మునివేళ్ల సృష్టి

22 Feb, 2020 03:13 IST|Sakshi
వినీ వేణుగోపాల్‌

అందమైన చిత్రాలను సున్నితమైన బ్రష్‌తో తీర్చిదిద్దుతారు. కానీ, కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన వినీ వేణుగోపాల్‌ తన మునివేళ్లతో అద్భుత చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు 200 కు పైగా చిత్రాలను 
బ్రష్‌ లేకుండా వేళ్లతోనే ‘గీసిన’ వినీని పరిచయస్తులందరూ ప్రశంసలలో ముంచెత్తుతున్నారు.

ప్యాలెస్‌ చేరిన చిత్రం
రంగులను అద్దుకున్న వేళ్లు తెల్లని కాన్వాస్‌ పైన కదులుతూ ఒక మంచి చిత్రంగా ప్రాణం పోసుకునే కళలో మూడేళ్లుగా రాణిస్తున్నారు వినీ. ప్రస్తుతం ఆమె సౌదీ అరేబియాలో ఉంటున్నారు. భర్త అక్కడే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. ఏడాదిన్నర కొడుకు. పేరు గెహాన్‌. వాడిని ఆడించడం కోసం రకరకాల ప్రయోగాలు చేసేవారు వినీ. ‘ఆ ప్రయోగాల ఫలితమే ఇది’ అంటూ ఇటీవల రియాద్‌లోని నైలా ఆర్ట్‌ గ్యాలరీలో తన వేలి చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు. ఆ ప్రదర్శనలో ఉంచిన సౌదీ రాజు అమిర్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చిత్రం ఇప్పుడు అక్కడి ప్యాలెస్‌లో చేరింది!

కొడుకు ఆటకు రంగులు
వినీ చిన్నప్పటి నుంచే పెయింటింగ్‌లో తన ప్రతిభ కనబరిచేది. అయితే, ఫింగర్‌ పెయింటింగ్‌ మాత్రం మూడేళ్ల నుంచే వేస్తున్నారు ఆమె. ఆసక్తి కొద్ది తనకు తానే సాధన చేసిన వినీ ఇప్పుడు ఈ వర్క్‌లో బిజీగా మారిపోయారు. తన కొడుకు ఆట కోసం మైదా, అందులో కొన్ని ఫుడ్‌ కలర్స్‌ను ఉపయోగించే క్రమంలో కొడుకుతోపాటూ తనూ కొత్త కొత్త నమూనాలు తయారు చేశారు. అక్కణ్ణుంచే వేళ్లతో పెయింటింగ్‌ వేస్తే బాగుంటుందనే ఆలోచన చేసి, ప్రయత్నించి సక్సెస్‌ అయ్యారు. వాటర్‌ కలర్స్, ఆక్రిలిక్, పేస్టల్‌ కలర్స్‌తో అందమైన కొలను, సముద్రం ఒడ్డున  పిల్లలు కట్టే ఇసుక గూళ్లు.. ఇలా ఏదో ఒకదాన్ని ఆ పెయింటింగ్‌లో ప్రధాన అంశంగా తీసుకుంటారు వినీ.

కర్ణాటకలో జరిగే కంబాల బఫెలో రేస్, భయంకరమైన వన్యమృగాల వేట, ఆటలకు సంబంధించిన అంశాలకు కూడా ఆమె తన వేళ్లతో ప్రాణం పోశారు. సౌదీలో ఉండటం వల్ల కావచ్చు.. వినీ చిత్రాల్లో ఎక్కువగా అరేబియన్‌ జీవన శైలి కనిపిస్తుంది. లాంతరు చేతిలో పట్టుకున్న అరబిక్‌ మహిళ, ఒంటెల సవారీ, ఎడారి, ఖర్జూర చెట్లు, కాక్టస్‌ మొక్కలు.. ఇలా ఎన్నో ప్రకృతి నేపథ్యాలు ఈ చిత్రాల్లో కనిపిస్తాయి. 2017లో బహ్రెయిన్‌లో జరిగిన త్రీడీ పెయింటింగ్‌లో గిన్నిస్‌ రికార్డ్‌ను, 2018లో డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ ఎక్సలెన్స్‌ అవార్డులను పొందారు వినీ. ఎంచుకున్న కళతో ఓ కొత్త దారి వేసుకుంటూ వినీ తనప్రత్యేకతను చాటుకుంటూ వెళుతున్నారు. – ఆరెన్నార్‌

మరిన్ని వార్తలు