థైరాయిడ్ సమస్యలు

23 Dec, 2013 22:39 IST|Sakshi
థైరాయిడ్ సమస్యలు

థైరాయిడ్ నుంచి విడుదలైన హార్మోన్లు రక్తప్రవాహంలో కలిసి చాలా కీలకమైన జీవక్రియలను నిర్వహిస్తుంటాయి. ఈ గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల థైరాయిడ్ సంబంధిత సమస్యలు వస్తాయి. ప్రస్తుతం జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆహారంలో అసమతుల్యత, శారీరక శ్రమ లోపించడం వంటి కారణాల వల్ల థైరాయిడ్ సమస్య ఇటీవల చాలా ఎక్కువగా వస్తోంది. ఇది ఏ వయసువారికైనా రావచ్చు. అయితే వయసును అనుసరించి కారణాలు మారవచ్చు.
 
 థైరాయిడ్ సమస్యను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి...

1. హైపోథైరాయిడిజం: ఈ సమస్య ఉన్నప్పుడు జీవక్రియలు సజావుగా జరగడానికి సరిపడ థైరాక్సిన్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయలేదు. ఫలితంగా అలసట, చర్మం పొడిబారడం, అధికబరువు, స్త్రీలలో నెలసరి సమస్యలు, మగత, మలబద్దకం, చలికి తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, కీళ్లనొప్పులు, చిరాకు, మతిమరపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
2. హైపర్‌థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి అవసరాన్ని మించి అధికంగా పనిచేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండెదడ, చేతులు-కాళ్లు వణకడం, నిద్రలేమి, ఆందోళన, బరువు తగ్గిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ఆకలి పెరగడం, నెలసరి సమస్యలు, కండరాల బలహీనత వంటి లక్షణాలు హైపర్‌థైరాయిడిజంలో కనిపిస్తాయి.
     
 థైరాయిడ్ హార్మోన్లు అధికంగా స్రవించడం వల్ల థైరోటాక్సికోసిస్ అనే వ్యాధి  వస్తుంది. ఈ వ్యాధి చాలా నెమ్మదిగా మొదలవుతుంది.
     
 కంటి కండరాలు వాచి, కనుగుడ్లు ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తే దాన్ని ‘గ్రేవ్స్ డిసీజ్’ అంటారు.
     
 కొంతమందికి థైరాయిడ్ గ్రంథి పెద్దదై మెడ భాగంలో వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ అంటారు.
 
నిర్ధారణ పరీక్షలు:  థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని తెలుసుకోడానికి టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఆయా హార్మోన్ల పాళ్లను బట్టి సమస్యను తెలుసుకుంటారు. ఆయా హార్మోన్ల హెచ్చుతగ్గులను బట్టి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందేమో అని నిర్ధారణ చేయడానికి థైరాయిడ్ యాంటీబాడీస్ (యాంటీటీపీఓ యాంటీబాడీస్) పరీక్షలు అవసరమవుతాయి.
 
 హోమియో వైద్యం: రోగి శారీరక, మానసిక పరిస్థితులు, ఆకలి, నిద్ర, ఆందోళన వంటి అంశాలతో పాటు వంశపారంపర్య ఆరోగ్య చరిత్ర వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని థైరాయిడ్ సమస్యకు మందులను ఇవ్వాల్సి ఉంటుంది.
 
 డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్

 

మరిన్ని వార్తలు