గ్రెటా ది గ్రేట్‌

30 Dec, 2019 00:03 IST|Sakshi

జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌.. ది గ్రేట్‌ ! చే గువేరా.. ది గ్రేట్‌ ! మార్టిన్‌ లూథర్‌ కింగ్‌.. ది గ్రేట్‌! ఈ వరుసలో.. ఇప్పుడు గ్రెటా థన్‌బర్గ్‌.. ది గ్రేట్‌! ఏంటి! తోస్తే పడిపోయేట్లు ఉండే ఈ అమ్మాయా! ఆమె పడిపోవడం కాదు. ప్రపంచాన్ని నిలబెట్టడానికి పిడికిలి బిగించింది. అందుకే ఈ ఏడాది ప్రతి దేశంలోనూ గ్రెటానే..  ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’. దేశాలు ఈ టైటిల్‌ ఇవ్వకపోవచ్చు.  దేశ దేశాల ప్రజలు ఇచ్చేశారు.

ప్రకృతి విధ్వంసం గురించి వేలాదిమంది కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, చివరకు ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ వేదిక సైతం దశాబ్దాలుగా చేయలేకపోయిన పనిని ఆ చిన్నారి అతి తక్కువ వ్యవధిలో సాధించింది. పర్యావరణం పేరిట జరుగుతున్న రాజకీయాలను తోసిపారేసింది. ప్రకృతి రక్షణపై చిన్నచూపు చూస్తున్న ప్రపంచ నాయకులను ఐరాస వేదికగా ‘హౌ డేర్‌ యు’ అంటూ నిలదీసింది. అక్కడితో ఆగిపోలేదు. పర్యావరణం పట్ల ప్రపంచ దృక్పథాన్నే తాను మార్చివేసింది. అప్పటికే ప్రపంచాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడుకోవాలని పోరాడుతున్న వారికి కొండంత స్థైర్యం కలిగించింది.

నిఘంటువులు చోటిచ్చాయి
పర్యావరణ సమ్మె పేరిట 2018 ఆగస్టులో స్కూలు దాటి బయటకొచ్చిన ఆమె.. పదహారు నెలల వ్యవధిలో ప్రపంచాన్ని సుడిగాలిలా చుట్టేసింది. స్వీడిష్‌ పార్లమెంట్‌ ముందు ఒంటరిగా ‘పర్యావరణం కోసం పాఠశాల సమ్మె’ మొదలెట్టింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ అధినేతలను సవాలు చేసింది. పోప్‌ను కలిసింది. అమెరికా అధ్యక్షుడు వంకర ట్రంప్‌ను ఈసడించింది. 2019 సెప్టెంబర్‌ 20న తలపెట్టిన ప్రపంచ పర్యావరణ సమ్మె సందర్భంగా నలభై లక్షల మందికి ప్రేరణ కలిగించింది. మానవ చరిత్రలో అతిపెద్ద పర్యావరణ ప్రదర్శనకు నాయకత్వం వహించింది. లాటిన్‌ అమెరికా విప్లవ యోధుడు చేగువేరా తర్వాత అంతటిస్థాయిలో తన చుట్టూ వీరారాధనను సృష్టించుకుంది. కొందరు ఆమెను జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ అని పిలిచారు. కొందరు ఆమెను ప్రపంచ నిగూఢ రహస్యాన్ని తన చిరునవ్వులో దాచిన మోనాలీసాతో పోల్చారు. వీటన్నిటికి మించి ఆమె స్వీడన్‌ పార్లమెంటు ముందు కూర్చుని పలికిన ‘పర్యావరణ సమ్మె’ అనే పదాన్ని ఈ సంవత్సరం మొత్తంలో విశిష్ట పదంగా నిఘంటువులు సైతం పొందుపర్చాయి.

ప్రభుత్వాలు తలవంచాయి
ఇంతటి ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన గ్రెటా థన్‌బెర్గ్‌ అంతా చేసి 16 ఏళ్ల బాలిక. మానవ చరిత్రలో కెల్లా మహిమాన్విత ప్రసంగాల్లో మొదటిది ఐ హ్యావ్‌ ఎ డ్రీమ్‌ (నేను కల కంటున్నాను) అనే మార్టిన్‌ లూథర్‌ ప్రసంగంగా అందరికీ తెలుసు. ఐక్యరాజ్యసమితి వేదికపై నిల్చుని.. ‘‘మా చిన్ని ప్రపంచాన్ని, మా కలల్ని కూల్చివేయడానికి మీకెంత ధైర్యం’’ అంటూ గ్రెటా చేసిన ప్రసంగం ఆ స్థాయిలో నిలుస్తోంది. పర్యావరణ రక్షణకోసం పోరాడుతున్న వారికి, దాన్ని పట్టించుకోని వారికి మధ్య ఆమె నైతికపరమైన లక్ష్మణరేఖను గీసింది. తమ దేశాల్లో కాలుష్యానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలిస్తామని దేశాధినేతలు, ప్రభుత్వాలు సైతం అంగీకరించేటట్లు చేసింది. శారీరకంగా చూస్తే.. తోస్తే పడిపోయేటట్లు కనిపించే అర్భకురాలు. కానీ ప్రపంచంలో పర్యావరణానికి కలిగిస్తున్న అన్యాయాలను నిలదీస్తూ లెబనాన్‌ నుంచి లైబీరీయా వరకు లక్షలాది టీనేజ్‌ గ్రేటాలు పాఠశాలలు వదిలి పర్యావరణ సమ్మెలో పాల్గొనేలా చేసిన ప్రేరణ కర్త ఆమె.

