అవకాశం రావాలే గానీ...ఆడవాళ్లూ సాధించగలరు!

19 Oct, 2014 22:11 IST|Sakshi

జీవితం ఎప్పుడూ ఒకలానే ఉండదు. ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎత్తూపల్లాలు ఎదురై ఇబ్బంది పెడతాయి. వాటిని తట్టుకుంటూ, అధిగమించుకుంటూ వెళ్లినవాళ్లే విజయ శిఖరాలను అందుకోగలరు. అందుకు అసలు సిసలు ఉదాహరణ... ఉమా అమర్‌నాథ్. ఒకప్పుడు సాధారణ గృహిణి అయిన ఆవిడ... ఇవాళ ఓ పెద్ద సంస్థను విజయవంతంగా నడపగలుగుతున్నారంటే అందుకు ఆమె పట్టుదల, శ్రమించే తత్వమే కారణం. టీఎంసీ సారథిగా తన పయనం గురించి ఉమా అమర్‌నాథ్ సాక్షితో జరిపిన సంభాషణ ఇది... 
దీపావళి అంటే వ్యాపారస్తులకు, కస్టమర్లకూ కూడా పండుగే. ఈ యేడు దీపావళి ఎలా ఉండబోతోంది?

ఎప్పటిలాగే ఈసారి కూడా మా కస్టమర్లకు మేం మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నాం. వెయ్యి రూపాయల కొనుగోళ్లు చేసిన వాళ్లందరికీ కూపన్లు ఇస్తాం. దీపావళికి తీసే డ్రాలో పాతిక లక్షల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. అలాగే బంపర్ డ్రా విజేతకు 45 లక్షల విలువ గల డ్యూప్లెక్స్ విల్లాను ఇటాలియన్ ఫర్నిచర్‌తో సహా ఇవ్వబోతున్నాం.
     
250 కోట్ల టర్నోవర్ ఉన్న టీఎంసీ సంస్థకి సీఎండీ స్థానంలో ఉండటమంటే మాటలు కాదు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నడిపిస్తున్నారు?

ఈ సామ్రాజ్యాన్ని నా భర్త అమర్‌నాథ్ సృష్టించారు. ఆయన ఎంత మంచి వ్యాపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న వయసు నుంచీ పట్టుదలతో, స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి ఆయన. టీఎంసీ ఆయన కలల పుత్రిక. నిద్రలో కూడా టీఎంసీ అనే కలవరించేవారు. రాత్రీపగలూ దీని అభివృద్ధి కోసం పాటు పడ్డారు. ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆయన లేరు. ఆయన కలల్ని నెరవేర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదే నన్ను నడిపిస్తోంది.
     
ఆయన మీకు దూరమైన ఆ దురదృష్టకర సంఘటన గురించి...?

అది 2011, డిసెంబర్ 4. ఆ రోజు ఉదయం మామూలుగానే లేచారు.  ఒక ఫంక్షన్ ఉంటే దాని ఏర్పాట్ల గురించి ఫోన్లలో మాట్లాడుతున్నారు. అంతలో ఛాతిలో నొప్పి అన్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. కానీ ఆరోజు ఆదివారం కావడంతో స్పెషలిస్టులెవరూ అందుబాటులో లేరు. వాళ్లు వచ్చేసరికి ఆలస్యమైపోయింది. నా కళ్లముందే ఆయన ఊపిరి ఆగిపోయింది. ఒక్కసారిగా అంతా శూన్యమై పోయినట్టుగా అనిపించింది. ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఎప్పుడూ హుషారుగా, చలాకీగా ఉండే ఆయన అంత త్వరగా (44 యేళ్లు) వెళ్లిపోతారని ఊహించలేదు!
     
టీఎంసీ బాధ్యతలు చేపట్టాలన్నది మీ నిర్ణయమేనా? ఎవరైనా అటు నడిపించారా?

పిల్లలు చిన్నవాళ్లు. బాధ్యత తీసుకోవడానికి ఎవరూ లేరు. దాంతో ఆయన పోయిన పదిహేను రోజులకే నేను ఆయన స్థానంలోకి వెళ్లక తప్పలేదు.
     
ఉన్నట్టుండి అంత పెద్ద బాధ్యత... భయం వేయలేదా?

చాలా భయపడ్డాను. నిజానికి నేను వ్యాపారస్తుల కుటుంబం నుంచే వచ్చాను. ఓ వ్యాపారికే భార్యనయ్యాను. కానీ వ్యాపారం గురించి నాకేమీ తెలియదు. కేవలం డిగ్రీ చదివిన నేను, ఓ కంపెనీని నడపాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. దాంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. దేవుడి దయవల్ల ముందు నుంచీ మా దగ్గర మంచి స్టాఫ్ ఉన్నారు. వాళ్లంతా అండగా నిలబడ్డారు.
     
వ్యాపార రంగం అనేది నేటికీ పురుషుల ప్రపంచమే. ఓ మహిళగా ఇక్కడ మీరెలా మనగలుగుతున్నారు?
 
కొంతమంది అంటుంటారు... ఆడవాళ్లు ఏం చేయగలరు అని! అవకాశం రావాలేగానీ ఆడవాళ్లు కూడా అన్నీ సాధించగలరు. మావారు ఉన్నప్పుడు నేను దీపావళికి పూజ చేయడానికి మాత్రమే ఆఫీసుకు వచ్చేదాన్ని తప్ప, ఆఫీసులో ఏం జరుగుతుందో పట్టించుకునేదాన్నే కాదు. కానీ ఏం జరిగింది? ఇల్లు విడిచి ఓ కొత్త ప్రపంచంలోకి రావాల్సి వచ్చింది. ఇంతమందిని డీల్ చేయాల్సి వచ్చింది. వెనకడుగు వేసివుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేది? మా కంపెనీ ఏమయ్యేది?!
 
