చర్మం పొడిబారుతుంటే...

5 Dec, 2019 00:12 IST|Sakshi

సీజనల్‌ టిప్స్‌

స్వెటర్‌ వేసుకునో, వేడి వేడిగా కప్పు టీ తాగో చలిని ఇట్టే తరిమేయచ్చు. కానీ, పొడిబారే చర్మాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం దురద, ముడతలు పడటం వంటి సమస్యలు దీర్ఘకాలం బాధిస్తాయి. ఎండాకాలం కన్నా  చలికాలం వేధించే చర్మ సమస్యలే అధికం. అందుకు కోల్డ్‌ క్రీములు, మాయిశ్చరైజర్లు ఉపయోగించినా రోజువారీ ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

గ్లిజరిన్‌ – పెట్రోలియమ్‌ జెల్లీ
దూది ఉండను తీసుకొని గ్లిజర్‌లో అద్ది, పొడిబారిన చర్మంపై మృదువుగా రాయాలి. చర్మంలోకి ఇంకి పొడిబారడం సమస్య తగ్గుతుంది. వారానికి నాలుగైదు సార్లు రాయచు. అలాగే, పెట్రోలియమ్‌జెల్లీలో మాయిశ్చరైజర్‌ లక్షణాలు అధికం. పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రాత్రి పడుకునేముందు పెట్రోలియమ్‌ జెల్లీ రాసుకుంటే చర్మం పొడిబారడం సమస్య దరిచేరదు.

పొద్దుతిరుగుడు నూనె
చర్మం పొడిబారితే త్వరగా ముడతలు పడుతుంది. ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపుతుంది పొద్దుతిరుగుడు నూనె. కొద్దిగా ఈ నూనెతో చేతిలో వేసుకొని, ముఖానికి, కాళ్లకు, చేతులకు పట్టించి, మృదువుగా మర్దన చేసి వదిలేయాలి. రోజుకు ఒకసారైనా ఇలా చేస్తే చర్మం పొడిబారే సమస్య ఉండదు.

తేనె–బొప్పాయి
బొప్పాయిలో చర్మం ముడతలు పడటానికి నివారించే యాంటీ ఏజింగ్‌ ఏజెంట్స్‌ అధికం. తేనెలో చర్మాన్ని మృదువుగా మార్చే సుగుణాలు ఉన్నాయి. బొప్పాయి గుజ్జులో తేనె కలిసి ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరినూనె
చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌ అంటే అది కొబ్బరి నూనె. కొద్దిగా అరచేతిలో కొబ్బరి నూనె వేసుకొని రెండు చేతులకూ రాసి పొడిబారిన చర్మం మీదుగా రాయాలి. త్వరగా రిలీఫ్‌ లభిస్తుంది. చర్మం పొడిబారడం సమస్యా తగ్గుతుంది.

పాలు – బాదం
బాదంపప్పు, పాలలో చర్మానికి మాయిశ్చరైజర్‌నిచ్చే సుగుణాలు ఉన్నాయి. పొడిబారి కందిపోయిన చర్మానికి ఇవి ఉపశమనంతో పాటు సమస్యను తగ్గిస్తాయి. టీ స్పూన్‌ బాదం పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల పాలు కలిపి మిశ్రమం తయారుచేసుకొని కందిపోయిన చర్మం మీదుగా రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ లభిస్తుంది.

తేనె – నిమ్మరసం
నిమ్మలో యాంటీయాక్సిడెంట్లు, తేనెలో మాయిశ్చరైజింగ్‌ ఏజెంట్స్‌ ఉంటాయి. ఈ రెంటినీ కలిపి వాడితే చలికాలం వేధించే చర్మ సమస్యలు దరిచేరవు.

మరిన్ని వార్తలు