చిట్కా తెలియడమే ఆలస్యం..

18 Oct, 2015 03:18 IST|Sakshi
చిట్కా తెలియడమే ఆలస్యం..

ఇంటిప్స్
* ఇంట్లో ఉండే మెడ గొలుసులన్నింటినీ ఒకే చోట దాచుకున్నప్పుడు అవి ఒకదానికొకటి మెలిక పడుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక్కో గొలుసును ఒక్కో స్ట్రాలోకి దూర్చి హుక్ పెట్టేయాలి. అలా ఎన్ని చెయిన్స్‌నైనా ఒక బాక్స్‌లో పెట్టుకొని ప్రయాణాలు చేయొచ్చు. అలాగే గొలుసులకు పడిన చిక్కును విడదీయడానికి బేబీ పౌడర్ వాడాలి. ఆ చిక్కుముడికి పౌడర్ రాస్తే సులువుగా విడిపోతుంది.
     
* బంగారం ఆభరణాలను మినహా మిగతా అలంకరణ వస్తువులను జాగ్రత్తగా దాచుకోరు చాలామంది. ముఖ్యంగా చిన్ని చిన్ని చెవి దుద్దులు. ఫంక్షన్‌కు రెడీ అవుతున్నప్పుడు చూసుకుంటే ప్రతి జతలో ఒక్కో దుద్దు కనిపించకుండా పోవడం అందరికీ తరచూ జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే వాటిని పెద్దసైజు బటన్లకు అమర్చితే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రకం కావాలంటే అవి సులువుగా కనిపిస్తాయి, ఎప్పటికీ భద్రంగా ఉంటాయి కూడా.
     
* తలుపులకు, కిటికీలకు పెయింట్ వేయడానికి పెద్ద సైజు బ్రష్‌లను ఉపయోగిస్తుంటాం. ఒక్కోసారి అనుకోకుండా మోతాదుకంటే ఎక్కువగా పెయింట్ వచ్చేస్తుంది ఆ బ్రష్‌కు. దాన్ని తీసేయడానికి ఆ డబ్బా అంచులకు రాస్తుంటాం. అలా కాకుండా ఆ డబ్బా చుట్టూ ఓ రబ్బర్ బ్యాండును పెట్టి, దాని సాయంతో ఎక్కువగా ఉన్న పెయింట్‌ను తొలగించొచ్చు. అలా చేస్తే డబ్బాకు ఎలాంటి రంగు మరకలు ఉండవు.
     
* షర్టు బటన్లు తరచూ ఊడిపోతూ ఉంటాయి. లేదా దారాలు ఒదులుగా ఉండి వేలాడుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే బటన్లు కుట్టిన వెంటనే వాటి మధ్యలో కొద్దిగా నెయిల్ పాలిష్ రుద్దాలి. అది ఆరే వరకు కదిలించకూడదు. అలా చేస్తే ఆ దారాలు తొందరగా లూజ్ కాకుండా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కలర్‌లెస్ నెయిల్ పాలిషులు అందుబాటులో ఉంటున్నాయి. అది ఉపయోగిస్తే ఏ కలర్ బటన్స్‌కైనా పాలిష్ వేసినట్టు కనిపించదు.
     
* ఫ్లవర్ వాజుల్లో పెట్టిన పూలు త్వరగా వాడిపోకుండా ఉండాలంటే కాస్త వాటిపై శ్రద్ధ పెడితే చాలు. రోజూ రోజూ ఖరీదైన పూలను మార్చి కొత్తవి పెట్టాలంటే కొంచెం ఇబ్బందే. కాబట్టి వాజులోని నీళ్లలో ఒక రాగి నాణెంతో పాటు కొద్దిగా చక్కెర వేయాలి. రోజూ ఆ నీటిని మార్చి చక్కెర వేస్తుండాలి. అలా చేస్తే ఆ పూలు చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఆ పూల సువాసనకు మార్కెట్‌లో దొరికే ఏ సెంటూ సాటి రాదు.

మరిన్ని వార్తలు