఒకటే... సీటు రాక సిట్టింగ్ ఎంఎల్‌ఏ ఏడుస్తూంటే రెబెల్ వచ్చి రాళ్ళేద్దాం రమ్మన్నాట్ట... సర్వేలు చేసి సన్న్యాసికి టికెట్ ఇచ్చినట్టు... పరుగెత్తి పక్క పార్టీలో చేరే కంటే, నిలబడి ఉన్న పార్టీలో ఉండటం మేలు... టికెట్ చిక్కిన వేళ, పదవి దక్కిన వేళ... దేశానికి అధినేత అయినా ఓటరుకు అభ్యర్థే. నక్సలైట్లతో నారాయణ! కుబేర్లతో గోవిందా! ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి...’’
 ఒకతను స్టేజి మీదకి వచ్చి సిద్ధార్ధ చెవిలో ఏదో చెప్పి వెళ్ళాడు.
 (పూర్వం తల మీద టోపీని తీసి గౌరవాన్ని తెలిపేవారు. ఇప్పుడో?)               - మళ్లీ  రేపు

ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,  సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 
 లెటర్స్
1. ముగ్గురు టెక్ దొంగల పేర్లు టైటిల్‌కి జస్టిఫై అయ్యాయి. జైలర్ అటెన్డెన్స్ తీసుకునే సన్నివేశం కామెడీగా ఉంది. ట్రూలీ దిసీజ్ కామెడీ అండ్ థ్రిల్లర్.
 - క్రిష్ టి. (kittu.onair85@gmail.com)
2. కథనం చాలా ఆసక్తిగా ఉండి, నేటి యువతరం చదువు తర్వాత వారి ఆలోచనా సరళిని  తెలియజేస్తోంది. ఈ సీరియల్ పుణ్యమా అని నేను పాతికేళ్ళు వెనక్కి వెళ్లాను... రచనల స్వర్ణయుగంలోకి! - టి. భాస్కర బాబు (babubhaskar04@gmail.com)

మరిన్ని వార్తలు