మంచి పనులు

14 Dec, 2018 01:40 IST|Sakshi

ముగ్గురు వ్యక్తులు కాలినడకన సుదూర ప్రయాణంలో ఉన్నారు. అంతలోనే గాలి, వాన మొదలైంది. ముగ్గురూ ఒక గుహలో తలదాచుకున్నారు. భీకరమైన గాలికి ఒక్కసారిగా ఒక పెద్ద బండరాయి వచ్చిపడటంతో గుహద్వారం మూసుకుపోయింది. గుహంతా చీకటిగా మారిపోయింది. ద్వారం మూసుకుపోవడంతో ముగ్గురిలో ఆందోళన మొదలయ్యింది. బండరాయిని తొలగించాలని ఎంతగా ప్రయత్నించినా రాయి అంగుళం కూడా కదలడం లేదు. అందులోని ఒకరు ‘‘ఈ భయంకరమైన అడవిలో మనల్ని రక్షించేదిక్కెవరూ లేరు. ఇక మనకు అల్లాహ్‌ యే దిక్కు. మనం చేసిన సత్కార్యాలను సాక్ష్యంగా పెట్టి అల్లాహ్‌ ను వేడుకుందాం’’ అని చెప్పాడు. ఒక్కొక్కరూ వరుసగా తాము చేసిన ఒక్కో మంచి పనిని అల్లాహ్‌ ముందు ఏకరువు పెడుతూ దైవ సహాయాన్ని అర్ధించడం మెదలెట్టారు.

అందులో మొదటి వ్యక్తి ‘‘ఓ అల్లాహ్‌.. నా తల్లిదండ్రులిద్దరూ వృద్ధులు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. రోజూ మేకల పాలు పితికి ముందుగా మా అమ్మానాన్నలకు తాగించిన తరువాతే నా పెళ్లాం పిల్లలకు తాగిస్తాను. ఒకరోజు పొలం పనులు చూసుకుని ఇంటికి వచ్చి పాలుపితికి అమ్మానాన్నలకు అందించే సరికి రాత్రి బాగా పొద్దుపోయింది. ఈలోగా మా అమ్మానాన్నలిద్దరూ నిద్రలోకి జారుకున్నారు అమ్మానాన్నల్ని నిద్రనుంచి లేపితే వాళ్ల నిద్ర భంగమవుతుందని వాళ్లు నిద్రలేచే వరకూ పాలగిన్నెను తీసుకుని అలానే నిద్రకాచాను. ఆ రాత్రి నాతో సహా భార్యా పిల్లలు ఆకలితోనే నిద్రపోయారు. కనుక ఓ కరుణామయా నన్ను ఈ చీకటి గుహనుంచి బయటపడే మార్గం చూపించు’’ అని వేడుకోసాగాడు.

మరుక్షణమే గుహ ముఖద్వారానికి అడ్డంగా ఉన్న బండరాయి కాస్తంత జరగడంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక రెండో వ్యక్తి ‘‘ఓ అల్లాహ్‌ మా బంధువుల అమ్మాయి మీద నేనొకసారి మనసు పడ్డాను. ఆమెకు ఒకసారి ఏదో కష్టం వచ్చింది. నా దగ్గరకు వచ్చి కొంత డబ్బు సహాయం చేయమని అర్థించింది. ఆమెకు నేను షరతుతో డబ్బు అందించాను. ఒకరోజు సాయంత్రం షరతు ప్రకారం ఆమె దగ్గరకెళ్లాను. ‘‘అల్లాహ్‌ కు భయపడు. ఎవ్వరూ చూడకపోయినా అల్లాహ్‌ చూస్తున్నాడని గుర్తుంచుకో’‘ అని చెప్పిన ఆమె మాటలకు నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఆ మరుక్షణమే ఆమెకు ఇచ్చిన డబ్బును మాఫీ చేశాను. ఓ అల్లాహ్‌ ఈ పనిని కేవలం నీ మెప్పుకోసమే చేశాను’’ అని అల్లాహ్‌ ను వేడుకోగానే ఆ బండరాయి ఇంకాస్త జరిగింది.

దీంతో బయటికి వెళ్లే మార్గం ఇంకాస్త సుగమమైంది. ఇక మూడో వ్యక్తి వంతురానే వచ్చింది. ‘‘ఓ అల్లాహ్‌ నాదో చిన్న వ్యాపారం. ఒకసారి ఒక కూలీ వాడు రోజంతా నా దగ్గర పనిచేసి ఇంటికెళ్లేటప్పుడు మా ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు రావడంతో అలిగి తన కూలీ తీసుకెళ్లలేదు. నేను ఆ కూలీ డబ్బుతో సాగుబడి చేశాను. చాలా లాభాలు గడించాను. లాభంగా వచ్చిన అతని వాటాలోనుంచి చిల్లిగవ్వకూడా ఖర్చుపెట్టకుండా భద్రపరిచాను. కొన్నేళ్లకు కూలివాడు ఆర్థిక ఇబ్బందులతో తన కూలి డబ్బుల కోసం మళ్లీ నా దగ్గరకొచ్చాడు. అప్పుడు నేను అతనికి ‘‘ఈ మేకలు, ఈ ఆవులన్నీ నీవే. వాటిని మీ ఇంటికి తోలుకుని వెళ్లు, ఆ పంటపొలం, ఈ తోట నీదే’’ అని చెప్పగానే  ఆ కూలివాడు నేను ఎగతాళి చేస్తున్నానననుకున్నాడు.

అదంతా నిజమేనని, ఆ రోజు అతని కూలి డబ్బులతో చేసిన వ్యాపారంతోనే ఇదంతా సంపాదించానని ఇదంతా తనదేనని చెప్పి అతనికి అందించాను. ఓ అల్లాహ్‌ ఇదంతా నీ మీద భయభక్తులతోనే చేశాను. కనుక నీవు ఈ రోజు మమ్మల్ని ఈ చీకటి గుహనుంచి ఎలాగైనా బయటపడేయి’’ అని మూడో వ్యక్తి కూడా వేడుకోగానే బండరాయి పూర్తిగా తొలగిపోయింది. ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు. తల్లిదండ్రుల సేవ, పాపకార్యాలకు ఆమడ దూరంలో ఉండటం, ఒకరి కష్టార్జితాన్ని కాజేయకుండా ఉండటం కూడా దైవారాధనతో సమానం. మంచి పనులే మనకు కష్టకాలంలో ఆదుకుంటాయన్నది ఈ కథలోని నీతి. 
– ముహమ్మద్‌ ముజాహిద్‌ 

మరిన్ని వార్తలు