దేవుడితో మాట్లాడే సమయం

16 Aug, 2018 00:06 IST|Sakshi

చెట్టు నీడ

‘‘మంత్రజపాలు చేసినా, హోమాలు నిర్వహించినా, యజ్ఞయాగాదులు చేసినా, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినా బుద్ధి కుదురుగా లేకపోతే, ప్రవర్తన సరిగా లేకపోతే మోక్షం కలుగదు’’ అని తనను దర్శించడానికి వచ్చే భక్తులకు తరచు బోధించేవారు సాయి. ఒక గింజ మొలకెత్తి, చిగురులు తొడిగి, వృక్షం కావాలంటే ఎన్నో శక్తులు, ఎన్నో విధాల సాయం చేస్తాయి. నేల, నీరు, గాలి, సూర్యుడు.. ఇవన్నీ ఊపిరులూదితే కానీ ఆ గింజ ప్రాణం పోసుకోదు. ఎదగదు. అయినా ఇవన్నీ ఆ మొక్క నుంచి ఏమీ ఆశించవు. మీరూ ఎవరినుంచీ ఏమీ ఆశించకండి. చేతనైతే ఎవరికైనా మేలు చేయండి లేదంటే కనీసం కీడు చేయకుండా ఉండండి’’ అని బాబా బోధించేవారు. 

ఎల్లవేళలా దైవనామస్మరణ చేసేవారిని మాత్రమే కాదు, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవటం, మంచి భావనలతో మనసును నిష్కల్మషంగా ఉంచుకోవటం.. వీటిని ఆచరించేవారిని కూడా బాబా సదా అంటిపెట్టుకుని ఉంటారు. బాబా చూపిన ఆధ్యాత్మిక బాట కేవలం భక్తిపరమైనదే కాదు, అది మంచి జీవనశైలిని కూడా అలవరుస్తుంది. దానిని ఆచరించిన వారు అన్నింటా మంచి ఫలితాలను పొందుతారు. ఎందుకంటే ఆయన ఆచరణ సాధ్యం కాని విషయాలను ఆచరించమని చెప్పలేదు. ఫలానా నియమాలను పాటించాలని, యజ్ఞయాగాదులు చేయమని సూచించలేదు. తననే పూజించమని చెప్పలేదు. మరేం చేశారంటే.. మనిషి మోక్షం పొందడానికి సరికొత్త జీవన విధానాన్ని ప్రచారం చేశారు. అంతేకాదు, ఆ విధానంలో ఎలా జీవించాలో అందరికీ జీవించి చూపారు. అలాంటి జీవన శైలిని అలవరచుకుంటే ఎవరయినా ఎంతటి స్థాయికి చేరుకోగలరో తెలిసేలా జీవించారు.
 
సాయి చెప్పిన దానిని బట్టి ప్రార్థన అంటే దేవుడితో బేరం కుదుర్చుకోవడం కాదు. ‘ఫలానా పని అయితే నీ దగ్గరకు వస్తాను, అదిస్తాను, ఇదిస్తాను, నాకు ఈ పని అయ్యేలా చూడు’ అని మొక్కుకోవడం కాదు. నిజమైన ప్రార్థనలో ప్రతిఫలాపేక్ష ఉండదు. మనకు జీవితమనే గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడం ప్రార్థనలోని పరమార్థం. ఇంకా సూటిగా చెప్పాలంటే – ‘ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడే సమయం’అన్నమాట. నిజంగా దేవుడి కోసం చేసే ప్రార్థనలో కోరికలు ఉండకూడదు. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండకూడదు. నిజమైన భక్తి ఎలా ఉండాలంటే.. మనసులో మంచిని తలుచుకోవాలి. కళ్లతో మంచిని చూడాలి. నాలుకతో మంచిని మాట్లాడాలి. చెవులతో మంచిని వినాలి. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే నిర్మలం కాని మనసులోకి భగవంతుడు ప్రవేశించలేడు. కాబట్టి పైన చెప్పిన మంచి పనులన్నింటినీ చేస్తూ, మనసును పూర్తిగా భగవంతుడి పైన లగ్నం చేయాలి. 
 

మరిన్ని వార్తలు