కీర్తనల్లో...ద్రాక్ష, అరటి, కొబ్బరి

7 Apr, 2019 00:30 IST|Sakshi

దక్షిణాదిన ఒక నానుడి ఉంది. త్యాగరాజ కీర్తనలు ద్రాక్షపళ్ళలాంటివి...నోట్లో వేసుకుని చిదిమితే చాలు, పులకించిపోతాం. శ్యామశాస్త్రి గారి కీర్తనలు కదళీఫలం లాంటివి. కొంచెం కొంచెంగా తొక్క ఒలుచుకుని తింటుంటేనే అరటి పండును ఆసాంతం సంతృప్తిగా ఆస్వాదించగలం. ముత్తుస్వామి దీక్షితులు గారి కీర్తనలు నారికేళ పాకం లాంటివి. కొబ్బరి బోండాం తెచ్చి, పీచు తీసి, పగుల కొట్టి, కొబ్బరి తీసి, తురిమి, పాకం పట్టించి తింటే తప్ప ఆ ఆనందం తెలియదు. దంతసిరి కూడా ఉండాలి. లేకపోతే పళ్ళమధ్య ఇరుక్కుపోతున్నవాటిని సభా గౌరవం కూడా పాటించకుండా పుల్లలతో గుచ్చుకుంటుండాలి. అంటే ముగ్గురివి అటువంటి స్థాయి కలిగిన కీర్తనలు.

శ్యామశాస్త్రి గారికి శ్రీవిద్యా సంప్రదాయం అంటే కరతలామలకం. సాక్షాత్‌ అమ్మవారిని ఉద్దేశించి చేసిన కీర్తనలో ఎన్ని రహస్యాలు దాచారో.. అదొక అద్భుత కీర్తన...‘‘హేమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే/సుమేరు మధ్య వాసినీ అంబ శ్రీకామాక్షి/శ్యామకృష్ణ సోదరీ గౌరీ పరమేశ్వరీ గిరిజా/అలమేలవేణీకీరవాణీ శ్రీలలితే.....’’ పాహిమాం వరదే పరదేవతే అని చిట్టచివరి చరణంలోకి వెళ్ళేటప్పటికి శ్రీలలితే అని చేసారు. ఆయన అమ్మవారిని పిలుస్తున్నారు. రాజగోపురంలో కూర్చుని ఒళ్ళు మరిచి సంకీర్తన చేస్తుంటే... అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఒంటినిండా నగలు ధరించి చేత్తో పాలు పట్టుకొచ్చి..‘అన్నయ్యా! అన్నయ్యా!!!’ అని పిలిచి ఇచ్చేది.

అవి తాగేవారు ఆయన. ఇంటికొచ్చి వారి అమ్మనడిగేవారు..‘‘చెల్లిని ఎందుకు పంపావు ?’’ అని.‘నీ చెల్లీ రాలేదు, నేనూ పంపలేదు’ అని ఆమె అనేవారట. అందుకే ఎక్కువగా ఆయన కీర్తనలలో చివర ‘శ్యామకృష్ణ సహోదరీ’ అని చేర్చారు. ఒక అర్థంలో కామాక్షీదేవిని వాళ్ళ ఇంటి ఆడపడుచు–అని, మరొక అర్థంలో విష్ణు సహోదరి అయిన అమ్మవారు– అని అర్థం వచ్చేలా ఉంటుంది. త్యాగరాజుగారు ‘త్యాగరాజనుత’ అని వేసుకున్నట్లుగానే, శ్యామశాస్త్రిగారు ‘శ్యామకృష్ణ సహోదరి’ అనీ, ‘శ్యామకృష్ణ పూజిత’ అని వేసుకున్నారు.అనేకమంది మహర్షులకు నిలయం హిమవత్‌ పర్వతం.

ఎందరో అక్కడ ధ్యానం చేస్తుంటారు. అటువంటి హిమవత్‌ పర్వత రాజయిన హిమవంతుడి భార్య మేనక. దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిగా ఉండి హిమాలయాల్లో సంచరిస్తుండగా ఆమెను చూసిన మేనక –‘నాకు ఇటువంటి కుమార్తె ఉంటే బాగుండును’ అనుకున్న కారణంగా ఆమె హైమవతి గా జన్మించింది. ప్రపంచంలోని పర్వతాలన్నింటిలోకి శ్రేష్టమయినదిగా పిలవబడే హిమవత్పర్వతం... దానికి రాజయిన హిమవంతుడికి కుమార్తె అయిన దానా... వరదే.. అంటే వరములిచ్చేది... ఇక్కడ ఆ తల్లిని అడుగుతున్నది మామూలు వరాలు కాదట. ఏ ఆనందాన్ని అనుభవించడం చేత అటువంటి సుఖం కలుగుతుందో అటువంటి ఆనందం కేవలం పరమేశ్వరుని పాదాలనుంచి స్రవించే అమృతంలో తప్ప మరొక దానిలో లేదు.

అటువంటి పాదసేవ కోర్కెను తీర్చగలిగే తల్లి కనుక ‘వరదే’ అన్నారు. అంటే లౌకికమైన స్థితినుంచి అలౌకికమైన స్థితిని పెంచడానికి అవకాశమున్న భక్తి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తునిగా చేయగలిగిన దానివి. అందుకని .. వరదే.. అన్నారు. ఆ తల్లిని అడుగుతున్నది మామూలు వరం కాదు. ఆ వరానికి ‘కాదంబరి’ అన్న నామంతో సంబంధం ఉంది. ఈ కీర్తన గొప్పతనం ఎంతంటే.. .అది ప్రతిరోజూ విన్నంత మాత్రం చేత అద్భుతమైన వాక్శక్తినీ, వాఙ్మయ ధారను అమ్మవారు కటాక్షించ గలుగుతుంది.

మరిన్ని వార్తలు