‘టైమ్‌’ పత్రిక గ్రేట్‌ అంది
గ్రెటా.. టైమ్‌ పత్రిక తరపున 2019 పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచింది. జన్మ సార్థకతకు చిహ్నంగా అందరూ భావించే ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని కూడా ఆమె పట్టించుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రపంచనేతలు, సీఈఓల ముందు నిలబడి ప్రపంచాన్ని భయపెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పిందామె. ‘‘ప్రతిరోజూ నేను పొందుతున్న భయానుభూతిని మీరందరూ అనుభూతి చెందాలని కోరుకుంటున్నాను. తర్వాతే మీరు పనిలోకి దిగాలని నా ఆశ. కానీ భయపెట్టటంలోనూ బాధ్యత ఉంది’’ అని గుర్తు చేసిందామె.

అధినేతలు ఫాలో అయ్యారు
పసిపిల్లల కళ్ల నుంచి ప్రపంచాన్ని చూడటం అనేది మనసును మార్చడానికి అత్యుత్తమ విధానం అని అంటుంటారు. ప్రపంచాధినేతలు ఆమె కళ్లు వెలువరిస్తున్న భావాలను అర్థం చేసుకుంటున్నారు. వారిలో కాస్త నిజాయితీగా కనిపిస్తున్న వారు ఆమె మాటలకు దాసోహమవుతున్నారు. ‘‘మనం పెద్ద నాయకులమే కావచ్చు కాని ప్రతి రోజూ, ప్రతివారం పర్యావరణ పరిరక్షణపై అలాంటి సందేశాన్ని ప్రతిచోట నుంచి ఇస్తున్నప్పుడు మనం తటస్థంగా ఉండలేం’’ అంటూ ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమాన్యువల్‌ మేక్రాన్‌ ఒప్పేసుకున్నారు. ‘‘ఈ పిల్లలు నేను మారడానికి సహాయపడ్డారు’’ అంటున్న ఆయన మాటలు ఇప్పుడు చాలామందికి కనువిప్పు కలిగిస్తున్నాయి.

పర్యావరణ మార్పును పట్టించుకోని దేశాలపై పన్ను విధించాలని యూరోపియన్‌ యూనియన్‌ సిద్ధమైందంటే పసిపిల్లల నినాదాలు ఏ స్థాయిలో ఈ ప్రపంచంపై ప్రభావం చూపుతున్నాయో తెలుస్తుంది. ‘‘రేపు అనేది లేనప్పుడు, కనిపించనప్పుడు మనం జీవితాన్ని కొనసాగించలేం. కానీ మనందరికీ రేపు అనే భవిష్యత్తు ఉంది. అది అందరికీ కనబడుతోందని మాత్రమే మేం చెబుతున్నాం’’ అంటూగ్రెటా ప్రపంచ చిన్నారుల తరపున ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది. అందుకే ప్రపంచం బాధను ఆమె తన భాధగా చేసుకుందని అంటున్నారు. ప్రపంచం బాధను, నిరాశను, నిస్పృహను, కోపాన్ని వ్యక్తీకరించడంతో సరిపెట్టుకోకుండా.. ఓటు హక్కు కూడా లేని కోట్లాదిమంది చిన్నారుల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోతున్నప్పుడు... మనం బతకాలి అంటూ వేస్తున్న పెనుకేక గ్రెటా థన్‌బెర్గ్‌.
– శోభారాజు

క్లాస్‌ రూమ్‌లో మొదలైంది
థన్‌బర్గ్‌ చదువుతున్న ప్రాథమిక పాఠశాల టీచర్‌ పర్యావరణ విపత్తుల గురించి చెబుతున్న ఒక వీడియోను క్లాసులో చూపించి వాతావరణ మార్పు వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పినప్పుడు  క్లాస్‌ మొత్తం షాక్‌కు గురైంది. పిల్లలందరూ త్వరలోనే తేరుకున్నారు. కానీ గ్రెటా కోలుకోలేకపోయింది. ధ్రువప్రాంతాల్లోని ఎలుగుబంట్లు ఆకలితో అలమటించడం, వాతావరణం పూర్తిగా మారిపోవడం, వరదలు ముంచెత్తడం చూసిన గ్రెటా 11 ఏళ్ల ప్రాయంలో తీవ్రమైన అలజడికి గురైంది. నెలలతరబడి మాట్లాడలేకపోయింది. అతి తక్కువ ఆహారం తీసుకోవడంతో ఆసుపత్రి పాలైంది. ఆ సమయంలో ఆమె పరిస్థితిని ‘అంతంలేని విషాదం’గా కన్నతండ్రే వర్ణించారు. మానవ మనుగడే ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై తనలో ఏర్పడిన గందరగోళం చివరకు ప్రాణాలమీదికి తెచ్చిందని గ్రెటా కూడా స్వయంగా చెప్పింది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు