డై కానివ్వకండి

25 Jan, 2020 05:18 IST|Sakshi

బ్యూటిప్స్‌

తెల్ల వెంట్రుకలను నల్లబరచడానికి వాడే రకరకాల రసాయనాల హెయిర్‌ డైలతో ఒక ఇబ్బంది ఉంది. అవి మాడుపైన సహజమైన నూనెలను తొలగించి, తెల్లవెంట్రుకల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తాయి. అంతేకాదు, వెంట్రుకల కుదుళ్లునూ బలహీనపరుస్తాయి. దీనివల్ల వెంట్రుకలు రాలడం, బలహీనపడటం జరుగుతుంది. అలా కాకుండా.. డై వాడుతున్నప్పటికీ.. జుట్టుకు పూర్వపుకాంతి పోకుండా ఉండాలన్నా, రసాయనాల రంగుల వల్ల వెంట్రుకలు దెబ్బతినకుండా ఉండాలన్నా తరచు కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం అవసరం.

ఆముదం – కొబ్బరి నూనె
టేబుల్‌ స్పూన్‌ ఆముదం, రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్న ఈ నూనెను వేళ్లతో అద్దుకుంటూ జుట్టుకుదుళ్లకు పట్టేలా మృదువుగా మర్దన చేయాలి. ఇలా తలంతా పట్టించి ఓ అరగంట తర్వాత తలస్నానం చేయాలి. రసాయనాలు గాఢత లేని షాంపూల వాడకం మేలు.

మందార పువ్వు – ఉసిరి పొడి
జుట్టుకు ప్రకృతిసిద్ధమైన మాస్క్‌. దీని వల్ల జుట్టు కుదుళ్లు బలమవుతాయి. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడే సమస్య దరిచేరదు. చుండ్రు సమస్య ఉండదు.
2–3 మందార పువ్వులను 2 టేబుల్‌ స్పూన్ల ఉసిరిపొడి కలిపి మెత్తగా నూరాలి. మిశ్రమం చిక్కగా తయారవ్వడానికి పెరుగు లేదా కొద్దిగా నీళ్లు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. గంట తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు సహజసిద్ధమైన కండిషనర్‌లా పనిచేస్తుంది.

హెన్నా లేదా గోరింటాకు పొడి
చాలా మంది తెలుపు, నలుపులుగా ఉండే జుట్టుకు హెన్నా (గోరింటాకు పొడి)ను మొట్టమొదటి ఎంపికగా వాడుతుంటారు. ముఖ్యంగా హెయిర్‌ కలర్స్‌లో రసాయనాలు ఉండి జుట్టు ఊడిపోతుందనే భయం వల్ల కూడా చాలా మంది హెన్నా వాడుతుంటారు. తెల్లవెంట్రుకలకు సరైన చికిత్స ఇవ్వాలంటే.. 5–6 టేబుల్‌ సూన్ల హెన్నా పౌడర్‌ని తగినన్ని నీళ్లలో కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 3–4 గంటల సేపు ఆరనివ్వాలి. తర్వాత తలస్నానం చేయాలి.

మరిన్ని వార్తలు