మీ పిల్లల గురించి చెప్పండి...?

బాబు పన్నెండో తరగతి చదువుతున్నాడు. పాప ఈ మధ్యనే లండన్‌లో డిగ్రీ పూర్తి చేసి వచ్చింది. ఓ రెండేళ్లు ఇక్కడే పని చేసి, మాస్టర్స్ కోసం మళ్లీ విదేశాలకు వెళ్లిపోతుంది.
 
ఓ పక్క పిల్లలు... మరోపక్క కంపెనీ... లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?

ఆయన హఠాత్తుగా దూరమైనప్పుడు నేను పిల్లల గురించి కంటే కంపెనీ గురించే ఎక్కువ ఆలోచించాను. కంపెనీని పైకి తీసుకెళ్లడం తర్వాత, ముందు పడిపోకుండా నిలబెట్టాలనుకున్నాను. అదృష్టం కొద్దీ పిల్లలు కూడా నా తపనను అర్థం చేసుకున్నారు. అంతేకాదు, నాకు  ధైర్యం చెప్తూ ఉంటారు. మా పాప అంటుంది... ‘‘మమ్మీ... డాడీ మనకు అన్నీ ఇచ్చి వెళ్లారు. అందుకే మనం ఇవాళ ఇలా అయినా ఉన్నాం. డాడీ అనుకున్నవన్నీ మనం చేయాలి. కంపెనీని నిలబెట్టాలి’’ అని! ఇంత మంచి పిల్లలున్నందుకు గర్వంగా ఉంటుంది నాకు!
   
అమర్‌నాథ్‌గారి పేరు మీద ‘అమర్‌నాథ్ ఎన్. ప్రమోషనల్ బ్లిట్జ్ అవార్డు’ ఇస్తున్నారు కదా... దాని గురించి చెప్పండి?
 
బజాజ్ గ్రూప్‌వాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్లలో ఒక ఉత్తమ డీలర్‌ను ఎంపిక చేసి, వారికి మావారి పేరుమీద అవార్డునివ్వాలని నిర్ణయించుకున్నారు. అమర్‌నాథ్ ఎప్పుడూ కొత్త కొత్త స్కీములు ఆలోచించి, ముందు తను వాటిని ఆచరణలో పెట్టి విజయం సాధించి, తర్వాత మిగతా డీలర్లందరినీ కలిసి అలా చేయమని ప్రోత్సహించేవారట. అందుకే ఆయన పేరు మీద అవార్డును నెలకొల్పాలనుకుంటున్నామని వాళ్లు చెప్పగానే చాలా ఆనందపడ్డాను. మరీ సంతోషకరమైన విషయం ఏమిటంటే... నెలకొల్పిన తర్వాత వరుసగా రెండేళ్లూ మా కంపెనీయే ఆ అవార్డును గెలుచుకోవడం!
 
మరి మీవారి గుర్తుగా మీరు కూడా ఏదైనా చేయాలనుకుంటున్నారా?
 
ప్రతి జిల్లాలోనూ టీఎంసీ ఉండాలనేది అమర్ నాథ్ కోరిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎనిమిది, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఒక్కోటి చొప్పున షోరూమ్స్ ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో కూడా మా షోరూములు ప్రారంభించడమే నా ముందున్న లక్ష్యం. అది మాత్రమే కాదు... ఆయన ఎప్పుడూ ఒక హాస్పిటల్ కట్టించాలి అనేవారు. ఆ పని నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. ఆయన కోరిక తీర్చడం కోసమే కాదు. ఆయనకి జరిగినట్టు ఎవరికీ జరగకుండా ఉండటం కోసం. బోలెడంత డబ్బు ఉంది. చికిత్స చేయించుకోగల స్తోమతా ఉంది. కానీ ఏం లాభం? సమయానికి డాక్టర్లు లేక మావారు ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు. వారం పొడవునా, ఏ సమయంలో ఏ రోగి వచ్చినా వైద్యం అందించే విధంగా ఓ ఉత్తమ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని ఉంది. దానికి కాస్త సమయం పట్టవచ్చు. కానీ ఎప్పటికైనా చేసి తీరతాను. ఆ రెండూ చేసిన రోజున, ఓ భార్యగా నా భర్త కలలను నిజంగా నిజం చేసినదాన్ని అవుతాను!    
 
 - సమీర నేలపూడి
 
మేమెప్పుడూ అలా ఆలోచించం. అమర్‌నాథ్ ఎప్పుడూ ఒకటే చెప్పేవారు... తక్కువ లాభం తీసుకోవాలి, కస్టమర్లను ఎక్కువ శాటిస్‌ఫై చేయాలి అని! అది ఏ వ్యాపారికోగానీ ఉండని గొప్ప దృక్పథం. ఎప్పుడూ కస్టమర్లను సంతోషపెట్టడానికే చూసేవారాయన. అదే మా కంపెనీని ఉన్నత స్థాయికి చేర్చింది. అందుకే నేనూ ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాను. ఆయన పాలసీనే ఫాలో అవుతున్నాను.
 

మరిన్ని వార్తలు